Vyooham Teaser: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సంబంధించిన చిత్రంగా ఆర్జీవీ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తీస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) పాత్రలో హీరో అచ్చం అలాగే ఒదిగిపోయారు. (Vyooham Teaser)
కొంత కాలంగా రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాలను రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) ఎంచుకుంటున్నారు. ప్రజల్లో ఆసక్తి కలిగించేలా చిత్రాలను తీయడంలో వర్మకు పోటీ మరొకరు లేరనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే తాజాగా వ్యూహం చిత్రాన్ని తీస్తున్నారు వర్మ. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వర్మ ప్రకటించారు. సినిమాకు సంబంధించిన విషయాలను జగన్‌కు వివరించేందుకేనేమో… తాడేపల్లికి రెండు సార్లు వచ్చి జగన్‌తో భేటీ అయ్యారు రామ్ గోపాల్ వర్మ.
నేడు వ్యూహం టీజర్‌ను విడుదల చేశారు ఆర్జీవీ. ఇందులో డైలాగులు ఒకటి రెండు మినహా.. అంతా బ్యాక్ డ్రాప్‌లో మ్యూజిక్ ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ లో ప్రయాణించడంతో ఈ సినిమా కథ మొదలవుతుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది. సినిమాలో క్యారెక్టర్లు ఒక్కొక్కటీ యాజ్ ఇటీజ్ దించేశారు రామ్ గోపాల్ వర్మ. సీఎం జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటిస్తున్నారు. జగన్ సతీమణి భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణజేటి రోశయ్య పాత్ర కూడా డిట్టో దించేశారు వర్మ.
పాత్రలను ఎంపిక చేయడంలో తనకు తానే సాటి అని వర్మ నిరూపించారంటూ సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ హావభావాలను మొత్తంగా అజ్మల్ అనుకరించాడని చెబుతున్నారు. చంద్రబాబు పాత్రనూ లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచే తీసుకున్నారు. ఇక ఆఖర్లో జగన్ ఓ డైలాగ్ వదిలారు. అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు.. అంటూ డైలాగ్ ఉంది.
వైఎస్సార్ మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, జగన్ పై కేసులు పెట్టడం, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం, ఓదార్పు యాత్ర, సొంత పార్టీ స్థాపన… ఇలా అన్ని కోణాలనూ వర్మ టచ్ చేశారు. మొత్తంగా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ వైరల్ అయ్యింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైనికులు తెగ షేర్లు చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ స్వయంగా దర్శకత్వం చేస్తున్నారు. జగన్ హావభావాలతో హీరో అత్యంత ఆకట్టుకున్నారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వ్యూహం, శపథం అని రెండు పార్ట్ లుగా సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఓదార్పుయాత్ర, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, కడప లోక్‌సభ ఉప ఎన్నికలో రికార్డుస్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించడం, అనంతరం ఆయనపై ప్రత్యర్థి పార్టీలు బనాయించిన అక్రమ కేసులు ఇలా మూవీలో స్పృశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రెండో పార్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, 2014 తరువాతి రాజకీయ పరిణామాలు, ముఖ్యమంత్రిగా జగన్ ప్రజల మన్ననలను ఎలా అందుకుంటున్నారనే విషయాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన తీరు, మైక్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం, ప్రజాసంకల్ప యాత్రకు దారి తీసిన పరిణామాలను రెండో వివరంగా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: RGV On CBN: రజనీకాంత్ కూడా వెన్నుపోటు పొడిచినట్లే.. తారక్ ఒకే ఒక్క మగాడు!