ఆదివారం, 29 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
National

Char Dham Yatra: హిమాలయాల్లో మేఘా మరో ఘనత.. చార్‌ధామ్‌ యాత్రికులకు రైలు ప్రయాణం మరింత చేరువ!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 29 నవంబర్ 2026

Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర చార్‌ధామ్‌ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు రైలు ప్రయాణ సౌకర్యం మరింత చేరువ కానుంది. ప్రతిష్ఠాత్మక రిషికేశ్‌–కర్ణప్రయాగ్‌ రైల్వే ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి నమోదైంది. రుద్రప్రయాగ్‌ జిల్లాలో 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌–14 ప్రధాన సొరంగం తవ్వకాలను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (MEIL) విజయవంతంగా పూర్తి చేసింది. హిమాలయాల్లో అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణాన్ని అధిగమిస్తూ ఈ ఘనత సాధించింది.

చార్‌ధామ్‌ యాత్రికులకు ఎంతో ప్రయోజనం

రిషికేశ్‌–కర్ణప్రయాగ్‌ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలకు వెళ్లే భక్తులకు మెరుగైన రవాణా అనుసంధానం లభించనుంది. రైలు ద్వారా పర్వత ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి రహదారి మార్గంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు. ముఖ్యంగా యాత్రా సీజన్‌లో రహదారులపై రద్దీ, ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. వృద్ధులు, కుటుంబ సమేతంగా యాత్రలకు వెళ్లే భక్తులకు ఈ ప్రాజెక్టు ప్రయోజనకరంగా మారనుంది.

రెండు వైపుల నుంచి సొరంగం తవ్వకాలు

సుమేర్‌పూర్‌, మారోరా పోర్టళ్ల నుంచి చేపట్టిన సొరంగం తవ్వకాలను విజయవంతంగా అనుసంధానించారు. సుమేర్‌పూర్‌ వైపు నివాస ప్రాంతాల కింద సుమారు 110 మీటర్ల మేర వదులైన మట్టిలో ట్రిపుల్‌ ట్రాక్‌ సొరంగాన్ని తవ్వడం సవాలుగా మారింది. ఇందుకోసం ప్రీ ఎక్స్‌కవేషన్‌, మల్టీ డ్రిఫ్టింగ్‌ వంటి ప్రత్యేక సాంకేతిక పద్ధతులను వినియోగించారు. మారోరా వైపు కొండ వాలుల స్థిరత్వాన్ని కాపాడేందుకు మైక్రోపైల్స్‌, రాక్‌ బోల్ట్స్‌, గ్రౌటింగ్‌ పద్ధతులను అమలు చేశారు. నివాస ప్రాంతాల భద్రతను దృష్టిలో ఉంచుకుని పగటిపూట మాత్రమే నియంత్రిత బ్లాస్టింగ్‌ నిర్వహించారు.

జోజిలా తర్వాత మేఘా మరో మైలురాయి

ఈ ఏడాది జూన్‌లో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానానికి ఉపయోగపడే జోజిలా సొరంగం బ్రేక్‌త్రూ సాధించిన మేఘా సంస్థ.. తాజాగా హిమాలయాల్లో మరో కీలక ఘనతను అందుకుంది. ఎముకలు కొరికే చలి, భారీ వర్షాలు, భూగర్భంలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ ఇంజినీర్లు, జియాలజిస్టులు, కార్మికులు సమష్టిగా పనిచేశారు. ఆధునిక యంత్రాలు, ప్రత్యేక వెంటిలేషన్‌ వ్యవస్థలతో తవ్వకాలను కొనసాగించారు.

పర్యాటకం, ఉపాధికి కొత్త అవకాశాలు

రిషికేశ్‌–కర్ణప్రయాగ్‌ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాఖండ్‌లోని మారుమూల పర్వత ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకుల సంఖ్య పెరగడంతో స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రవాణా రంగం, ఉపాధి అవకాశాలకు ఊతం లభించనుంది. తాజాగా టన్నెల్‌–14 బ్రేక్‌త్రూ సాధించడంతో ఈ ప్రతిష్ఠాత్మక రైల్వే ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది.

ఇవీ చదవండి: Viral video: వైరల్ వీడియో: పర్యాటకుడిపై 900 కిలోల బైసన్ దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వృద్ధుడు.. ఎల్లోస్టోన్‌లో భయానక ఘటన
Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల పర్యాటకులపై ఆందోళన

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.