ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) మరో కొత్త కార్యక్రమం ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం (Jaganannaku Chebudham) పేరిట 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకొచ్చారు. ఈ నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సీఎం జగన్ (YS Jagan) వెల్లడించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకో సీనియర్ ఆఫీసర్‌ను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) ఫుల్ స్పీచ్ ఇదే..
”3,648 కిలోమీటర్ల మేర నా పాదయాత్రలో నేను చూసిన సమస్యలు, నాకు కనిపించిన సమస్యలు పరిష్కారం చేసే దిశగా మన పరిపాలన సాగింది. భుత్వం న్యాయంగా, ధర్మంగా ఉంటే 90 నుంచి 95 శాతం సమస్యలు తీర్చవచ్చు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ముసలివారు కనిపించేవారు. పింఛన్లు రాలేదు నాయనా అని చెప్పే వారు. గతంలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పింఛన్లు ఇచ్చే వారు. వారు మీరు ఏ పార్టీకి చెందిన వారని అడిగేవారు. ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలు కనిపించేవి. ఇంత మందికే ఇస్తాం.. మిగిలిన వారికి ఇచ్చే పరిస్థితి లేదు.. ఎవరైనా చనిపోతేనో, తప్పుకుంటేనో పింఛన్లు ఇచ్చే పరిస్థితి నాడు ఉండేది.
ఇవన్నీ నా సుదీర్ఘ పాదయాత్రలో చూశాను. అర్హత ఉంటే పథకాలు ఇవ్వడం, మన పార్టీ, తన పార్టీ అనే భేదం చూడకుండా.. ఇవన్నీ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు వేశాం.
* 90 నుంచి 95 శాతం లంచాలు లేకుండా పథకాలు అర్హులైన వారందరికీ అందించాం.
* నాలుగు సంవత్సరాల మన పరిపాలనలో ఇలాంటి అడుగులే కనిపిస్తాయి.
* గ్రామ వార్డు సచివాలయాలు నెలకొల్పాం. 2 వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయం, 50 ఇళ్లకు ఓ వలంటీర్ను నియమించాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా వ్యవస్థను నడిపిస్తున్నాం.
* పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పాలనను దగ్గరకు తీసుకొచ్చే గొప్ప ఆలోచన ఈ నాలుగు సంవత్సరాల పాలనలో చేశాం.
* ఈ మాదిరిగా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, వివక్షకు, లంచాలకు తావు లేకుండా దేశంలో ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇప్పటికే స్పందన కార్యక్రమం తీసుకొచ్చాం.
* గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ల దాకా కూడా ప్రతి ఒక్కరూ దానిలో ఇన్వాల్వ్ అయ్యి సమస్యను పరిష్కరించే ఒక మెకానిజం తీసుకొచ్చాం.
* ప్రజలకు అందాల్సిన ఏ స్కీమైనా అందడంలో అసాధరణ జాప్యం జరిగితే.. దాని వల్ల ఎటువంటి కష్టం అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా ప్రతి అడుగూ ముందుకు వేశాం.
* స్పందన కార్యక్రమం తీసుకురావడం వల్ల ఇలాంటి సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపగలిగాం.
* ఇవాళ దానికంటే ఇంకా మెరుగ్గా.. జగనన్నకు చెబుదాం.. అని ముఖ్యమంత్రి పేరు కూడా దానికి జోడిస్తూ.. ఇంకా మెరుగ్గా వ్యవస్థలోకి న్యాయం వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాం.
* ఎక్కడైనా ఫలానా పథకానికి మేం అర్హులం.. అయినా కూడా మాకు పథకం రాలేదంటే, న్యాయం మీకు జరగని పరిస్థితి మీకు కనిపించినా.. ఇంతకు ముందు ప్రయత్నం చేసినా సత్ఫలితం ఇవ్వని పరిస్థితులు ఎక్కడైనా ఉన్నా కూడా.. ఇలాంటి సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపాలన్న తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.
* మున్సిపల్ కమిషనర్ దగ్గరి నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని స్థాయిల్లో భాగస్వామ్యం చేస్తున్నాం.
* సమస్యకు పరిష్కారం చూపించిన తర్వాత అటువైపున ఉన్నమనిషికి మనం చూపించిన ఈ పరిష్కారం తర్వాత ఆ మనిషిలో చిరునవ్వును చూడాలనే తపనతో ముందుకెళ్తున్నాం.
* సమస్య వస్తే ఏ ప్లాట్ ఫామ్లో అయినా సరే.. ఒకసారి గట్టిగా ప్రయత్నం చేయండి.. అర్హత ఉండి కూడా మనకు రాని పరిస్థితులు ఉంటే, ప్రయత్నం చేసినా కూడా సత్ఫలితాలు రాని పరిస్థితి ఉంటే జగనన్నకు చెబుదాం అనే ఈ కార్యక్రమం ద్వారా న్యాయం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.
* అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందకపోతే.. వైఎస్సార్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, సామాజిక వర్గాలకు అందాల్సిన పథకాలుగానీ, ఆరోగ్యశ్రీ సేవలు… ఇలా ఏ పథకమైనా సరే.. లేదా డిపార్ట్ మెంట్ కు సంబంధించిన పథకాలు గానీ.. ఎక్కడైనా కూడా మనం ప్రయత్నం చేసినా కూడా సత్ఫలితాలు రాకుంటే నేరుగా మీ జగన్‌కే, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ ఇంట్లో మీ బిడ్డకే.. నేరుగా మీ జగన్ కే ఫోన్ కొట్టండి.. డైరెక్టర్గా 1902కు ఫోన్ చేయండి.
* 1902 నంబర్ కు ఫోన్ చేస్తే.. నేరుగా నా దృష్టికే సమస్య వస్తుంది. సమస్యను చెప్పిన తర్వాత యూనిక్ ఐడీ నంబర్ ఇస్తారు. వైఎస్సార్ ఐడీ ఇస్తాం. నాన్నకు గౌరవం ఇస్తూ..
* మీ సమస్య నా సమస్యగా భావించి దాన్ని ట్రాక్ చేస్తాం.. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఎలా పరిష్కారం చూపాలో నేరుగా సీఎంవో అధికారులు చూస్తారు. ఐవీఆర్ఎస్ ద్వారా మీకు కూడా సమస్యను ట్రాక్ చేసే సౌలభ్యం.
* మండల కేంద్రం నుంచి మానిటరింగ్ ఉంటుంది. జిల్లా కేంద్రంలో, సచివాలయాల్లో, సెక్రటేరియట్ స్థాయిలో, సీఎంవోలో, చీఫ్ సెక్రటరీ, డీజీపీ.. ముగ్గురూ కూడా డ్రైవ్ చేసే కార్యక్రమానికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
* ప్రతి చోటా మీ సమస్యకు వాళ్లు మానిటరింగ్ చేస్తారు. మానిటర్ చేస్తూ మీకు సొల్యూషన్ ఇస్తారు.
* సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా మీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం.
* మీకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. ప్రతి అడుగులోనూ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా.. అందులో భాగంగా ఇంకా ఓ మెరుగైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా.. ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి కూడా ప్రజలకు మంచి చేసేలా పని చేయాలి.
* ప్రతి ఒక్కరి మొహంలో కూడా చిరునవ్వు చూడాలని మనమంతా కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమం ఇది. ప్రభుత్వంపై నమ్మకం ఇంకా పెంచేందుకు వేస్తా ఉన్న అడుగులు ఇవి. ప్రతి అధికారినీ సవినయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరింత మంచిజరగాలని ఆశిస్తూ.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also : YSR Kalyanamasthu Shadi tofa: వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పూర్తి వివరాలివే..