కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ ఇవాళ కాస్త తక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఒక్క కంపార్ట్మెంట్లోనే భక్తులు వేచి ఉన్నారు. వారం మధ్యలో కావడంతో భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మంగళవారం 65,237 మంది భక్తులు తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.50 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 22,926 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
మే జూన్ నెలకు అన్ని టికెట్స్, తిరుమల రూమ్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. జూలైకి సంబంధించినవి టికెట్స్, రూమ్స్ మే 20 తేదీ తరువాత విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక టికెట్స్ లేని వారు తిరుపతిలో ఇచ్చే ఉచిత దర్శనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇస్తారు.
టికెట్లు పొందేందుకు ప్రదేశాలు
1. విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ ఎదురుగా)
2. గోవింద రాజుల సత్రాలు (రైల్వే స్టేషన్ వెనుక వైపు)
3. శ్రీనివాసం (బస్ స్టాండ్ కి ఎదురుగా)
4. నడిచి వెళ్లేవారికి స్పెషల్ దర్శనం టికెట్లు ఇస్తున్నారు.
5. అలిపిరి మెట్ల మార్గం లో వెళ్లేవారు భూదేవి కాంప్లెక్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది.
6. అలిపిరి మెట్లమర్గం వద్ద టికెట్లు ఇచ్చే సమయం తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా.
7. శ్రీవారి మెట్ల మార్గం లో వెళ్లే వారికి మెట్ల మార్గం మధ్యలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య టికెట్లు ఇస్తున్నారు.
ఇక గదుల విషయానికి వస్తే.. రూమ్ లేని వారు కొండపైన సీఆర్వో ఆఫీసు వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 24 గంటల పాటూ గదుల ఖాళీలను బట్టి భక్తులకు ఇస్తుంటారు. ఇక శ్రీవారి దర్శనానికి 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు. సీనియర్ సిటిజన్ వయస్సు 65 సంవత్సరాలు. ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మే నెలకు అన్నీ ఇప్పటికే బుక్ అయిపోయినట్లు సమాచారం. జూన్ నెలకు మే 20వ తేదీన టికెట్లను విడుదల చేస్తారు.
ఒక సంవత్సరంలోపు పిల్లలకు ప్రత్యేక దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. పిల్లలతో పాటు తల్లి దండ్రులను ఏ టికెట్స్ లేకపోయినా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దర్శనం టీటీడీ కల్పిస్తోంది. ఆలయానికి కుడివైపున ఉన్న సుభదం దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. బేబీ బర్త్ సర్టిఫికేట్ గానీ, ఆధార్ కార్డ్ కానీ తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి.
300 రూపాయల టికెట్ ఉంటే నడిచి వెళ్లే మార్గంలో టికెట్స్ ఇవ్వరు. ఒకరోజు నడిచి మరోరోజు 300 టికెట్ దర్శనం చేసుకోవచ్చు. సుప్రభాతం ఇతర సేవల లక్కీ డ్రా టికెట్స్ కొండపైన సీఆర్వో ఆఫీస్ దగ్గర ఇస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు డ్రా వేస్తే సాయంత్రం 6 గంటలకు రిజల్ట్స్ వస్తాయి. మీ మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. డ్రా వెయ్యడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తిరుమలలో రెండవ రోజు కూడా రూమ్ లో ఉండవచ్చు. కాకపోతే రూం దగ్గర్లో గల టీటీడీ ఉద్యోగులకు తెలియజేయాల్సి ఉంటుంది. రద్దీని బట్టి అవకాశం కల్పిస్తారు. సెల్ఫోన్లో రూ.300 టికెట్స్ ఒకేసారి 6 బుక్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది. మీకు దర్శనం ఉన్న సమయం కన్నా ముందే మీరు వెళ్లవచ్చు.. రాత్రి 9 గంటలకు దర్శనం ఉంటే మీరు ఉదయం కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. తేదీ మారితే మాత్రం వెళ్లనివ్వరు. 300 రూపాయల టికెట్స్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వరు. డేట్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు.
Read Also : YS Jagan: జగనన్నకు చెబుదాం ప్రారంభం.. ముఖ్యమంత్రి ఫుల్ స్పీచ్ ఇదే..!
