Sajjala Ramakrishna Reddy: ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్, విమర్శలు గుప్పించారు అమిత్ షా. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, విశాఖపట్నం దోపిడీదారుల అడ్డాగా మారిందని ఆరోపణలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ నేరుగా స్పందించకపోయినప్పటికీ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రియాక్ట్ అయ్యారు. అమిత్ షా నిజాలు తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ ట్రాప్‌లో బీజేపీ చిక్కుకుంటోందని ఎద్దేవా చేశారు.
అమిత్ షా కామెంట్స్‌పై తాజాగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. ఓ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇచ్చిన స్క్రిప్టునే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చదివారని విమర్శించారు. అదే దారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఫాలో అయ్యారని పేర్కొన్నారు. అమిత్ షాను ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పుడైతే కలిశారో అప్పటి నుంచి బీజేపీ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సజ్జల కామెంట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఏనాడూ బీజేపీతో పొత్తులో లేదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తాము కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు సజ్జల క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిస్తే గెలుస్తాయనుకోవడం పగటి కలలు మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలన చూసిన వారెవ్వరూ కూడా మళ్లీ ఆయనకు ఓటెయ్యరని సజ్జల చెప్పారు. పవన్ కేవలం చంద్రబాబును మోయడం కోసమే రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేశారు. కాపు సామాజికవర్గం తమ పార్టీతోనే ఉందని దీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీకి ఈసారి ఇంకా ఎక్కువ ఓట్లు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని సజ్జల పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారు టీడీపీలోకి వెళితే వారికి బలం ఎలా అవుతుందని సజ్జల ప్రశ్నించారు. ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని చెప్పడం ఎల్లో మీడియా ప్రచారమేనని కొట్టిపారేశారు. తాము ఎప్పుడూ ఉద్యోగుల పక్షానే ఉన్నామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల మధ్య వైరుధ్యాలు పెట్టడం చంద్రబాబు నైజమన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకత వల్లే ఉద్యోగులు తమపై నమ్మకం ఉంచారని చెప్పారు.
పోలవరంలో చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని సజ్జల ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాదు.. అది వైఎస్సార్‌సీపీకి సెంటిమెంటు కూడా అని మరోసారి గుర్తు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా? అని సజ్జల ప్రశ్నలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ మానిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారని, అదే ఇక్కడ ప్రజలకు చెబుతూ మరోసారి వంచించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
నారా లోకేష్‌ను చూస్తే జాలిపడాలో లేక నవ్వాలో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ భాష చాలా దారుణంగా ఉందని, బూతులు మాట్లాడం ఏంటి? అని నిలదీశారు. ఎన్నికల కంటే ముందే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన చేస్తారని సజ్జల క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో పేదలకు భూమి ఇవ్వకూడదని చెప్పడమే అహంకారమని, ఇది చంద్రబాబు, ఆయన అనుయాకులకే చెల్లిందన్నారు. అమరావతి ప్రాంతంలో పేదల ఇళ్లు వేగంగా కట్టి చూపిస్తామంటూ సజ్జల పేర్కొన్నారు.
Read Also : YSR Raithu Bharosa PM Kisan: బాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది.. రైతు భరోసా నిధుల విడుదలలో జగన్