YSR Raithu Bharosa PM Kisan: బాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది.. రైతు భరోసా నిధుల విడుదలలో జగన్‌

YSR Raithu Bharosa PM Kisan: ప్రతిపక్ష నేత చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ (YSR Raithu Bharosa PM Kisan) ఐదో ఏడాది తొలి విడత నిధుల విడుదల సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిధులను బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అంతకుముందు బహిరంగ సభలోమాట్లాడిన ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష నేతపై వాగ్బాణాలు సంధించారు. సీఎం జగన్‌ ఫుల్‌ స్పీచ్‌ ఇదే..

”రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. పత్తికొండ నియోజకవర్గంలో దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి బటన్‌ నొక్కి చేయబోతున్నాం. 52,30,939 మంది నా రైతన్నల కుటుంబాలకు ఈరోజుటి కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి 3,923 కోట్ల రూపాయల మేరకు వారి ఖాతాల్లోకి పంపిస్తున్నాం. 5వ ఏడాది తొలి విడత సాయం ఇక్కడి నుంచి విడుదల చేస్తున్నాం. తాను పంట పండించే సమయానికి రైతన్న ఇబ్బంది పడకూడదు. ఒక హెక్టారు కూడా లేని వారు దాదాపు 75 శాతం మంది రైతులు ఉన్నారు. అర హెక్టారు లోపు ఉన్న వారు 50 శాతం మంది ఉన్నారు. నాలుగేళ్లలో ప్రతి ఏడాదికి రైతుకు రూ.12,500 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. (YSR Raithu Bharosa PM Kisan)

మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నామిన్నగా.. ఈరోజు రూ.13,500 ఇస్తున్నాం. రైతన్న ఇబ్బందులు పడకూడదని నాలుగేళ్లు కాదు ఐదేళ్లు, ఐదో ఏడాది కూడా ఇస్తున్నాం. రూ.50 వేలు కాదు.. రూ.67,500 ఇచ్చే గొప్ప అడుగులు మీ బిడ్డ ప్రభుత్వంలో పడుతున్నాయి. 50 లక్షల పైచిలుకు రైతులకు ప్రతి రైతన్నకు 54 వేలు వైఎస్సార్‌ రైతు భరోసా డబ్బులు ప్రతి రైతు చేతిలో పెట్టాం. ఈ రూ.7,500 కూడా కలుపుకుంటే ప్రతి రైతన్న చేతుల్లో కూడా 61,500 నేరుగా రైతన్నల కుటుంబాల ఖాతాల్లో చేర్చినట్లు అవుతుంది. 5వ ఏడాది తొలి విడతగా 52,30,939 మంది రైతుల ఖాతాల్లో 3,923 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. ఈరోజే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే 5,500 నేరుగా రైతన్నల ఖాతాల్లోకి వెళ్తాయి. మిగిలిన రూ.2 వేలు పీఎం కిసాన్‌ ఇచ్చిన తర్వాత నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది. (YSR Raithu Bharosa PM Kisan)

మేలో కచ్చితంగా జరగాలని ఈరోజే బటన్‌ నొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఈరోజు వరకు రైతన్నల ఖాతాల్లో మీ బిడ్డ ప్రభుత్వం జమ చేసిన సొమ్ము ఒక్క రైతు భరోసా డబ్బులు మాత్రమే అక్షరాలా 30,985 కోట్లు. ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఒక విప్లవాత్మక మార్పు కూడా ఇప్పటికే మీ బిడ్డ ప్రభుత్వంలో తీసుకొచ్చింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఏ సీజన్‌లో జరిగిన నష్టం ఆ సీజన్‌లోనే చెల్లిస్తున్నాం. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన వర్షాలకు నష్టపోయిన 51 వేల మంది రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మరో 54 కోట్ల రూపాయలు ఇన్‌పుట్‌ సబ్సిడీగా జమ చేస్తున్నాం ఇదే రోజే.

ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే పరిహారం..

గత నాలుగు సంవత్సరాలుగా 22,77,000 మంది రైతన్నల కుటుంబాలకు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఆదుకుంటూ.. అక్షరాలా 1,965 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశాం. ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో రైతులకు దన్నుగా నిలబడుతూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఒక గొప్ప మార్పు.. గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో కనీసం ఇటువంటి ఆలోచన అయినా ఆయనకు తట్టిందా అని అడుగుతున్నా. అసలు రైతు భరోసా కేంద్రాలే అప్పట్లో లేవు. ఆ ఊసే లేదు. 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం.

దేవుడి కరుణ, రైతన్నల కష్టం, రైతుల పట్ల, మీ బిడ్డ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ.. వీటన్నింటినీ కూడా ఒక్కచోటకు తీసుకొస్తే.. దేవుడి దయతో రాష్ట్రంలో దిగుబడి పెరిగింది. ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 2014-19 దాకా ఏటా 153 లక్షల టన్నులు ఉండేది. 2019-23 మధ్య ప్రతి ఏటా సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి చంద్రబాబు హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నులు. మనందరి ప్రభుత్వంలో ఏకంగా ఉద్యాన పంటల దిగుబడి 332 లక్షల టన్నులకు పెరిగింది.

గతంలో చంద్రబాబు హయాంలో ఏ సంవత్సరం చూసుకున్నా కరువే కరువు. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కనీసం సగం మండలాలన్నీ కరువు మండలాలుగా డిక్లేర్‌ చేసే పరిస్థితి. 1,623 కరువు మండలాలు ప్రకటించారు. రాష్ట్రంలో సగం మండలాలు కరువు పరిస్థితిలో ఉండేవి. మీ బిడ్డ హయాం ప్రారంభం అయ్యాక దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మంచి వానలు ఉన్నాయి. కరువులు లేవు, వలసలు కూడా తగ్గాయి. నాలుగు సంవత్సరాల్లో ఒక్కటటంటే ఒక్కటి కూడా కరువు మండలంగా డిక్లేర్‌చేసే పరిస్థితి రాలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రుణాల మీద సున్నా వడ్డీ కింద 40,60,000 మంది రైతన్నలకు 685 కోట్లే అందిస్తే.. మీ బిడ్డ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రైతులకు సున్నా వడ్డీ కింద 1,835 కోట్ల రూపాయలు ఇచ్చింది.

74 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ..

అక్షరాలా 74 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ ద్వారా మంచి చేయగలిగాం. చంద్రబాబు హయాంలో సున్నా వడ్డీ కింద ఇవ్వకుండా వెళ్లిన బకాయిలను కూడా చిరునవ్వుతో ఇచ్చాం. చంద్రబాబు హయాంలో 30,85,000 మంది రైతులకు 3,411 కోట్లు పట్టణ బీమా కింద ఐదేళ్లలో కలిపి ఇచ్చారు. మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగేళ్లలో మాత్రమే వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో 44 లక్షల మంది రైతులకు 6,685 కోట్లు బీమాగా ఇచ్చాం. నిరుడు ఖరీఫ్‌కు సంబంధించిన ఇన్స్యూరెన్స్ జూలై 8వ తారీఖున, నాన్నగారి పుట్టిన రోజున, వైఎస్సార్‌ జయంతి రోజున జమ చేయనున్నాం. ఒక్క రూపాయి కూడా రైతన్న నుంచి తీసుకోకుండా పూర్తి బీమా తానే భరిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే. మొట్ట మొదటి సారిగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో ఈ-క్రాప్‌ బుకింగ్స్‌ జరుగుతున్నాయి. సోషల్‌ ఆడిట్‌ కోసం ఆర్బీకేల్లో డిస్ప్లే చేస్తున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఈ-క్రాప్‌, ఆర్బీకే, సోషల్‌ ఆడిట్‌ లిస్ట్‌ పెట్టాలన్న ఊసే లేదు. గత పాలనకు ఈ పాలను తేడా గమనించాలని కోరుతున్నా.

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నులు ధాన్యం సేకరిస్తే, మనందరి ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఇప్పటికే 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది. ఇంకా రబీలో సేకరణ కార్యక్రమం జరుగుతోంది. పూర్తి కాలేదు. గతంలో సగటున ఏటా 53 లక్షల టన్నులు మాత్రమే సేకరిస్తున్న పరిస్థితి. ఈరోజు సగటున ఏటా 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో ధాన్యం సేకరణలో ఖర్చు కలుపుకొని చేసిన వ్యయం 40,237 కోట్లు. మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగేళ్లలోనే అక్షరాలా ఇప్పటికే 60 వేల కోట్లు ధాన్యం సేకరణ కోసమే ఖర్చు చేసింది. ఇంకా ఒక సంవత్సరం పెండింగ్‌ ఉంది. ఈ సంవత్సరం కూడా కలుపుకుంటే కనీసం 77 వేల కోట్లు అవుతుంది.

అగ్రి ల్యాబ్స్‌ కడుతున్నాం..

విత్తనాల దగ్గర నుంచి ఎరువుల నకిలీలన్నీ కూడా గుర్తించే విషయంలో, భూసార పరీక్షలు చేసే విషయంలో కూడా గత ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపించలేదు. ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఇప్పటికే 70 నియోజకవర్గ స్థాయిలో 70 ఆర్గానిక్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ మీ కళ్ల ఎదురుగా కనిపిస్తున్నాయి. 2 జిల్లాస్థాయి ల్యాబ్స్‌, మరో నాలుగు రీజనల్‌ కోడింగ్‌ సెంటర్లు కూడా ఇప్పటికే ఏర్పాటు అయ్యాయి. ఇవి కాకుండా మరో 77 నియోజకవర్గాల్లో ఆగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు కడుతున్నాం. 11 జిల్లా స్థాయి ల్యాబ్స్‌ కూడా కట్టడాలు మొదలయ్యాయి. ఆర్బీకే స్థాయిలో కూడా సీడ్‌ టెస్టింగ్‌, సాయిల్‌ టెస్టింగ్‌ చేసే దిశగా కూడా అడుగులు పడతున్నాయి. ఆర్బీకే రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతోంది.

వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే చేపట్టి, నిర్దిష్టంగా, సరిహద్దులను నిర్వహించి, సర్వే రాళ్లను పాతించి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేయించి వివాదాలకు తావు లేకుండా రైతన్నల చేతుల్లో భూహక్కు పత్రాలను కూడా చేతుల్లో పెట్టే కార్యక్రమం మీ బిడ్డ హయాంలో జరుగుతోంది. గ్రామ సచివాలయాలన్నింటిలోనూ అక్కడే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులను కూడా తీసుకురావాలని అడుగు పడుతోంది. ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ ఊహించని విధంగా రైతన్నలకు భూముల మీద ఉన్న సర్వ హక్కులూ వాళ్లకు ఇప్పించాలని మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులు వేస్తున్నాం. చుక్కల భూములమీద, బ్రిటిష్‌ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న భూముల మీద, గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో పెట్టిన భూములమీద కూడా సర్వ హక్కులూ రైతులకే ఇస్తూ, లక్షల ఎకరాల మీద పూర్తి హక్కును కూడా ఇచ్చిన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం.

రైతులకు ఏ ఇబ్బందీ రానివ్వం..

నాలుగేళ్ల కాలంలో నిరంతరాయంగా రైతులకు ఏ ఇబ్బందీ రాకూడదని పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. పగటి పూట ఉచిత కరెంటు ఇవ్వడానికి 1700 కోట్లు పెట్టి ఫీడర్లన్నీ బలపరిచాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరే కరెంటు ఫర్‌ యూనిట్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఆక్వా రైతులకు మంచి జరిగిస్తూ ఆక్వా రైతులకు 2,967 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇచ్చాం. దేవుడి దయ వల్ల ఈ నాలుగు సంవత్సరాలు వర్షాలు బాగా పడటం వల్ల కరువు సీమగా పేరు ఉన్న రాయలసీమ కూడా ఈరోజు కళకళలాడుతోంది. రిజర్వాయర్లన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు కూడా ఊహకందని విధంగా పెరిగిన పరిస్థితి.

రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడుతూ మరో 4 రూపాయలు అదనంగా రావాలనే తాపత్రయంతో అమూల్‌ను తీసుకొచ్చాం. అమూల్‌ రాక ముందు దోచుకుంటున్న హెరిటేజ్‌ వంటి డెయిరీలన్నీ పాడి రైతులకు ఇచ్చే ధర పెంచాల్సి వచ్చింది. అమూల్‌ వచ్చిన తర్వాత పాల ధరలు నాలుగు సందర్భాల్లో అమూల్‌ రేట్లు పెంచుకుంటూ పోయింది. పాల ధర లీటర్‌ 10 నుంచి 15 రూపాయల వరకు పెంచుకుంటూ పోయింది.
– ఆర్బీకే స్థాయిలో ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది ఏకంగా పోస్టర్లు పెట్టాం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించని ఆరు పంటలకు కూడా మీ బిడ్డ ప్రభుత్వం ప్రకటించింది. దళారులు లేకుండా ఆర్బీకే స్థాయిలో గిట్టుబాటు ధర కలిగే పరిస్థితి వచ్చింది. పశునష్ట పరిహారం కింద 667 కోట్ల రూపాయలు చెల్లించాం. ఆయిల్‌ పాం రైతులను ఆదుకొనేందుకు 85 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌చేయూత ద్వారా 5 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు పశుసంపద కొనుగోలు చేసేందుకు తోడుగా నిలబడ్డాం. పశువులకు సైతం 340 అంబులెన్స్ లు ఈరోజు అందుబాటులో రాష్ట్రంలో ఉన్నాయి.

బాబు ఎగ్గొట్టిన ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించాం..

ప్రతి నియోజకవర్గంలో అనిమల్‌ డిసీజ్‌ డయోగ్నొస్టిక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో చంద్రబాబు ఎగ్గొట్టి పోయిన 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ బకాయిలు మీ బిడ్డ ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టి పోయిన 384 కోట్ల విత్తన బకాయిలు మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించింది. గతంలో చంద్రబాబు హయాంలో ఆయన ఎగ్గొట్టి పోయిన కరెంటు బకాయిలు 8,845 కోట్లు కూడా రైతన్నల కోసం మీ బిడ్డ ప్రభుత్వమే దాన్నిమోస్తోంది. ఈరోజు ఫార్మ్‌ మెకనైజేషన్‌ ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు చూపిస్తున్నాం. ఎవరికి ఇచ్చామో తెలియదు, ఎందుకు ఇచ్చామో తెలీదు అన్న పరిస్థితి నుంచి ఒక పద్ధతి తీసుకొచ్చాం. ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ ఒక కమ్యూనిటీ సెంటర్‌ స్థాపించాం. ఆర్బీకే పరిధిలో కూడా ట్రాక్టర్‌ అందుబాటులోకి వచ్చే గొప్ప కార్యక్రమం జరుగుతోంది.

ఫాం మెకనైజేషన్‌ కోసం అక్షరాలా 1,052 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రతి ఆర్బీకే స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నాం. ఆర్బీకే స్థాయిలో రైతన్నలు గ్రూప్‌ కింద ఫామ్‌ అయ్యి, పది శాతం కడితేచాలు, 40 శాతం ప్రభుత్వం సబ్సిడీ, మరో 50 శాతం లోన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అరేంజ్‌ చేసి దాదాపు 15 లక్షల విలువ చేజే ట్రాక్టర్లు, ఇటువంటి సామాగ్రి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వ్యవసాయ యంత్రీకరణ అనేది మీనింగ్‌ ఫుల్‌గా సాగుతోంది. వ్యవసాయంలో మొట్ట మొదటి సారిగా ఆర్బీకే స్థాయిలోకే డ్రోన్లు తీసుకొచ్చే గొప్ప అడుగులు పడుతున్నాయి. మన రైతులే డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే పరిస్థితి కూడా త్వరలోనే రాబోతోంది.

రైతుకు శత్రువు చంద్రబాబే..

రైతుకు శత్రువైన చంద్రబాబు.. వ్యవసాయం దండగన్న చంద్రబాబు.. రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికే ఆ తీగలు తరమైతాయని చెప్పిన చంద్రబాబు.. తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని, పొరపాటున ఓటు వేసిన రైతుల్ని నిలువునా ముంచిన ఈ చంద్రబాబు.. నిన్నగాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామా కంపెనీ మాదిరిగా ఒక షో జరిగింది. ఆ డ్రామా పేరు మహానాడు అనిపేరు పెట్టుకున్నారు. 27 సంవత్సరాల క్రింత తానే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి మళ్లీ తామే ఆ మనిషి యుగపురుషుడని, ఆమనిషి శకపురుషుడని, ఆ మనిషి రాముడని, ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్లీ ఫొటోకు దండ వేస్తారు.

మహానాడు డ్రామాకు ముందు వాళ్లు చేసిన ప్రకటన.. తమ పార్టీ ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్‌ మేనిఫెస్టోను ముందే ప్రకటించారు. మేనిఫెస్టోను ఆకర్షణీయమైన మేనిఫెస్టోగా సంబోధించి ప్రకటించడం ఆశ్చర్యం అనిపించింది. దీన్ని చూస్తే కొన్ని పాత్రలు, కొన్ని కథలు గుర్తుకొస్తాయి. పసిపిల్లవాడైన కృష్ణుడిని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెబుతున్నట్లుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగానే మోసపూరిత స్త్రీ వేషంలో రావడం గుర్తుకు వచ్చింది. అందమైనమాయ లేడి రూపంలో సీతమ్మ వద్దకు వచ్చిన మారీచుడు కూడా గుర్తుకు వచ్చాడు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి వేషం, గెటప్‌ మార్చుకొని భవతీ భిక్షాందేహీ అని అడిగిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు. ఈ మూడు క్యారెక్టర్లు కలిపి మన ఏపీలో ఒక మనిషిగా జన్మించాడు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి.

అదీ చంద్రబాబు క్యారెక్టర్…

ఈ చంద్రబాబు క్యారెక్టర్‌ ఏమిటీ అంటే.. మేనిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికకూ ఒక వేషం వేస్తాడు. వాగ్దానానికో మోసం చేస్తాడు. ఈయన సత్యం పలకడు. ధర్మానికి కట్టుబడడు. మాట మీద నిలబడడు. విలువలు విశ్వసనీయత అసలే లేవు. తమ పార్టీ అధ్యక్షుడు, పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావును అయినా సరే పొడుస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలనైనా సరే పొడుస్తాడు. అధికారం కోసం ఎవరినైనా పొడవడం కోసం వెనుకాడడు. అదీ చంద్రబాబు క్యారెక్టర్‌. చంద్రబాబు బాబు పొలిటికల్‌ ఫిలాసఫీ ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో.. ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం.. నా ఓదార్పు యాత్ర వల్ల, నా పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ, వాటి పరిష్కారం దిశగా, ప్రజల ఆకాంక్షలు, అవసరాల నుంచి వారి గుండె చప్పుడుగా పుట్టిందీ మన పార్టీ మేనిఫెస్టో.

బాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది..
చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాత్రం మన ఏపీలో పుట్టలేదు. ఈ పెద్దమనిషి జనంలో తిరగడు కాబట్టి. ఆయన మేనిఫెస్టో పుట్టింది కర్ణాటకలో. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడి అక్కడ రెండు పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కలిపేసి ఒక విస్తరిలో మనకు వండేశాడు ఈ పెద్దమనిషి. మన అమ్మ ఒడి, మన చేయూత, మన రైతు భరోసా.. ఇలా మన పథకాలన్నీ కాపీ కొట్టేసి ఇంకో పులిహోర వండేశాడు. వైఎస్సార్‌ గారి పథకాలన్నీ కాపీ, జగన్‌ పథకానల్నీ కాపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పథకాలూ కాపీ, చివరికి బాబు బతుకే కాపీ, మోసం. ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు, పర్సనాలిటీ, క్యారెటక్టర్‌ లేదు. క్రెడిబులిటీ అంతకన్నా లేనే లేదు. పోటీ చేసేందుకు ఈ పెద్ద మనిషికి 175 నియోజకవర్గాల్లో 175 క్యాండెట్లు కూడా లేని పార్టీ అది. మైదానాల్లో మీటింగ్‌లు పెడితే ఇరుకైన సందులు, గొందులు, మనుషులు చనిపోయినా పర్వాలేదని చెప్పి వెతుక్కుంటున్న పార్టీ ఇది. పొత్తుల కోసం ఎంతకైనా కూడా దిగజారే పార్టీ ఇది. ఏ గడ్డయినా కూడా తినడానికి వెనకాడని పార్టీ ఇది. జనంలో లేని ఈ బాబు పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు.. ఇదీ వీరి పార్టీ ఫలాసఫీ.

30 ఏళ్ల తర్వాత కూడా ఇంకో చాన్స్‌ ఇవ్వండని అడుగుతున్న బాబు..

1995లోనే సీఎం అయ్యాడు. సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఇంకోచాన్స్‌ ఇవ్వండి అంటున్నాడు. సీఎంగా ఉన్న ఆ రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి ఈ మనిషి నోట్లో నుంచి మాటలు రాలేదు. 14 సంవత్సరాలు పరిపాలన చేశానని చెప్పుకుంటాడు. కనీసం చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నిజానికి ఈ పెద్ద మనిషి నమ్మిన రైతుల్ని, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, యువతను, అవ్వాతాతలను అందరినీ హోల్‌ సేల్‌గా మోసం చేశాడు. మొదటి సంతకానికి ఓ క్రెడిబులిటీ, విశ్వసనీయత ఉంటుంది. చంద్రబాబు మొదటి సంతకమే ఓ మోసం, వంచన, దగాగా మార్చిన వ్యక్తి ఈ బాబు. మరోసారి మళ్లీ కొత్త వాగ్దానాలతో జనం ముందుకు వస్తున్నాడు. కొంగ జపం మొదలు పెట్టాడని గమనించాలి. మంచి చేయడం చంద్రబాబు డిక్షనరీలో లేదు.

చంద్రబాబు, గజదొంగల ముఠా.. ఆయనకు తోడుగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, వీరికి తోడు ఒక టీవీ5, వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు. వీళ్లందరికీ కూడా వీళ్లు చేస్తోంది రాజకీయ పోరాటం కాదు.. వీరికి అధికారం కోసం ఆరాటం. ఆఅధికారం కూడా ఎందుకు అంటే.. దోచుకోవడానికి, దోచుకున్నది నలుగురూ పంచుకొని తినడానికి. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఓ యుద్ధం జరగబోతోంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో వాళ్లు దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మధ్య.. మీ బిడ్డ హయాంలో బటన్‌ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లే కార్యక్రమం డీబీటీకి మధ్య యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు గారి డీబీటీ కావాలా, మీ బిడ్డ బటన్‌ నొక్కే డీబీటీ కావాలా ఆలోచించుకోవాలని కోరుతున్నా. ఈ రోజు యుద్ధం జరుగుతోంది కులాల మధ్య కాదు.. పేద వాడు మన వైపున ఉంటే పెత్తం దారులు అటువైపున ఉండి యుద్ధం జరుగుతోందని మర్చిపోవద్దు. వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోంది.

మీ బిడ్డ హయాంలో 65 శాతంపైగా కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే..

మీ బిడ్డ హయాంలో ఈరోజు 65 శాతంపైగా క్యాబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనార్టీ సోదరులు కనిపిస్తారు. 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే నలుగురు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులే కనిపిస్తారు. అటువైపున ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే మాటలు, బీసీల తోకలు కత్తిరిస్తా అనే మాటలు వినిపిస్తాయి. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అక్కచెల్లెమ్మలను కూడా వెటకారం చేసిన మాటలు కనిపిస్తాయి. వారిది జగన్‌తో కాదు యుద్ధం.. పేదలతో యుద్ధం అని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. మీ బిడ్డకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఓ ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, ఓ టీవీ5 తోడుగా నిలబడకపోవచ్చు, ఓ దత్తపుత్రుడు నిలబడకపోవచ్చు. మీ బిడ్డ దేవుడి దయను, మీ చల్లని దీవెనలను నమ్మకున్నాడు. వాళ్లు చెబుతున్న అబద్ధాలను నమ్మకండి, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని కోరుతున్నా.

మీ బిడ్డకు ఆ దేవుడి ఆశీస్సులు, మీ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని, మనసారా కోరుకుంటున్నా. ఆ దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కూడా రాష్ట్రంపట్ల కూడా ఉండాలని, వర్షాలు మెండుగా పడాలని, రైతన్నల ముఖంలో చిరునవ్వులు ఉండాలని, మనసారా కోరుకుంటూ బటన్‌ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా.” అని సీఎం జగన్‌ తన స్పీచ్‌ను ముగించారు.

Read Also : YSR Yantra Seva: వైఎస్సార్ యంత్రసేవ పథకం.. ప్రభుత్వం ఏం ఇస్తుంది?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles