Retirement Age: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును జగన్ సర్కార్ పెంచింది. అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసు ఇప్పటి వరకు 62 ఏళ్లు ఉంది. దాన్ని 65 ఏళ్లకు పెంచుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీల అధ్యాపకులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకులందరికీ పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. (Retirement Age)
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల వయసును గత ప్రభుత్వంలో చంద్రబాబు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ 62 ఏళ్లకు చేర్చారు. ప్రస్తుతం విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగుల వయసును పెంచుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Read Also : Global Tigers Day: ఎస్వీ జూ పార్కులో గ్లోబల్ టైగర్స్ డే వేడుకలు
కొత్త నియామకాల జోలికి పోకుండా ఉన్న వారితోనే పని చేయించుకొనేలా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం వర్సిటీల్లో పని చేసే అధ్యాపకుల రిటైర్‌మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి ఏకంగా 65 ఏళ్లకు పెంచారని చెబుతున్నారు. ఉత్సాహంగా పని చేసే వారికి ఇబ్బంది ఉండదని, వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
60 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలా మందికి బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, నడుంనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలన్నీ చుట్టు ముడతాయి. ఈ క్రమంలో వేళకు మందులు వేసుకోవడం, పూటకు భోజనం చేయడం లాంటివి తప్పనిసరి. ఉద్యోగ బాధ్యతలు ఈ వయసులో అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also : Caveat Petition: కేవియట్ పిటిషన్ అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలేంటి? ఎవరు వేయవచ్చు?