TTD Big News: తిరుమల నడక దారిలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హై అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి సహా అధికారులు పరిశీలించారు. చిరుతను పట్టుకొనేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సెక్యూరిటీ అరేంజ్ చేశారు. గుంపులు గుంపులుగా భక్తులను అనుమతిస్తున్నారు. దీంతోపాటు ఇవాళ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రక్షణ దిశగా పటిష్ట చర్యలు చేపట్టింది. (TTD Big News)
చిన్నారులపై క్రూరమృగాల దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో శనివారం రాత్రి చిరుతల సంచారం కనిపించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టీకరించింది. అదేవిధంగా రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది.
కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. క్రూరమృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకారం అందించాలని టీటీడీ విజ్క్షప్తి చేసింది.
అలిపిరి కాలినడక మార్గంలో ఈవో ధర్మారెడ్డి తనిఖీలు
అలిపిరి కాలినడక మార్గంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. ప్రసన్నాంజనేయ స్వామి గుడి నుంచి నరసింహ గుడి వరకు భద్రతా ఏర్పాట్లు పరిశీలన చేశారు. సాయంత్రం 6 నుంచి భక్తులను బృందాలుగా పంపించే ఏర్పాట్లపై ఈవో ఆరా తీశారు. బాలికపై చిరుతదాడి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అలిపిరి దగ్గర టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులను ఒంటరిగా వెళ్లకుండా అధికారులు చూసుకుంటున్నారు. భక్తులతో పాటు ఎస్కార్ట్ పోలీసులు, అధికారులు వెళ్తున్నారు.
తిరుమలలో ముమ్మరంగా సాగుతున్న ఆపరేషన్ చిరుత
బాలికపై చిరుత దాడి చేసిన అటవీప్రాంతంలో 2 బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను అటవీ శాఖ పర్యవేక్షిస్తోంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 35వ మలుపు వద్ద చిరుత కదలికలు గుర్తించారు. వెహికల్ సైరన్ వేసి చిరుతను విజిలెన్స్ సిబ్బంది అడవిలోకి తరిమారు. కట్టుదిట్టమైన భద్రతా మధ్య గుంపులుగా కాలినడకన తిరుమలకు భక్తులు వెళ్తున్నారు.