Tirumala Samacharam (21-07-2023): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు విడుదల చేయనున్నారు. స్వామి వారి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. మరోవైపు ఈనెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. (Tirumala Samacharam (21-07-2023):
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కలియుగ వైకుంఠనాథుని చెంత భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. గోవిందుడి సర్వదర్శనం కోసం 24 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. 63,628 మంది భక్తులు నిన్న స్వామిని దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్న శ్రీవారికి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు సమకూరింది.
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే విధానాన్ని టీటీడీ మరింత సులభతరం చేయనుంది. ఇందులో భాగంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. “పే లింక్” ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఆన్‌లైన్ ద్వారా డబ్బు చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకొనే సౌలభ్యం కల్పించింది. ప్రస్తుతం సీఆర్‌వోలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు కేటాయిస్తున్నారు.
ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వెళ్లి డబ్బు కట్టి టికెట్లు పొందాల్సి ఉండేది. తాజాగా టీటీడీ నిర్ణయంతో ఎంఎస్‌ఎస్ ద్వారా పే లింక్‌ను పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్/డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సీఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆగష్టు 5 నాటికల్లా శ్రీనివాస సేతు పనులు పూర్తి చేయాలి..
శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఆగష్టు 5వ తేదీ నాటికల్లా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాల భవనంలోని తన ఛాంబర్‌లో టీటీడీ, మున్సిపల్ అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై ఆయన సమీక్షించిన సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పైన గడ్డర్స్ ఏర్పాటు ఇతర పనులు వేగవంతం చేయాలని సూచించారు.
Read Also : Gold Price today 21 July 2023: ఏమాత్రం తగ్గని బంగారం ధరలు.. నేటి పసిడి, వెండి రేట్లు ఇవీ..