Tirumala News 02-10-2023: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న కనీవినీ ఎరుగని రీతిలో తిరుమలకు భక్తులు చేరుకున్నారు. స్వామిని దర్శనం చేసుకోవడానికి ఏకంగా 48 గంటల సమయం పట్టింది. పెరటాసి నెల, వరుస సెలవులు కావడంతో కొండపైకి భక్తులు తరలి వస్తున్నారు. నిన్న శ్రీవారిని 88,623 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 43,934 మంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు చేకూరిందని టీటీడీ తెలిపింది. (Tirumala News 02-10-2023)
ఈ నెల 29న చంద్రగ్రహణంతో ఆలయం మూసివేత
ఈ నెల 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. చంద్రగ్రహణంతో 8 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 29 తెల్లవారుజామున 1:05 నుంచి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉంటుందని పండితులు తెలిపారు. చంద్రగ్రహణంతో 28 రాత్రి నుంచి ఆలయం మూసివేయనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీతో సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
పెరటాసి నెల కావడంతో తమిళ భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఇవాళ టోకెన్ల జారీ నిలిపివేసినట్లు టీటీడీ వెల్లడించింది. క్యూలైన్లలో ఉన్న భక్తులు శ్రీవారీని దర్శించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
స్వామివారి బ్రేక్ దర్శనం టికెట్ల కొనుగోలుతో పాటు గదుల బుకింగ్ సమయంలో డబ్బు చెల్లించే విధానాలను మరింత ఈజీ చేస్తూ టీటీడీ మార్పులు చేసింది. ఇందుకు ‘పేలింక్’ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా డబ్బు చెల్లించే పద్ధతులను తీసుకొస్తోంది. ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వోలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్‌లో కేటాయిస్తుండగా, భక్తులు పేలింక్ ద్వారా సొమ్ము చెల్లిస్తున్నారు. భక్తులు నేరుగా కౌంటర్ వద్దకు వచ్చి టికెట్లు కొనాల్సిన కష్టం తప్పింది. ఇదే విధానాన్ని ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనం, విచక్షణ కోటా ఆర్జిత సేవలు, సీఆర్వో పరిధిలోని గదుల కేటాయింపునకూ వర్తింపజేయాలని టీటీడీ ఆలోచిస్తోంది.