Tirumala Chirutha: తిరుమలలో ఆరేళ్ల చిన్నారి లక్షితను పొట్టనబెట్టుకున్న చిరుత బోనులో చిక్కింది. బాలిక మృతి చెందిన అనంతరం టీటీడీ అధికారులు విస్తృతంగా భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రతే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి చిరుత బోనులో చిక్కింది. బాలిక లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే రెండు రోజుల వ్యవధిలోనే చిరుత పట్టుబడిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో సుమారు ఐదు ప్రాంతాల్లో చిరుత సంచరించిందని ఈవో పేర్కొన్నారు. (Tirumala Chirutha)
ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారని టీటీడీ ఈవో తెలిపారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని వెల్లడించారు. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పేవరకు నిబంధనలు కొనసాగుతాయని స్పష్టీకరించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్ల లోపు చిన్నారులకు అనుమతి లేదని పేర్కొన్నారు.
నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని ఈవో సూచించారు. ఘాట్ రోడ్ లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు బైక్ లకు అనుమతి లేదని పేర్కొన్నారు. చిరుతను తిరుపతి ఎస్వీ జూపార్కుకు తరలిస్తామని తెలిపారు. బోనులో చిక్కే క్రమంలో చిరుత స్వల్పంగా గాయపడిందని, ఎస్వీ జూపార్కులో చిరుతకు చికిత్స అందిస్తామని చెప్పారు. చికిత్స అనంతరం మ్యాన్ ఈటర్ అవునా కాదా అనే దానిపై పరీక్ష జరుపుతామని తెలిపారు. పట్టుబడిన చిరుతను ఎక్కడ వదలాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 31 కంపార్ట్ మెంట్ల లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారిని 84,401 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 37,738 మంది.
ఇవాళ టీటీడీ చైర్మన్ భూమన ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ సమావేశం
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ సమావేశం ఇవాళ జరగనుంది. నడకదారిలో భక్తుల భద్రతా ఏర్పాట్ల పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే భద్రతాపరంగా పలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 21న శ్రీవారికి గరుడ వాహన సేవ
ఈనెల 21వ తేదీన శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించనుంది టీటీడీ. ఈనెల 22 నుంచి 3 రోజుల పాటు కారీరిష్టి యాగం తలపెట్టారు. వరుణ జపాలను రుత్వికులు నిర్వహించనున్నారు. ఈనెల 26న పవిత్రోత్సవాలకు అంకురార్పణ గావిస్తారు. 27 నుంచి 29 వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది.