Senior Citizens welfare: రాష్ట్రంలో వయో వృద్దుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉష శ్రీచరణ్ తెలిపారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వృద్దాప్య పింఛన్ల పెంపుకు సంబందించిన ఫైలుపైనే తొలి సంతకం చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. (Senior Citizens welfare)
రాష్ట్ర స్థాయి వయో వృద్దుల మండలి తొలి సమావేశం నిన్న జరిగింది. అన్ని జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి వయో వృద్దుల మండళ్ల అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని వయో వృద్దులు అందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో వైఎస్సార్ పింఛను కానుక క్రింద ప్రతి నెలా రూ.2,750/- వారి గడప వద్దే ఒకటో తేదీ కల్లా అందజేస్తున్నామన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆ పింఛను సొమ్మును వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.3,000/- లకు పెంచనున్నట్లు ఆమె తెలిపారు. ఈ పథకం కింద దాదాపు 39,92,333 మంది వయో వృద్దులకు ప్రతి నెలా రూ.1,070.61 కోట్ల సొమ్మును పింఛనుగా అందజేయడం జరుగుతోందన్నారు. తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో పాటు, సికిల్ సెల్ అనీమియా, తలసెమియా తదితర వ్యాధులతో బాధపడేవారికి ప్రతి నెలా రూ.10 వేలు, కిడ్నీ, లివర్, గుండె, పక్షవాతం, బోధకాలు తదితర వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా రూ.5 వేల పింఛను ఇస్తున్నామన్నారు.
డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద దాదాపు 3 వేల వ్యాధులకు పైబడి ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఉచిత కార్పొరేట్ వైద్యసేవలు అందించడమే కాకుండా, ప్రస్తుతం జగనన్న ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ వయో వృద్దులకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేలను అందజేస్తున్నామని తెలిపారు. ఆర్.టి.సి. బస్సుల్లో ప్రయాణించే వయోవృద్దులకు రవాణా చార్జీల్లో 25 శాతం రాయితీని కల్పించామన్నారు.
రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మొత్తం 71 వృద్దాశ్రమాలతో పాటు మరో 118 వృద్దాశ్రమాలు పలు సొసైటీలు, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే రాష్ట్రంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్.టి.ఆర్. జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో వృద్దాశ్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు.
ఆ ఐదు జిల్లాల్లో కూడా ప్రభుత్వ పరంగా వృద్దాశ్రమాలను ఏర్పాటు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తల్లిదండ్రులు, వృద్దుల సంక్షేమం, నిర్వహణకు సంబందించి కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలో రూపొందించిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా 2011లో మార్గదర్శకాలను, నియమ నిబంధనలకు రూపొందించామని తెలిపారు.
ఇదీ చదవండి:CM Jagan at Delhi: ఢిల్లీలో సీఎం జగన్.. పోలవరం నిధులు ఇవ్వాలని నిర్మలమ్మకు వినతి