Pawan VS Dwarampudi: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో పొలిటికల్ హీట్ పెరిగింది. వచ్చీ రాగానే పవన్‌కల్యాణ్.. అధికార పార్టీపైనా, ముఖ్యమంత్రిపైనా, నేతలు, మంత్రులపై కూడా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై పవన్ ఒంటికాలిపై లేచారు. ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోస్తానని, రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్. అయితే, అంతే స్థాయిలో ఎమ్మెల్యే ద్వారంపూడి స్పందించారు. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలని, తుక్కు తుక్కుగా ఓడించితీరుతానని సవాల్ విసిరారు. పరస్పర సవాళ్లతో గోదావరి జిల్లాల్లో వాతావరణం హీటెక్కడంతో పాటు పొలిటికల్ వేడి కూడా పెరిగింది. (Pawan VS Dwarampudi)
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయని, బలిసి కొట్టుకుంటున్నావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ నాయకునికి క్లిప్పింగ్స్ పంపించుకో.. నీ క్రిమినల్ ఎంపైర్‌నే నేలమట్టం చేస్తామంటూ పవన్ పేర్కొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గూండాగిరిని అడ్డుకునేందుకు హ్యాష్ ట్యాగ్ ఏపీ సీఎం బినామీ అంటూ ట్రెండ్ చేయాలని సూచించారు. అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటో తీయాలని, ఈ హ్యాష్ ట్యాగ్‌తో యూనియన్ హోం మినిస్టర్ ఆఫీస్‌కు, డీజీపీకి, జనసేన ఆఫీస్‌కు ట్యాగ్ చేయాలన్నారు.
పవన్ వ్యాఖ్యలపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే…
“పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారు. పవన్ నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచారు. రాజకీయ వ్యభిచారి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. పవన్ రాజకీయంగా జీరో. ఎవరిని ఉద్దరించడానికి జనసేన పార్టీని పవన్ స్థాపించాడు. చంద్రబాబును ఉద్దరించడానికే జనసేన పార్టీని పవన్ నడిపిస్తున్నాడు. జక్కంపూడి రామ్మోహన్ గారి శిష్యుడిగా నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా. నన్ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదు. పవన్‌కు చంద్రబాబుతో బేరం కుదరక రోడ్ల పైకి వచ్చారు. పవన్ పెట్టే మీటింగుల కంటే పెద్ద మీటింగ్ లు పెట్టగలం. నా కుటుంబం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మేం రౌడీలమైతే నన్ను ఎందుకు గెలిపిస్తారు. పవన్ నువ్వు రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదు.
సీఎం కావడం పవన్‌కు సినిమాల్లోనే సాధ్యం..
పవన్ సీఎం కావాలంటే సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. పవన్ ఎమ్మెల్యే కావాలన్నా, సీఎం కావాలన్నా అది సినిమాల్లోనే. రాజకీయాల్లో సీఎం కావడం పవన్ కు సాధ్యం కాదు. పవన్ ప్యాకేజీ స్టార్ అని ప్రజలందరికి తెలుసు. జనసేన పార్టీ ఎజెండా ఏంటి ? కాకినాడ లో అన్ని సామాజిక వర్గాలు కలిసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. ప్యాకేజీలు , సీట్లు ఒప్పందం కుదరకుంటే పవన్ రోడ్డు మీదకు వస్తాడు. పవన్ నాపై చేసిన అసత్య ఆరోపణలను నిరూపించాలి. పవన్ పక్కవారిని విమర్శించే ముందు ఒకటికి, రెండుసార్లు పరిశీలించుకోవాలి. సీఎం జగన్ వచ్చాక కాకినాడ పోర్ట్ లో ఎక్స్ పోర్ట్స్ పెరిగాయి. ఇతర రాష్ట్రాల ధాన్యం సైతం ఇక్కడి నుంచి ఎక్స్ పోర్ట్ చేస్తున్నారు.
తుక్కు తుక్కుగా ఓడిస్తా…
నేను తలుచుకుంటే కాకినాడ లో పవన్ బ్యానర్ కూడా కట్టనీయను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. పవన్ కులాల గురించి మాట్లాడను అంటూనే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును తరిమేస్తే కులాల గొడవ ఉండదు. పవన్ మాటల్లో చూపిస్తే మేం చేతల్లో చూపిస్తాం. 2024 ఎన్నికలే చంద్రబాబు కు చివరి ఎన్నికలు. పవన్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కు దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలి. పవన్ కాకినాడ లో పోటీ చేస్తే తుక్కుతుక్కుగా ఓడిస్తా. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.
రంగాను చంపిన చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారు. నేను అన్ని కులాల అభ్యర్థిని కాబట్టే రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచాను. చంద్రబాబు హామీ ఇవ్వకపోతే నీ పార్టీ నేతలకు ఎక్కడ టికెట్ ఇస్తావో చెప్పలేవు. వంగవీటి రంగా నాకు ఆదర్శం . రెడ్డి సామాజికవర్గానికి వ్యతిరేకంగానే చంద్రబాబు తో పవన్ చేతులు కలిపాడు.” అని ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యానించారు.
Read Also : Monsoon in Andhra Pradesh: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. రుతుపవనాల పరిస్థితి ఇదీ..