Jagananna arogya suraksha: వైద్య రంగంలో నూతన అధ్యాయానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన జగన్ ప్రభుత్వం.. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం, మందులు అందించడం, వైద్యం ఖర్చు కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. (Jagananna arogya suraksha)
గైనిక్, పీడియాట్రిక్ స్పెషలిస్ట్ వైద్యులు కూడా ఉండాలని స్పష్టం చేయడం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల ఆరోగ్యం పట్ల సీఎం జగన్ చూపుతున్న ప్రత్యేకశ్రద్ధను తెలియజేస్తోంది. ఏ కుటుంబంలో ఎవరికి ఏ అనారోగ్య సమస్యలున్నా అవన్నీ నోట్ చేసుకొని ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చికిత్స, మందులు అందించడం అనేది సరికొత్త చరిత్ర. రాజన్న ఆరోగ్యశ్రీతో ఒక అడుగు వేస్తే, జగనన్న ఆరోగ్య సురక్షతో పది అడుగులు ముందుకు వేశారంటున్నారు ప్రజలు.
రాష్ట్రంలో ప్రతి ఇంటినీ, ప్రతి కుటుంబాన్నీ, ప్రతి వ్యక్తినీ ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచే కార్యక్రమమే
జగనన్న ఆరోగ్య సురక్ష. – సీఎం జగన్
ప్రజల అనారోగ్య సమస్యలు ఇంటింటికీ వెళ్లి ముందే తెలుసుకొని దానికితగ్గ మందులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రత్యేకత. అనారోగ్యంతో వైద్య సాయం కోసం వచ్చిన వ్యక్తికి కచ్చితంగా వైద్యం, మందులు అందించే ఏర్పాటు చేస్తున్నారు. మందుల కొరత లేకుండా, వచ్చిన ప్రతి ఒక్క బాధితునికీ మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఐదు దశల్లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇలా..
1. వలంటీర్, గృహ సారథి, ప్రజాప్రతినిధి.. ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరిస్తారు. తేదీతో పాటు ఏయే సేవలు అందిస్తారో గ్రామం/పట్టణం వారీగా తెలియజేస్తారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా ఆ ఆస్పత్రులకు వెళ్లాలి? ఉచిత వైద్య సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల బృందం ఆయా కుటుంబాల వద్దకు వస్తుంది. ప్రతి ఇంట్లోనూ పౌరులందరితో మాట్లాడి 7 రకాల టెస్టులపై మీతో చర్చిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది.
2. సీహెచ్‌వో ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం, ఆశావర్కర్, వలంటీర్లు అన్ని ఇళ్లను సందర్శిస్తారు. ప్రజలకు వారి ఇంటివద్దే బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్, స్పూటమ్ (కఫం) పరీక్షలతోపాటు జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా, డెంగీ లాంటి మొత్తం ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల ఫలితం ఆధారంగా సేకరించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ జనరేట్ అవుతుంది. ఈ డేటా వివరాలు హెల్త్ క్యాంపు జరిగే నాటికి ఉపయోగపడతాయి.
3. మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించటానికి మూడు రోజులు ముందుగానే వలంటీర్, గృహ సారథులు, ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు మరోసారి గుర్తు చేస్తారు. క్యాంప్ నిర్వహించే రోజు అందుబాటులో ఉండాలని సమాచారం ఇస్తారు.
4. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ఈ నెల 30 నుంచి హెల్త్ క్యాంపులు ప్రారంభం అవుతాయి. రోజూ ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామం/పట్టణంలో క్యాంపు నిర్వహిస్తారు. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్/పట్టణాల్లో వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు జరుగుతాయి.
5. ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత ప్రజల ఆరోగ్య వివరాలు హ్యాండ్ హోల్డింగ్‌లో ఉండాలి. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించాక వారికి కాలానుగుణంగా టెస్టింగ్, కన్సల్టేషన్, మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాటే వినిపించకుండా చర్యలు.
Read Also : Chandrababu Remand: చంద్రబాబుకు రిమాండ్.. ఖైదీ నంబర్ 7691 కేటాయింపు