HomeBusinessiPhone Ultra: ఐఫోన్ అల్ట్రా స్క్రీన్ ప్రొటెక్టర్ లీక్.. ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్‌పై కీలక క్లూ

iPhone Ultra: ఐఫోన్ అల్ట్రా స్క్రీన్ ప్రొటెక్టర్ లీక్.. ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్‌పై కీలక క్లూ

iPhone Ultra: యాపిల్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్‌ విషయంలో మరో కీలక లీక్ వెలుగులోకి వచ్చింది. యాపిల్ తొలిసారిగా విడుదల చేయనున్న ఫోల్డబుల్ ఐఫోన్‌ను ప్రస్తుతం ఐఫోన్ అల్ట్రా లేదా ఐఫోన్ ఫోల్డ్ పేర్లతో టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫోన్ 2026 సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు లాంచ్ అయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. యాపిల్ అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఈ డివైస్‌ను ధృవీకరించలేదు.

తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ షేర్ చేసినట్లు పేర్కొంటున్న చిత్రాలు, వీడియోలో ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించిన స్క్రీన్ ప్రొటెక్టర్ కనిపిస్తోంది. ఈ లీక్ ద్వారా ఫోన్ కవర్ డిస్‌ప్లే ఆకారం, బెజెల్స్, హింజ్ చుట్టూ ఉండే డిజైన్‌పై కొంత స్పష్టత వచ్చినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

స్క్రీన్ ప్రొటెక్టర్ ఆకారం ఎందుకు ఆసక్తికరం?

లీకైన స్క్రీన్ ప్రొటెక్టర్ సాధారణ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల మాదిరిగా పూర్తిగా సమానమైన మూలలతో కనిపించడం లేదు. హింజ్‌కు ఆనుకునే వైపు స్క్వేర్ కార్నర్స్ ఉండగా, మరో వైపు రౌండెడ్ కార్నర్స్ కనిపిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్ రెండు భాగాలుగా మడుచుకునే విధానం కారణంగానే ఈ ఆకారం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిని చూసి ఐఫోన్ అల్ట్రా డిస్‌ప్లే కూడా అసమానమైన మూలలతో ఉంటుందని భావించాల్సిన అవసరం లేదని లీక్‌కు సంబంధించిన వివరాలు సూచిస్తున్నాయి. స్క్రీన్ ప్రొటెక్టర్ మొత్తం ఫ్రంట్ ప్యానెల్‌ను కవర్ చేయాల్సి ఉండటంతో దాని ఆకారం, అసలు డిస్‌ప్లే ఆకారం ఒకేలా ఉండకపోవచ్చు.

అసలు డిస్‌ప్లే మాత్రం నాలుగు వైపులా సమానమైన బెజెల్స్, సిమెట్రికల్ రౌండెడ్ కార్నర్స్‌తో ఉండే అవకాశం ఉందని సమాచారం. తాజా లీక్ ఫోల్డబుల్ ఐఫోన్ వెడల్పుగా, కొద్దిగా పొట్టిగా ఉండే బుక్-స్టైల్ డిజైన్ వైపు వెళ్తున్నట్లు గతంలో వచ్చిన సమాచారానికి కూడా సరిపోతుంది.

5.5 అంగుళాల కవర్ స్క్రీన్.. 7.8 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే

ఫోల్డబుల్ ఐఫోన్‌లో బయట భాగంలో సుమారు 5.4 నుంచి 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. ఫోన్‌ను విప్పినప్పుడు సుమారు 7.8 అంగుళాల పెద్ద ఇన్నర్ డిస్‌ప్లే అందుబాటులోకి వస్తుందని అంచనా. దీంతో సాధారణ ఐఫోన్‌తో పోలిస్తే టాబ్లెట్ తరహా అనుభవాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఈ డిజైన్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లను పోలి ఉండనుంది. ముఖ్యంగా Samsung Galaxy Z Fold సిరీస్, Huawei Pura X Max తరహాలో వెడల్పైన ఫార్మాట్‌ను యాపిల్ ఎంచుకుంటున్నట్లు లీకులు సూచిస్తున్నాయి.

డిస్‌ప్లే క్రీస్‌కు యాపిల్ చెక్ పెట్టనుందా?

ఫోల్డబుల్ ఫోన్లలో వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో డిస్‌ప్లే మధ్యలో కనిపించే క్రీస్ ఒకటి. యాపిల్ మాత్రం ఈ విషయంలో ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించి క్రీస్‌ను చాలా తక్కువగా కనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గతంలో పలు నివేదికలు వచ్చాయి. సామ్‌సంగ్ డిస్‌ప్లే 2026 CESలో దాదాపు కనిపించని క్రీస్‌తో కూడిన ఫోల్డబుల్ డిస్‌ప్లే టెక్నాలజీని ప్రదర్శించింది. ఇదే తరహా టెక్నాలజీ భవిష్యత్ ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఉపయోగించే అవకాశం ఉందని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి.

కెమెరాల విషయంలో భారీ అప్‌గ్రేడ్?

కెమెరాల విషయానికి వస్తే ఫోల్డబుల్ ఐఫోన్‌లో వెనుక భాగంలో రెండు 48MP కెమెరాలు ఉండొచ్చని తాజా లీకులు సూచిస్తున్నాయి. అయితే ముందు కెమెరా విషయంలో నివేదికల మధ్య కొంత తేడా ఉంది. కొన్ని పాత లీకులు 18MP కెమెరాను పేర్కొనగా, మరికొన్ని తాజా నివేదికలు రెండు డిస్‌ప్లేల కోసం 24MP కెమెరాల గురించి చెబుతున్నాయి. అందువల్ల యాపిల్ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ స్పెసిఫికేషన్లను ఖరారైనవిగా భావించలేం.

A20 చిప్, భారీ బ్యాటరీ

పెర్ఫార్మెన్స్ విషయంలో ఫోల్డబుల్ ఐఫోన్‌కు యాపిల్ కొత్త తరం A20 సిరీస్ చిప్‌ను అందించే అవకాశం ఉందని తాజా రూమర్స్ చెబుతున్నాయి. కొన్ని లీకుల్లో A20 Pro పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే తాజా నివేదికల్లో A20 చిప్ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. బ్యాటరీ విషయంలోనూ సుమారు 4,883mAh నుంచి 5,000mAh సామర్థ్యం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఫోల్డబుల్ ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు, శక్తివంతమైన చిప్ కారణంగా బ్యాటరీ సామర్థ్యం కీలకంగా మారనుంది.

Touch ID మళ్లీ రానుందా?

ఫోల్డబుల్ ఐఫోన్‌లో మరో ఆసక్తికరమైన మార్పు Touch ID అని తెలుస్తోంది. ఫేస్ ఐడీకి బదులుగా పవర్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించే అవకాశం ఉందని పలు లీకులు చెబుతున్నాయి. ఫోన్‌ను చాలా పలుచగా ఉంచేందుకు ఫేస్ ఐడీకి అవసరమైన సెన్సార్లను తొలగించి Touch ID వైపు యాపిల్ మొగ్గుచూపుతున్నట్లు రూమర్స్ ఉన్నాయి.

ధర కూడా భారీగానే ఉండే అవకాశం

ఫోల్డబుల్ ఐఫోన్ అత్యంత ప్రీమియం కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో వచ్చిన అంచనాల్లో దీని ధర సుమారు 2,000 డాలర్ల నుంచి 2,500 డాలర్ల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. తాజా నివేదికల్లో కూడా 2,400–2,500 డాలర్ల స్థాయి ధరపై అంచనాలు కనిపిస్తున్నాయి. భారత మార్కెట్లోకి వస్తే పన్నులు, దిగుమతి ఖర్చులు, ఇతర కారణాలతో ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌లోనే ఐఫోన్ అల్ట్రా లాంచ్ అవుతుందా?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీకులు, మార్కెట్ నివేదికల ప్రకారం యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026 సెప్టెంబర్‌లో పరిచయం చేసే అవకాశం ఉంది. కొన్ని తాజా నివేదికలు సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అయితే యాపిల్ నుంచి అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. అందువల్ల ప్రస్తుతం బయటకు వస్తున్న స్క్రీన్ ప్రొటెక్టర్, డమ్మీ యూనిట్లు, కెమెరా, బ్యాటరీ, చిప్ వంటి వివరాలను లీకులు, రూమర్స్‌గానే చూడాలి. అధికారిక ప్రకటన తర్వాతే ఐఫోన్ అల్ట్రా డిజైన్, ఫీచర్లు, ధర, లాంచ్ తేదీపై పూర్తి స్పష్టత రానుంది.

Read also: iPhone Pro: 20 ఏళ్ల ఐఫోన్‌కు ఆపిల్ స్పెషల్ ప్లాన్?.. భారీ స్క్రీన్, సరికొత్త డిజైన్‌తో రానున్న iPhone Pro!
Apple Upgrade: ఇక iPhone కొనాల్సిన అవసరం లేదా? నెలవారీ లీజ్‌తో కొత్త ప్లాన్.. తీసుకునే ముందు ఈ 20 విషయాలు తెలుసుకోండి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు