HomeAndhra PradeshAndhra Pradesh: కృష్ణా డెల్టాలో వరి సాగు ఆపడం సరికాదు.. రాయలసీమ రైతులను ఆదుకోవాలి

Andhra Pradesh: కృష్ణా డెల్టాలో వరి సాగు ఆపడం సరికాదు.. రాయలసీమ రైతులను ఆదుకోవాలి

Andhra Pradesh: కృష్ణా డెల్టాలో వరి సాగును నిలిపివేయాలని ప్రభుత్వం సూచించడం అనాలోచిత నిర్ణయమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-2024) ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో సమృద్ధిగా నీటి ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, డెల్టా రైతులకు సాగునీరు అందించకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పడం వాస్తవ పరిస్థితులకు విరుద్ధమని అన్నారు. తాడేపల్లిలో మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.

తెలంగాణలో నీటి వినియోగం.. ఏపీలో ఆలస్యం

ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు సుమారు 1.70 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందని, అందులో 1.67 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోందని నాగిరెడ్డి తెలిపారు. శ్రీశైలం నీటి మట్టం కూడా కనీస స్థాయిని దాటి 857 అడుగులకు చేరిందన్నారు. తెలంగాణలో భీమా-1, భీమా-2, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా సాగునీటి పంపింగ్ కొనసాగుతోందని, జూరాల కుడి, ఎడమ కాలువలకు కూడా నీటి విడుదల జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న రాయలసీమకు హంద్రీ-నీవా లిఫ్ట్ ద్వారా, కర్నూలు జిల్లాలో తాగునీటి అవసరాలు ఉన్న కేసీ కెనాల్‌కు ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా నీరు విడుదల చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు.

పట్టిసీమ ఉన్నా వరి వేయొద్దనడం హాస్యాస్పదం

గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలుస్తున్న సమయంలో కూడా పట్టిసీమ లిఫ్ట్ పనిచేస్తుండగా, కృష్ణా డెల్టాలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రకటించడం ఆశ్చర్యకరమని నాగిరెడ్డి అన్నారు. డెల్టా ప్రాంతంలో ఖరీఫ్ సీజన్‌లో వరి, చెరకు, ఆక్వాకల్చర్ మినహా ఇతర పంటలు ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించడం వల్ల సుమారు 10.5 లక్షల ఎకరాల మాగాణి, 2.5 లక్షల ఎకరాల ఆక్వాకల్చర్ తీవ్ర ప్రభావానికి గురవుతాయని పేర్కొన్నారు.

పులిచింతలలో 29 టీఎంసీలు ఉన్నా విడుదల చేయడం లేదు

కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసమే పులిచింతల ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేసిన నాగిరెడ్డి, ప్రస్తుతం కూడా అక్కడ 29 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. అయినప్పటికీ ఆ నీటిని 2027 జూన్ వరకు తాగునీటి కోసం నిల్వ ఉంచుతామని అధికారులు చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా నదుల ద్వారా భారీగా వరద నీరు శ్రీశైలానికి చేరుతున్న నేపథ్యంలో పులిచింతల నీటిని వినియోగించకుండా నిల్వ ఉంచడం సమంజసం కాదన్నారు.

పట్టిసీమ పంపుల సామర్థ్యంపై ప్రశ్నలు

పట్టిసీమలో మొత్తం 23 పంపులు ఉండగా ఒక్కో పంపు సామర్థ్యం 350 క్యూసెక్కులని, అన్ని పంపులు ఒకేసారి పనిచేయవని అధికారులు చెబుతుంటే 8 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని ఎలా చెబుతున్నారని నాగిరెడ్డి ప్రశ్నించారు. తన అనుభవం ప్రకారం సాధారణంగా 20 పంపులు మాత్రమే నడుపుతారని, మిగిలినవి స్టాండ్‌బైగా ఉంచుతారని చెప్పారు.

ప్రభుత్వానికి సూచించిన పరిష్కారం ఇదే

పట్టిసీమ ద్వారా 20 పంపులు నడిపితే సుమారు 7 వేల క్యూసెక్కుల నీరు కృష్ణా నదికి చేరుతుందని, దానికి పులిచింతల నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే, పాలేరు, మునేరు, వైరా, కట్టలేరు వంటి ఉపనదుల ప్రవాహం, స్థానిక వర్షాలు కలిపి కృష్ణా డెల్టాలోని 10.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. 2003లో కేవలం 80 టీఎంసీల నీటితోనే 12.5 లక్షల ఎకరాల్లో వరి సాగు విజయవంతంగా జరిగిందని, ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులకు నీరు అందించడం లేదని విమర్శించారు.

డెల్టా రైతులు తీవ్ర ఆందోళనలో

డెల్టా ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది రైతులు నారు మళ్లలు సిద్ధం చేసి, సాగు పనులు ప్రారంభించారని నాగిరెడ్డి తెలిపారు. నీరు విడుదల కాకపోతే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధి లేక వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి

పులిచింతల నుంచి తక్షణమే 4,000 క్యూసెక్కుల నీరు విడుదల చేసి, పట్టిసీమ ద్వారా మొత్తం 10,000 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టా కాలువలకు సరఫరా చేయాలని నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మల్యాల నుంచి హంద్రీ-నీవా కాలువకు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు వెంటనే నీటిని విడుదల చేసి రాయలసీమ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

Read also : Andhra Pradesh: కృష్ణా డెల్టాకు వెంటనే నీరు విడుదల చేయాలి.. రాయలసీమకు కూడా సాగునీరు అందించాలి
Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచారానికి కేంద్రం లెక్కల చెక్‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు