HomeCinemaS Janaki: ఒక ఫొటోతో మొదలైన ప్రేమ.. జీవితాంతం నిలిచిన బంధం

S Janaki: ఒక ఫొటోతో మొదలైన ప్రేమ.. జీవితాంతం నిలిచిన బంధం

S Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి జీవితంలో సంగీతం ఎంత ముఖ్యమో.. ప్రేమ కూడా అంతే ప్రత్యేకమైనది. వేలాది పాటల్లో ప్రేమను పలికించిన జానకి.. తన నిజ జీవితంలోనూ ఎంతో అందమైన ప్రేమకథను సొంతం చేసుకున్నారు. ఒక ఫొటో చూసి మొదలైన ఆ అనుబంధం.. చివరి శ్వాస వరకు ఆమె హృదయంలో చెరగని జ్ఞాపకంగా నిలిచిపోయింది.

చెన్నై ప్రయాణమే జీవితాన్ని మార్చేసింది
జానకి గాన ప్రతిభను ముందుగానే గుర్తించిన ఆమె మామయ్య చంద్రశేఖర్, ప్రముఖ సంగీత విద్వాంసుడు “ఫన్ డాక్టర్”గా పేరొందిన ఆయన ప్రోత్సాహంతో జానకి చెన్నైకి వెళ్లారు. అక్కడే ఆమె సినీ గాన ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఒక వేదికపై జానకి ఆలపించిన పాటను విన్న సంగీతాభిమాని వి. రామ్‌ప్రసాద్ ఆమె స్వరానికి ముగ్ధుడయ్యారు. కానీ అప్పటికి ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానం మాటల్లోకి రాలేదు.

ఒక ఫొటో… ఒక మనసు… ఒక జీవితకాల బంధం
ఒక రోజు చంద్రశేఖర్ జేబులో నుంచి ఓ ఫొటో కింద పడింది. ఆ ఫొటోలో కనిపించిన యువకుడు జానకి మనసును ఆకట్టుకున్నాడు. ఆ వ్యక్తే వి. రామ్‌ప్రసాద్. ఆయనపై మనసు పడినా, జానకి తన ప్రేమను బయటపెట్టలేదు. విధి మాత్రం ఇద్దరినీ కలపాలని నిర్ణయించుకుంది. కొద్ది రోజుల తర్వాత చంద్రశేఖర్ స్వయంగా జానకిని రామ్‌ప్రసాద్‌కు పరిచయం చేశారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.

1959లో పెళ్లి… జీవితాంతం తోడుగా నిలిచిన భర్త
1959లో జానకి, రామ్‌ప్రసాద్ వివాహం చేసుకున్నారు. అది కేవలం భార్యాభర్తల బంధమే కాదు.. ఒక కళాకారిణికి అండగా నిలిచిన జీవిత భాగస్వామి కథ కూడా. జానకి ఏ పాట రికార్డింగ్‌కు వెళ్లినా రామ్‌ప్రసాద్ ఆమెతోనే ఉండేవారు. ప్రతి రికార్డింగ్‌, ప్రతి స్టేజ్ ప్రోగ్రామ్‌, ప్రతి విజయానికి ఆయన నిశ్శబ్ద బలంగా నిలిచారు. ఆమె గెలిచిన ప్రతి అవార్డులో, పాడిన ప్రతి పాటలో రామ్‌ప్రసాద్ పాత్ర కూడా ఉందని సినీ వర్గాలు చెబుతుంటాయి.

“ఆయన లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు”
భర్త మరణం తర్వాత జానకి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పటికీ అభిమానులను కంటతడి పెట్టిస్తాయి.”ఆయనకు నా ప్రతి పాట ఎంతో ఇష్టం. నేను ఎక్కడికి వెళ్లినా ఆయన నాతోనే ఉండేవారు. నేను కూడా ఆయన్ను వదిలి ఉండలేకపోయేదాన్ని. తన జీవితమంతా నా కోసమే గడిపారు. ఆయన మద్దతు లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఆయన శరీరంగా దూరమైనా… నా ప్రతి ఆలోచనలో ఆయన నాతోనే ఉంటారు.. ఈ ఒక్క మాటే వారి బంధం ఎంత గాఢమైందో చెప్పడానికి సరిపోతుంది.

భర్త మరణం తర్వాత తీసుకున్న నిర్ణయం
1997లో రామ్‌ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు.
ఆ తర్వాత జానకి తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రంగురంగుల చీరలు ధరించకూడదని నిర్ణయించుకుని, జీవితాంతం సాధారణ వస్త్రాలనే ధరించారు. ఆ నిర్ణయం వెనుక ఆమె ప్రేమ, భర్తపై ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించేది.

కుమారుడి మరణం… మనవడి విషాదం… వరుస దెబ్బలు
జానకి, రామ్‌ప్రసాద్ దంపతులకు కుమారుడు మురళీకృష్ణ. భరతనాట్యంలో ప్రవీణుడైన ఆయన కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. ఈ ఏడాది జనవరిలో మురళీకృష్ణ మరణించడం జానకికి తీరని వేదనగా మిగిలింది. ఆ బాధ నుంచి కోలుకోకముందే అమెరికాలో ఉన్న మనవడు కూడా కన్నుమూయడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరుసగా ఎదురైన ఈ వ్యక్తిగత విషాదాలు ఆమె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపినట్లు సన్నిహితులు పేర్కొన్నారు.

సంగీతంలో చిరంజీవి… ప్రేమలో ఆదర్శం
ప్రపంచానికి ఎస్. జానకి ఓ గొప్ప గాయని. కానీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని చూస్తే.. ప్రేమను జీవితాంతం గౌరవించిన భార్య, కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించిన తల్లి, ఆప్యాయతకు ప్రతిరూపమైన మనిషి. ఒక ఫొటోతో మొదలైన ప్రేమ… పెళ్లిగా మారి, ఆ తర్వాత జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలిచిన ఆ అనుబంధం.. ఈ తరం దంపతులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది.

ఆమె పాటలు శాశ్వతం… ఆమె ప్రేమ కూడా అంతే
ఎస్. జానకి ఇక భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె ఆలపించిన పాటలు ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాగే భర్త రామ్‌ప్రసాద్‌తో ఆమె పంచుకున్న ప్రేమ, అనుబంధం, పరస్పర గౌరవం కూడా ఆమె జీవితంలోని అత్యంత అందమైన అధ్యాయంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.

స్వరంలో మాధుర్యాన్ని పంచిన జానకి… తన జీవితంతో ప్రేమకు కూడా ఒక మధురమైన నిర్వచనం ఇచ్చి వెళ్లిపోయారు.

ఇవీ చ‌ద‌వండి: S Janaki: గాన కోకిల మూగబోయింది.. ఎస్. జానకి ఇక లేరు.. కానీ ఆమె గాత్రం యుగయుగాల పాటు మారుమోగుతూనే ఉంటుంది
Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. సంగీత ప్రపంచంలో విషాదం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు