T20 World cup : ఒకప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న అనేక మంది యువ క్రికెటర్లు ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్‌లో వివిధ దేశాల తరపున ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో దాదాపు 40 మంది భారత సంతతికి చెందిన ఆటగాళ్లు వేర్వేరు జట్ల తరపున బరిలోకి దిగనున్నారు. 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో భారత మూలాలున్న క్రికెటర్లు వేర్వేరు రంగుల జెర్సీలతో మైదానంలోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఏ దేశంలో ఎంత మంది?
కెనడా క్రికెట్ జట్టు – 11 మంది
యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ జట్టు – 9 మంది
ఓమన్ క్రికెట్ జట్టు – 7 మంది
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టు – 7 మంది
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు – ఇద్దరు
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు – ఒకరు
ఈ గణాంకాలు చూస్తే, భారత సంతతి క్రికెటర్లు గ్లోబల్ క్రికెట్‌పై ఎంతటి ప్రభావం చూపుతున్నారో స్పష్టమవుతోంది.
మోనాంక్ పటేల్ – USA జట్టుకు కెప్టెన్
మోనాంక్ పటేల్ 32 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్. ఒకప్పుడు గుజరాత్ అండర్-19 తరపున ఆడిన మోనాంక్, భారత్‌లో అవకాశాలు రాకపోవడంతో కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లాడు. ఇప్పుడు USA జట్టుకు నాయకత్వం వహిస్తూ, అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు.
“అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఇది నాకు లభించిన రెండో అవకాశం” అని ఆయన పేర్కొన్నాడు.
జస్ప్రీత్ సింగ్ – ఇటలీ తరపున తొలి ప్రపంచకప్
జస్ప్రీత్ సింగ్ చిన్న వయసులోనే ఇటలీకి వెళ్లినప్పటికీ, భారతదేశంలో క్రికెటర్ కావాలనే కలలతోనే ఎదిగాడు. ఇటలీ తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ఆడుతుండటంతో, ఈ టోర్నీ అతనికి మరింత ప్రత్యేకం.
“ప్రతి క్రికెటర్ ప్రపంచకప్ ఆడాలని కలలు కంటాడు. ఇక్కడ ఉండటం మాటల్లో చెప్పలేని అనుభూతి” అని ఆయన భావోద్వేగంగా తెలిపారు.
సౌరభ్ నేత్రావల్కర్ – సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ నుంచి స్టార్ బౌలర్
సౌరభ్ నేత్రావల్కర్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయినప్పటికీ క్రికెట్‌పై ప్రేమతో సెలవులు తీసుకుంటూ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో USA తరపున అద్భుత ప్రదర్శన చేసి గుర్తింపు పొందాడు.
ఆర్యన్ దత్ – నెదర్లాండ్స్ తరపున ఆశలు
ఆర్యన్ దత్ తల్లిదండ్రులు అతను పుట్టకముందే నెదర్లాండ్స్‌కు వెళ్లారు. 2023 ప్రపంచకప్ తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఆడే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆర్యన్ చెబుతున్నాడు.
ఈ కథలు అన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి – భారతదేశంలో టాలెంట్‌కు కొదవలేదు. కానీ, అవకాశాలు దొరకని వారు విదేశాల్లో తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఈ క్రికెటర్లు ఇప్పుడు కేవలం తమ వ్యక్తిగత విజయాలకే కాదు, గ్లోబల్ క్రికెట్‌లో భారత సంతతి శక్తిని చాటిచెప్పే ప్రతినిధులుగా నిలుస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో వీరి ప్రదర్శన, భవిష్యత్ తరాలకు కొత్త ప్రేరణగా మారడం ఖాయం.
