Cricket rules : క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా ఆటలో ఉత్కంఠ పెంచేందుకు Marylebone Cricket Club (MCC) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 73 కొత్త నియమాలను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు చేస్తూ, వాటిని అక్టోబర్ 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ మార్పులు అన్ని ఫార్మాట్లలో ఆటకు కొత్త ఊపునివ్వనున్నాయని MCC భావిస్తోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తి తగ్గుతోందన్న విమర్శల నేపథ్యంలో, ఈ కొత్త రూల్స్ అభిమానుల్లో మళ్లీ ఉత్కంఠను రేకెత్తిస్తాయని చెబుతోంది.
చివరి ఓవర్‌లో వికెట్ పడినా ఆట ఆగదు
కొత్త నియమాల్లో అత్యంత ఆసక్తికరమైనది చట్టం 12.5.2కు చేసిన మార్పు. ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్‌లో ఒక రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడితే, అంపైర్లు ఆటను అక్కడితో ముగించేవారు. కానీ ఇకపై ఆ సంప్రదాయానికి గుడ్‌బై చెప్పినట్లే.
సవరించిన నియమం ప్రకారం, చివరి ఓవర్‌లో వికెట్ పడినా మిగిలిన బంతులను తప్పనిసరిగా వేయాల్సిందే. దీని వల్ల బౌలర్లకు ఇది గుడ్ న్యూస్‌గా మారనుండగా, కొత్తగా క్రీజ్‌లోకి వచ్చే బ్యాటర్లకు మాత్రం ఇది నిజంగా ఒక పీడకలగా మారనుంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో చివరి నిమిషాల ఉత్కంఠ మరింత పెరగనుంది.
ల్యామినేటెడ్ బ్యాట్లకు అనుమతి
ఇంకో కీలక మార్పు బ్యాట్లకు సంబంధించినది. బ్యాట్ల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ల్యామినేటెడ్ బ్యాట్లను ఉపయోగించుకోవచ్చని MCC సూచించింది. దీని వల్ల యువ క్రికెటర్లు, దేశవాళీ ఆటగాళ్లపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొంది. అయితే ఈ నియమం అంతర్జాతీయ మ్యాచ్‌లకు వర్తించకపోవచ్చని సమాచారం.
వికెట్‌కీపర్‌పై కఠిన నిబంధనలు
బౌలర్ బంతిని సంధించిన తర్వాత, వికెట్‌కీపర్ తప్పనిసరిగా స్టంప్స్ వెనుకే ఉండాలన్న నిబంధనను కూడా MCC చేర్చింది. దీని ద్వారా బ్యాట్స్‌మన్‌పై అనవసర ఒత్తిడి తగ్గించి, న్యాయమైన ఆటను ప్రోత్సహించాలన్నదే ఉద్దేశ్యం.
పెనాల్టీ రూల్స్‌లో సంచలన మార్పు
పెనాల్టీ పరుగుల విషయంలో MCC చేసిన మార్పు మరింత సంచలనంగా మారనుంది. 41.17.2 నియమం ప్రకారం, మ్యాచ్ ఫలితం నిర్ణయమైనా, అంపైర్లు మైదానం విడిచే ముందు నిబంధనల ఉల్లంఘన జరిగితే, సంబంధిత జట్టుకు పెనాల్టీ పరుగులు విధించవచ్చు.
ఉదాహరణకు, చివరి బంతికి పరుగు తీసి గెలిచిన బ్యాట్స్‌మన్, బౌలర్‌ను ఉద్దేశించి అనుచిత సంకేతాలు చేస్తే, ఆ జట్టుపై పెనాల్టీ విధిస్తారు. ఆ పెనాల్టీ వల్ల స్కోరు మారితే, మ్యాచ్ ఫలితం కూడా మారే అవకాశం ఉంది. ఇంతకుముందు ముగిసినట్టుగా భావించిన మ్యాచ్, మళ్లీ అక్కడి నుంచే కొనసాగాల్సిన పరిస్థితి రావచ్చు.
ఆట తీరే మారనుందా?
మొత్తంగా చూస్తే, ఈ 73 కొత్త నియమాలు క్రికెట్ ఆట తీరునే మార్చేలా కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల క్రమశిక్షణ, ఉత్కంఠ, న్యాయమైన పోటీకి పెద్దపీట వేయడమే లక్ష్యంగా MCC ఈ మార్పులు ప్రతిపాదించింది. అక్టోబర్ 2026 తర్వాత క్రికెట్ ఎలా మారబోతుందన్నది అభిమానుల్లో ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: ICC on Pakistan : భారత్‌తో మ్యాచ్ రద్దు నిర్ణయం… పాక్ క్రికెట్ భవిష్యత్తుపై ముసురుకున్న మబ్బులు
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్‌కు గడ్డుకాలం: వరల్డ్ కప్‌ల నుంచి నిష్క్రమణ… కోట్ల నష్టం… భవిష్యత్తుపై నీలినీడలు
