Bigg Boss : Bigg Boss Telugu Season 9 ముగిసి దాదాపు నెల రోజులు దాటినా, ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ Tanuja మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో తీవ్ర నెగెటివిటీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఓ వర్గం నెటిజన్లు కావాలనే తనూజను టార్గెట్ చేసి ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె అభిమానులు, సన్నిహితులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో తొలిసారిగా తనూజ ఈ విషయంపై ఓపెన్ అయింది. అనవసరపు ట్రోలింగ్ వల్ల తాను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
“చాలా రోజులుగా నా మనసులో తిరుగుతున్న మాటల్ని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకూ ఒక జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటూ, నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను. ప్రతిదానికి పీఆర్ అంటూ మాట్లాడటం మానేయండి. నాకు పీఆర్ టీమ్ అంటూ ఏదీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు” అంటూ తనూజ తన పోస్ట్‌లో పేర్కొంది.
ఇప్పటికీ తనపై సోషల్ మీడియాలో తీవ్ర నెగెటివిటీ కొనసాగుతూనే ఉందని, ప్రతిరోజూ అసభ్యకరమైన కామెంట్లు, దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎవ్వరినీ టార్గెట్ చేయలేదని, కానీ తాను ఇతరులను చెడుగా చిత్రీకరించాలనుకుంటున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పింది.
“మీకు ఇతరులపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ నేను ఏ పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? ప్రతిరోజూ నా క్యారెక్టర్‌పై దాడి చేస్తున్నారు. ఒక మహిళగా అవి భరించలేని బాధను ఇస్తున్నాయి. నోటికొచ్చిన మాటలు మీకు చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ అవే నాకు మానసికంగా లోతైన గాయాలు చేస్తున్నాయి” అంటూ తనూజ భావోద్వేగంగా రాసుకొచ్చింది.
అలాగే తన కుటుంబాన్ని కూడా ఈ ట్రోలింగ్ తీవ్రంగా బాధపెడుతోందని చెప్పింది. “మీరు చేసే చెత్త వ్యాఖ్యలు నా కుటుంబసభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్లు ఎంత బాధపడతారో ఆలోచించారా? ఫేక్ అకౌంట్లతో అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. నన్నే కాదు, నాకు సపోర్ట్ చేసిన వారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకర్ని మానసికంగా హింసిస్తే ఏమి సాధిస్తారు?” అని ప్రశ్నించింది.
తాను ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదని, డ్రామా క్రియేట్ చేయాలన్న ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసిన తనూజ, గౌరవంగా, ప్రశాంతంగా తన జీవితాన్ని జీవించాలనుకుంటున్నానని పోస్ట్‌ను ముగించింది.
ఈ పోస్ట్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు నెటిజన్లు తనూజకు మద్దతుగా నిలుస్తూ ట్రోలింగ్‌ను ఖండిస్తుండగా, మరికొందరు మాత్రం ఇంకా విమర్శలు కొనసాగిస్తున్నారు. అయినా, ఈ భావోద్వేగ పోస్టుతో అయినా తనూజపై జరుగుతున్న నెగెటివిటీ కొంతైనా తగ్గుతుందేమో చూడాల్సి ఉంది.
ఇవీ చదవండి: Nainika : తండ్రి హింసతో నిండిన బాల్యం.. తల్లి ధైర్యమే తన బలం: బిగ్ బాస్ బ్యూటీ నైనిక భావోద్వేగ వ్యాఖ్యలు
Bigg Boss 9 Telugu Updates: సామాన్యుడికే పట్టం! బిగ్ బాస్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల
