Vijayasai Reddy PC : రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించే వ్యాఖ్యలు చేశారు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లిక్కర్ స్కామ్, వైయస్సార్‌సీపీలో కోటరీ వ్యవస్థ, జగన్ మోహన్ రెడ్డితో తన సంబంధాలు, పార్టీ నుంచి బయటకు రావడానికి కారణాలు, తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కామ్‌పై స్పష్టత
లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్న ప్రశ్నకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ —
“లిక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు. ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్లే సమాధానం చెప్పగలరు” అని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారికి తెలిసి ఇలాంటి స్కామ్ జరిగి ఉండదని స్పష్టం చేశారు. “జగన్ గారికి తెలిసి ఏదైనా అక్రమం జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి నా దృష్టిలో అలాంటి స్కామ్ లేదు” అని అన్నారు.
‘నంబర్–2’ ప్రచారంపై స్పందన
తాను పార్టీలో నంబర్–2 స్థానంలో ఉన్నాననే ప్రచారాన్ని విజయసాయిరెడ్డి ఖండించారు. “ప్రాంతీయ పార్టీల్లో నంబర్–2 అనే కాన్సెప్ట్ ఉండదు అని నేనూ, జగన్ గారూ ఎన్నిసార్లు చెప్పాం. కానీ పార్టీ వదిలి వచ్చిన తర్వాత కేసులు వస్తే మాత్రం నన్ను నంబర్–2 అంటున్నారు” అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది మాత్రం జగన్ తనను నమ్మారని, కానీ 2020 తర్వాత కోటరీ కారణంగా తాను పూర్తిగా సైడ్‌లైన్ అయ్యానని తెలిపారు.
కోటరీ వల్లే తన పతనం
విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో కోటరీ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. “పనికిమాలిన కోటరీ జగన్ గారి మనసులో అభద్రత కల్పించింది. నేను ఆయనను వెన్నుపోటు పొడుస్తానన్న భయం సృష్టించారు. దాంతో 2020 నుంచి నన్ను పక్కన పెట్టారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా తాను నిజాయితీగా పనిచేశానని, అయినా అవమానాలు భరించలేకే పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు.
పార్టీ నుంచి బయటకు రావడానికి లిక్కర్ స్కామ్ కారణం కాదు
తాను పార్టీ వదిలి వెళ్లడానికి లిక్కర్ స్కామ్ కారణం కాదని స్పష్టం చేశారు.
“జగన్ గారి హృదయంలో నేను స్థానం కోల్పోయాను. కోటరీ హరాస్మెంట్ తట్టుకోలేకే బయటకు వచ్చాను” అన్నారు. అయితే దీనిపై అధికారికంగా సమాధానం ఇవ్వలేదని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు.
ఆస్తుల ఆరోపణలపై సవాల్
తనపై వందల కోట్ల ఆస్తుల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
“నా ఆస్తులన్నీ వివరాలతో మీకిచ్చాను. ఇవి నావేనని ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా” అని చంద్రబాబు ప్రభుత్వం, సిట్‌ను సవాల్ చేశారు. విశాఖపట్నంలో తనకు ఒక అపార్ట్‌మెంట్ తప్ప మరే ఆస్తి లేదని స్పష్టం చేశారు.
రూ.100 కోట్ల వ్యవహారంపై కీలక వ్యాఖ్య
రూ.100 కోట్లు అరేంజ్ చేశారన్న ఆరోపణలపై స్పందిస్తూ — “మిథున్ రెడ్డి కోరిక మేరకు నేను రికమెండ్ చేయడం వాస్తవం. కానీ జగన్ మోహన్ రెడ్డికి దీనిపై ఎలాంటి సమాచారం లేదు” అని చెప్పారు. ఈ వ్యవహారంలో కర్త–కర్మ–క్రియ అన్నీ రాజ్ కసిరెడ్డే అని స్పష్టం చేశారు.
అప్రూవర్‌గా మారే ప్రసక్తే లేదు
తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రూవర్‌గా మారనని తేల్చిచెప్పారు. “నా ప్రాణం ఉన్నంత వరకు అప్రూవర్‌గా మారను. ఎవరూ నన్ను అలా చేయలేరు” అన్నారు.
రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ
ఈ నెల 25తో తన రాజకీయ విరామానికి ఏడాది పూర్తవుతుందని తెలిపారు. “ఆ తర్వాత నా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీడియా మిత్రులతో పంచుకుంటా” అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన లేదా వైయస్సార్‌సీపీలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. “నేను నా దారే రహదారిగా ఎంచుకుంటాను. ఎవరి చప్పట్లూ నాకు అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు.
జగన్‌కు హెచ్చరిక
కోటరీ వ్యవస్థ అలాగే కొనసాగితే జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని హెచ్చరించారు. “ఎన్ని పాదయాత్రలు చేసినా కోటరీ ఉంటే అధికారంలోకి రావడం కష్టం. సరైన రాజకీయ వ్యూహం ఉంటేనే అవకాశం ఉంటుంది” అన్నారు.
ఇవీ చదవండి: Vijayasai Tweet on Jagan : జగన్‌పై విజయసాయి సంచలన ట్వీట్!
Vijayasai Reddy on Babu: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు : విజయసాయిరెడ్డి
