Srikanth: టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరో శ్రీకాంత్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగపతి బాబు తర్వాత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. విభిన్న కథాంశాలతో వచ్చిన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని, వరుస విజయాలతో దూసుకుపోయారు. ఇప్పటికీ సహాయ నటుడిగా, కీలక పాత్రలతో బిజీగానే కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో, తన కెరీర్‌లో ఎదురైన కఠిన దశను శ్రీకాంత్ నిజాయితీగా వెల్లడించారు.
ఒకప్పుడు తాజ్ మహల్, పెళ్లి సందడి, ఆహ్వానం, వినోదం వంటి హిట్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఒక్క సినిమా హిట్ అయితే, వెంటనే రెండు మూడు సినిమాలు చేతిలోకి వచ్చేవని చెప్పారు. ముఖ్యంగా 2000ల ప్రారంభంలో ఒక హిట్ వచ్చిన తర్వాత, తదుపరి ప్రాజెక్టులు ఖాయంగా ఉండేవని వివరించారు.
కానీ తన 100వ చిత్రంగా వచ్చిన Mahatma తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని శ్రీకాంత్ తెలిపారు. ఆ సినిమా అనంతరం తన కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందని, ఆ తర్వాత సుమారు 25 సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఒక్కటీ పెద్ద విజయాన్ని అందుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దశలో తనపై అనేక రకాల వ్యాఖ్యలు వినిపించాయని చెప్పారు. “కొంతమంది టైం బాలేదు అంటారు, ఇంకొందరు సైన్స్ అయిపోయింది, ఇక ఫిలాసఫీ మొదలవుతుంది అంటూ కామెంట్లు చేశారు” అని చెప్పారు. అదే సమయంలో యంగ్ హీరోలు పెద్ద సంఖ్యలో ఇండస్ట్రీలోకి రావడం, కొత్త తరం ప్రేక్షకుల అభిరుచులు మారడం వల్ల, ఏ హీరో అయినా కొంతకాలానికి ఫేడ్ అవుట్ కావడం సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు ఉన్న అపారమైన ఇమేజ్, భారీ ఫ్యాన్ బేస్ వల్లే వారు సుదీర్ఘకాలం టాప్‌లో నిలబడగలుగుతున్నారని చెప్పారు. తమకు ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం ఓపెనింగ్స్ విషయంలో ప్రతికూలంగా మారిందని కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
మరొక ముఖ్యమైన మార్పుపై కూడా శ్రీకాంత్ స్పందించారు. గతంలో సినిమా బాగుంటే, నెమ్మదిగా పాజిటివ్ టాక్ వస్తూ కలెక్షన్లు పెరిగేవని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, మొదటి రోజే మంచి టాక్ రాకపోతే నాలుగో రోజు వరకు కాదు, మధ్యాహ్నానికే థియేటర్ల నుంచి సినిమాను తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెగటివ్ టాక్ వస్తే, ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం లేదని చెప్పారు.
ఈ అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, తాను మొదటి నుంచే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నానని, అదే పట్టుదలతో ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాత్రలు ఎంపిక చేసుకుంటూ, తనదైన ముద్ర వేయాలనే ప్రయత్నం కొనసాగుతూనే ఉందన్నారు.
ఇవీ చదవండి: Tollywood : అద్దంలోకి చూడాలంటే భయం.. డిప్రెషన్‌లోకి నెట్టిన సమస్య.. యంగ్ హీరోయిన్ షాకింగ్ నిజాలు
Actress: ట్రీట్మెంట్ లేని వ్యాధి.. ప్రతి నెలా నరకం అనుభవిస్తున్నా.. హీరోయిన్ భావోద్వేగ వ్యాఖ్యలు
