IPL 2026: భారత్–బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల భాగస్వామ్యంపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బంగ్లా ప్లేయర్ల భవిష్యత్తుపై బీసీసీఐ స్పందించింది.
ప్రభుత్వ ఆదేశాల్లేవు: బీసీసీఐ
బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్‌లు బలపడుతున్న తరుణంలో, బీసీసీఐ వర్గాలు కీలక స్పష్టీకరణ ఇచ్చాయి. రాజకీయ పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే అయినా, బంగ్లా ఆటగాళ్లపై నిషేధం విధించాలన్న ఆదేశాలు ప్రభుత్వంనుంచి తమకు అందలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. “ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప నిర్ణయం తీసుకునే పరిధి మాకు లేదు. ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం లేదు” అని ఓ అధికారి వెల్లడించారు.
ముస్తాఫిజుర్ కొనుగోలే వివాదానికి కారణం
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల వార్తల నేపథ్యంలో భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్లకు దక్కించుకోవడం వివాదాన్ని మరింత ముదిర్చింది. కొందరు రాజకీయ నేతలు కూడా ఈ కొనుగోలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ ట్రాక్ రికార్డ్
ముస్తాఫిజుర్‌కు ఐపీఎల్ అనుభవం విస్తృతంగా ఉంది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఇప్పటివరకు 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు తీసి తన సామర్థ్యాన్ని చాటాడు. గత సీజన్‌లో గాయపడిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్కు రీప్లేస్‌మెంట్‌గా కూడా అతడు రాణించాడు.
భద్రత, రాజకీయ ఒత్తిళ్లపై ఆందోళన
కేకేఆర్ యాజమాన్యంపై విమర్శలు వస్తున్నప్పటికీ, పరిస్థితులు పూర్తిగా ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. భద్రతా కారణాలు లేదా రాజకీయ ఒత్తిళ్లు పెరిగితే చివరి నిమిషంలో పరిస్థితులు మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కూడా సూచిస్తున్నాయి.
భవిష్యత్తుపై ప్రభావం?
మరోవైపు, టీమిండియా 2026 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఐపీఎల్‌లో బంగ్లా ఆటగాళ్లపై నిరసనలు తీవ్రతరమైతే, ఈ పర్యటనపైనా ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం బీసీసీఐ వేచి చూసే ధోరణిలో ఉంది. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండటంతో, అప్పటికి రాజకీయ పరిస్థితులు సద్దుమణిగితే బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంచనా. లేకపోతే, గతంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఎదురైన పరిస్థితులే బంగ్లా ప్లేయర్లకూ ఎదురయ్యే ప్రమాదం ఉందన్న చర్చ కొనసాగుతోంది.
ఇవీ చదవండి: Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ ప్రాణం బలి.. జనసమూహం ముందే కాల్చి చంపిన ఘటన కలకలం
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష.. విదేశంలో ఉన్నప్పటికీ చరిత్రలో ముద్ర వేసిన తీర్పు
