Exams: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న క్రమంలో విద్యా వ్యవస్థకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో ఏఐ వాడకం తీవ్ర సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ సంస్థలలో ఒకటైన Association of Chartered Certified Accountants (ACCA) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఇంటి నుంచే రాసే ఆన్‌లైన్ రిమోట్ ఇన్విజిలేటెడ్ పరీక్షలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ACCA ప్రకటించింది. ఏఐ చాట్‌బాట్‌ల సహాయంతో పరీక్షల్లో మోసాలు భారీగా పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ వెల్లడించింది.
కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటి నుంచే పరీక్షలు రాసే అవకాశాన్ని ACCA కల్పించింది. అయితే ఇటీవల కాలంలో పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ChatGPT వంటి ఏఐ సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పరీక్షల నాణ్యత, విశ్వసనీయతపై సందేహాలు తలెత్తాయని ACCA తెలిపింది.
మోసాలు అంత స్థాయికి చేరుకున్నాయని, వాటిని కేవలం టెక్నాలజీతో నియంత్రించడం ఇక సాధ్యం కాదని సంస్థ అభిప్రాయపడింది. పరీక్షల పారదర్శకతను, ప్రొఫెషనల్ కోర్సుల విలువను కాపాడేందుకే మళ్లీ ఇన్-పర్సన్ (పరీక్షా కేంద్రాల్లో ప్రత్యక్షంగా) పరీక్షల విధానానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ACCA కోర్సులు చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. ఇకపై విద్యార్థులు తప్పనిసరిగా నిర్ణీత పరీక్షా కేంద్రాలకు వెళ్లి, ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ఇది కేవలం అకౌంటింగ్ రంగానికే పరిమితం కాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఇతర అంతర్జాతీయ పరీక్షా సంస్థలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశముంది. ఏఐ మనుషుల కంటే వేగంగా, ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వగలగడం వల్ల విద్యార్థుల నిజమైన ప్రతిభను అంచనా వేయడం విద్యా సంస్థలకు పెద్ద సవాలుగా మారుతోంది.
ఇవీ చదవండి: UGC NET 2025 Admit Card: యూజీసీ నెట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. మరో రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం
RRB Group D 2025: గ్రూప్ డీ పరీక్ష తేదీలు మారాయి.. ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ఇదే
