HomeNationalBihar Election 2025 : బిహార్‌ ఎన్డీఏలో సీట్ల గందరగోళం.. కూటమి పార్టీల్లో కుమ్ములాట!

Bihar Election 2025 : బిహార్‌ ఎన్డీఏలో సీట్ల గందరగోళం.. కూటమి పార్టీల్లో కుమ్ములాట!

Bihar Election 2025 : ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏలో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. 2020 ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 80 సీట్లు సాధించినప్పటికీ, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు చిన్న భాగస్వాములుగా ఉన్న చిరాగ్‌ పాశ్వాన్‌ (లోక్‌ జనశక్తి పార్టీ-రామ్‌విలాస్‌), జితన్‌ రామ్‌ మాంఝీ (హిందుస్థానీ అవామ్‌ మోర్చా-సెక్యులర్‌) తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు పెద్ద సంఖ్యలో సీట్లు కోరుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలిచిన చిరాగ్‌ పాశ్వాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 40 సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేయనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే, మొత్తం 243 సీట్లలో స్వతంత్రంగా పోటీ చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరిస్తున్నారు. మరోవైపు, మాంఝీ గయా, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో తమ బలం ఎక్కువగా ఉందని, కనీసం 20 సీట్లు తమకే కేటాయించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితిని సమన్వయపరచడం ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాలుగా మారింది. విభేదాలు సర్దుబాటు కాకపోతే కూటమి విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

మహాఘట్‌బంధన్‌ దూకుడు
ఇక మరోవైపు మహాఘట్‌బంధన్‌ (కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్‌) ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచింది. ఈ కూటమి ముస్లిం-యాదవ్‌ ఓటు బ్యాంక్‌ తో పాటు యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ, తేజస్వి యాదవ్‌లు ‘వోటర్‌ రైట్స్‌ మార్చ్‌’ పాదయాత్ర ద్వారా ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. ఎన్డీఏలో పెరుగుతున్న విభేదాలు మహాఘట్‌బంధన్‌కు బలంగా మారే అవకాశముంది.

తమిళనాడులో దినకరన్‌ షాక్‌
ఇక తమిళనాడు శాసనసభ ఎన్నికల ముందు ఎన్డీఏకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం (ఎఎంఎంకే) నేత దినకరన్‌ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఓ.పన్నీర్‌ సెల్వం దూరమైన నేపథ్యంలో దినకరన్‌ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కడలూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘‘మా పార్టీ ద్రోహాన్ని సహించదు’’ అని ఆయన స్పష్టం చేశారు. కూటమిలోని విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ నాయకత్వం విఫలమైందని దినకరన్‌ తీవ్రంగా విమర్శించారు.

ఇవీ చదవండి: Pashamylaram Chemical Factory Blast : సిగాచి కెమికల్స్‌లో రియాక్టర్ పేలుడు
Crime News: కోడలి అక్రమ సంబంధం.. మందలించినందుకు అత్తను..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు