Telangana Rising Global Summit : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన రెండు రోజుల ఈ మెగా సదస్సు పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ భాగస్వామ్యం, ‘విజన్-2047’ ఆవిష్కరణ ద్వారా తెలంగాణ నవ శకానికి నాంది పలికింది. ఈ సమ్మిట్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా ప్రపంచ పారిశ్రామిక పటంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు బలమైన అడుగు పడినట్టైంది.
తెలంగాణ రైజింగ్ – భవితకు బాటలు
ఈ సమ్మిట్ కేవలం ఒక పారిశ్రామిక సదస్సులా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు ఉజ్వల బాటలు వేసే ఒక మార్గదర్శిగా నిలిచిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రణాళికలు, లక్ష్యాలను 2047 విజన్ డాక్యుమెంట్ ప్రపంచానికి చాటిచెప్పింది. 13 గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు, క్యూర్-ప్యూర్-రేర్ రీజియన్లుగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి రచించిన ప్రణాళికలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విజన్ డాక్యుమెంట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఈ సదస్సు బలమైన పునాది వేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ సాధించిన రికార్డు స్థాయి రూ. 5.7 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు తెలంగాణ వృద్ధిని పరుగులు పెట్టించనున్నాయి. కేవలం సాంప్రదాయ పారిశ్రామిక రంగాలకే పరిమితం కాకుండా.. డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటి ఉద్యోగ కల్పనకు అత్యధిక అవకాశాలు ఉన్న రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక వృద్ధి ప్రణాళికలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సమ్మిట్‌లో ఇవే హైలైట్
డీప్ టెక్, కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల అభివృద్ధికి రూ. 1.04 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇన్‌ఫ్రాకీ డీసీ పార్స్క్ రూ. 70 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న గిగావాట్ డేటా సెంటర్, బ్రూక్‌ఫీల్డ్-యాక్సిస్ వెంచర్స్ కన్సార్టియం రూ. 75,000 కోట్ల పెట్టుబడులు, అలాగే వియత్నాం దేశానికి చెందిన విన్ గ్రూప్ రూ. 27,000 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక రిలయన్స్ ‘వంతార’తో వన్యప్రాణి సంరక్షణ, సల్మాన్‌ఖాన్ వెంచర్స్ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుతో పర్యాటక రంగం, క్రియేటివ్ ఎకానమీ వృద్ధి చెందనున్నాయి. దీనివల్ల సాంస్కృతిక ప్రాముఖ్యత పెరిగి, ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ తన స్థానాన్ని సుస్థిర చేసుకోనుంది. ఫ్యూచర్ సిటీలో రానున్న పదేళ్లలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ ప్రకటించడం సమ్మిట్‌లో హైలైట్‌గా నిలిచింది.
అంతర్జాతీయ ప్రాముఖ్యత
44 దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులతో సహా సుమారు 2,000 మందికి పైగా దేశీయ, విదేశీ అతిథులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంక్, డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, హెల్త్‌కేర్, టెక్ దిగ్గజాలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, మాజీ ఆర్బీఐ గవర్నర్లు, సినీ, క్రీడారంగ ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తెలంగాణపై ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచినట్టైంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 గ్రాండ్ సక్సెస్ అవ్వడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు ఇచ్చింది. ఇది రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి, సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా బ్రాండ్‌కు తగ్గట్టుగా యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దోహదపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ ఎన్నో అంచనాల మధ్య జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందనే విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Telangana Rising Global Summit 2025 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025: రెండు రోజులు ఏం జరిగిందంటే..
Telangana Global Summit: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో తెలంగాణ దూసుకెళ్తోంది
