Sri Sathya Sai : పుట్టపర్తి – శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన ఈ విశిష్ట కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ బాబా బోధనలు, ఆయన సేవా మార్గం, ఆయన కొనసాగించిన మానవతా కార్యక్రమాల ప్రాధాన్యతను దేశ ప్రజలకు గుర్తుచేశారు.
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి శతజయంతి పురస్కరించుకుని రూ.100 విలువైన స్మారక నాణెం మరియు స్మారక తపాలా బిళ్లలను కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాబా బోధనలు – ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రేమ, సేవా సందేశం
ప్రధాని మోదీ మాట్లాడుతూ, సత్యసాయి బాబా జీవితం వసుధైవ కుటుంబకం అనే సూత్రానికి ప్రతిరూపమని, ఆయన ప్రేమ, కరుణ, సేవ అనే విలువలు కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చాయని తెలిపారు. “లవ్ ఆల్ – సర్వ్ ఆల్” అనే బాబా బోధన ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలకు నాంది పలికారన్నారు. బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్థాపించిన సంస్థలు గ్రామీణాభివృద్ధి, ఉచిత వైద్యం, తాగునీరు, విద్య వంటి కీలక రంగాల్లో నిరంతర సేవలు అందిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా విస్తరించిన సత్యసాయి సేవాదళ్ సేవలు
ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సత్యసాయి సేవా దళ్ సభ్యుల సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని అన్నారు. భుజ్ భూకంపం సమయంలో వారి సేవలు తాను ప్రత్యక్షంగా చూసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఒక్క జిల్లా కాదు – దేశమంతటా:
విపత్తు నిర్వహణ
ఉచిత వైద్యం
తాగునీటి సరఫరా
గ్రామీణ సేవలు వంటి కీలక రంగాల్లో సేవాదళ్ ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు.
తాగునీరు, వైద్యం, విద్యలో బాబా సంస్థల అసాధారణ సేవలు
సత్యసాయి సంస్థలు ఇంతవరకు:
3,000+ కిలోమీటర్ల తాగునీటి పైప్ లైన్లను ఏర్పాటు చేసి లక్షలాది మందికి తాగునీరు అందించాయి.
ఆధునిక వైద్య పద్దతులతో ఉచిత వైద్యం అందిస్తున్న ఆసుపత్రులు బాబా కల అని చెప్పారు.
సేవే ధర్మమని, సేవే మాధవసేవ అని కోట్లాది భక్తులు నమ్ముతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ప్రధాని అభినందించారు.
సుకన్య సమృద్ధి యోజన – బాలికల భవిష్యత్‌కు బలమైన పునాది
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత ప్రభుత్వ సోషల్ సెక్యూరిటీ పథకాల ప్రాధాన్యతను వివరించారు.
ప్రస్తుతం 4 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్నాయని, ఈ ఖాతాల్లో ₹3.25 లక్షల కోట్లకు పైగా నిల్వ ఉందని వెల్లడించారు. వారణాసి ఎంపీగా 27 వేల బాలికలకు సుకన్య ఖాతాలు తెరిపించానని గుర్తు చేశారు. సత్యసాయి ట్రస్టు వేలాది బాలికలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోంది అని చెప్పారు.
పేదల జీవితాలను మార్చే ‘గిర్’ జాతి గోవుల పంపిణీ
పుట్టపర్తి వేదికగా సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో వంద గిర్ జాతి గోవులను పేద కుటుంబాలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా అందజేశారు. ప్రధాని మాట్లాడుతూ.. పేదల జీవనోపాధిని బలోపేతం చేస్తాయన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో భాగంగా వారణాసిలో 480కు పైగా గిర్ ఆవులను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 1,000కి పైగా గిర్ ఆవులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అంతేకాదు రువాండాలో కూడా 200కి పైగా భారతీయ గిర్ జాతి ఆవులు దానం పద్ధతిలో ఉన్నాయని, ఇది భారత సంస్కృతి ప్రపంచానికి అందించిన విశిష్ట సంప్రదాయమని చెప్పారు.
దేశ అభివృద్ధి కోసం ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపు
భారత్ వికసిత్ దేశంగా మారాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
స్థానిక ఉత్పత్తులు కొనండి
స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించండి
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పడండి అని పేర్కొన్నారు.
కరుణ, శాంతి, కర్మ – బాబా చూపించిన మార్గం
చివరిగా దేశ ప్రజలు సత్యసాయి బాబా ఇచ్చిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాన్ని అనుసరిస్తూ సమాజ సేవలో ముందుకు రావాలని మోదీ కోరారు. “సమాజాన్ని ఆదుకోవడం, ప్రజలకు అండగా నిలవడం – ఇదే బాబా బోధన. మనం అందరం కలిసి ముందుకు వెళ్లాలి” అని అన్నారు.
ఇవీ చదవండి: PM Modi : పీఎం మోదీ దాతృత్వం: పుట్టపర్తి రైతులకు గుజరాత్ జీఐఆర్ ఆవుల విరాళం
PM Modi in Bhutan : భూటాన్‌లో ప్రధాని మోదీకి ‘అన్నయ్య’కు లభించిన ఆత్మీయ స్వాగతం: బంధం, అభివృద్ధిపై దృష్టి
