HomeUncategorizedAP DSC 2025: ఎట్టకేలకు ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్.. ముఖ్యాంశాలు ఇవీ

AP DSC 2025: ఎట్టకేలకు ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్.. ముఖ్యాంశాలు ఇవీ

AP DSC 2025: ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులను ఊరించి ఊరించి ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవాళ (20.04.2025) విడుదలైంది. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ (AP DSC 2025) ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత వైయస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ మేరకు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ కు గ్రహణం పట్టింది. డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసి దాని స్థానంలో 16347 పోస్టులతో కూటమి సర్కార్ మెగా డీఎస్సీని అనౌన్స్ చేసింది.

మొదటి సంతకానికి మోక్షం
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ మేరకు మొదటి సంతకమే మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. డిసెంబర్ నెలాఖరులోగా పోస్టులు భర్తీ చేసి కొత్త సంవత్సర కానుకగా ఉపాధ్యాయులను బడుల్లో అడుగు పెట్టేలా చేస్తామని చెప్పారు. అయితే, ఆ మేరకు చర్యలు తీసుకోలేకపోయారు.

నాటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న డీఎస్సీ ప్రక్రియ.. ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ ఎప్పుడా అని ఎదురు చూస్తూ నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని హాస్టళ్లలో ఉంటూ, కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. మరికొందరు ఉన్న ఉద్యోగాలను వదులుకుని ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వం ఇలా తాత్సారం చేస్తుండడంతో నిరుద్యోగుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఇప్పటికే ఏడాది కాలం పాటు టైమ్ వేస్ట్ అయ్యేలా చేసిన ప్రభుత్వం.. ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇస్తున్నందుకు సంతోషం అంటూ పలువురు నిరుద్యోగులు చెబుతున్నారు.

గతేడాది నవంబర్ తొలి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన ముందురోజే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఎస్సీ వర్గీకరణ అనంతరమే డీఎస్సీ అని తేలింది. అదే నెల 15వ తేదీన ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు విధించారు. కానీ, జనవరి 15లోగా నివేదిక ప్రభుత్వానికి ఇవ్వలేకపోయింది.

ఇక బడులు తెరిచే నాటికి డీఎస్సీ అంటూ చంద్రబాబు ఈ మధ్య కాలంలో చెబుతూ వచ్చారు. ఇవాళ విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో కూడా జూన్ 12 నాటికి బడులు తెరిస్తే జూలై 6 వరకు పరీక్షలుంటాయని పేర్కొన్నారు. ప్రాథమిక కీ, అభ్యంతరాల స్వీకరణ, ఫైనల్ కీ, మెరిట్ జాబితా… ఇలా అన్నీ పూర్తయ్యే సరికి ఇంకా సమయం పట్టేట్టు ఉంది.

గత ప్రభుత్వంలో డీఎస్సీ నియామకాలు..
గత వైయస్ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లలో 15,000కు పైగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా వెలువరించారని గుర్తు చేశారు. జగన్ హయాంలో డీఎస్సీ పోస్టింగుల భర్తీ ఇలా..

1998 డీఎస్సీ పోస్టింగులు 4,059
2008 డీఎస్సీ పోస్టింగులు 2,193
2018 డీఎస్సీ పోస్టింగులు 6,954
2019 స్పెషల్ డీఎస్సీ పోస్టులు 602
కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200
2024 డీఎస్సీ నోటిఫికేషన్ 6,100
మొత్తం 21,108 టీచర్ ఉద్యోగాల భర్తీకి జగన్ హయాంలో అడుగులు పడ్డాయని వైయస్సార్ సీపీ చెబుతోంది.

జగన్ న్యాయం చేశారా?
చంద్రబాబు సర్కార్ చేతిలో మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వైయస్సార్ సీపీ చెబుతోంది. 2018 డీఎస్సీలో చంద్రబాబు చేతిలో అభ్యర్థులు మోసపోతే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి 6,954 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగులు ఇచ్చారని ఆ పార్టీ గుర్తు చేస్తోంది. అంతకు ముందు కూడా 1998, 2008 డీఎస్సీ అభ్యర్థుల దశాబ్దాల ఇక్కట్లకు పరిష్కారం చూపి టైమ్ స్కేల్ ప్రాతిపదికన నియమించిన విషయాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది. గతంలో చంద్రబాబు సర్కార్ 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారంటూ వైసీపీ విమర్శిస్తోంది.

ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ రిలీజ్ : ఏప్రిల్ 20, 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు గడువు : మే 15, 2025
మాక్ టెస్ట్ : మే 20, 2025 నుంచి
హాల్ టికెట్ల డౌన్ లోడ్ : మే 30, 2025 నుంచి
పరీక్షలు : జూన్ 6 నుంచి జూలై 6 వరకు.
ప్రైమరీ కీ రిలీజ్ : పరీక్ష పూర్తయిన రెండో రోజున
అభ్యంతరాల స్వీకరణ : ప్రాథమిక కీ రిలీజైన 7 రోజులకు
ఫైనల్ కీ : అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత
మెరిట్ జాబితా : ఫైనల్ కీ విడుదలైన 7 రోజుల తర్వాత

ఇవీ చదవండి: DSC Notification

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు