HomeAndhra PradeshYS Jagan in Chodavaram: చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా.. గోవింద! చోడవరంలో సీఎం...

YS Jagan in Chodavaram: చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా.. గోవింద! చోడవరంలో సీఎం జగన్‌

YS Jagan in Chodavaram: చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా.. గోవింద.. అంటూ సీఎం జగన్‌ సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఇవాళ తొలి సభ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించారు. భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండచిలువ నోట్లో తలకాయపెట్టినట్లేనంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. చోడవరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..

“మన చోడవరం సిద్ధమేనా.. ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ జగన్ రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.

కేవలం మరో రెండు వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామం.. జరగబోతున్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మనం వేసే మన ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే.

ఇదీ చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే మళ్లీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతున్న సత్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతున్నా. బాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయపెట్టినట్లే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. మరి మన చోడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా..

ఓ బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్తా గోవిందా గోవింద.. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా గోవింద గురించే. ఈ తిరుపతిలో ఏడుకొండలుపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు ఈ గోవిందా గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ప్రజలు ఎలా చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బతుకులు ఎలా అతలాకుతలం అయ్యాయో చెప్పే గోవిందా.. గోవింద.

మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడో చూద్దామా? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్దమనిషి చంద్రబాబు తాను స్వయానా సంతకం పెట్టి ఇప్పటి కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ల ఫొటోలు పెట్టి ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా?

2014 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు. ఇంటింటికీ రూ.2వేల నిరుద్యోగభృతి అన్నాడా లేదా? మరి 5 ఏళ్లు, ప్రతి ఇంటికీ నెలనెలా రూ.2 వేలు అంటే 60 నెలల్లో రూ.1.20 లక్షలు ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన ఆ తల్లిదండ్రులూ ఏమైంది? చంద్రబాబును నమ్మి ఓటేశారు ఏమైంది? గోవిందా.. గోవింద.

రూ.87,612 కోట్లు రైతు రుణాల మాఫీ అని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించారు. ఆ తర్వాత గోవిందా.. గోవింద. రూ.14,205 కోట్లు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఎన్నికలు అయ్యాయి. నా అక్కచెల్లెమ్మలు చంద్రబాబు నాయుడుని నమ్మారు. అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా.. గోవింద.

అప్పటి దాకా ఇస్తున్న సున్నా వడ్డీ కూడా గోవిందా గోవింద. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంకు అకౌంట్లలో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయ్యాయి. నా అక్కచెల్లెమ్మలు వాళ్ల కుటుంబాలన్నీ చంద్రబాబును నమ్మారు. ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు అకౌంట్లలో వేశాడా? మరి ఏమైంది? అన్నా, తమ్ముడూ ఏమైంది? గోవిందా.. గోవింద.

మహాలక్ష్మి పథకం కింద దేవతల పేరు పెట్టి కూడా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు ఇదే పెద్దమనిషి చంద్రబాబు. ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నా అక్కచెల్లెమ్మలు, కుటుంబాలు ఈ మాట నమ్మారు. నమ్మి 2014 ఎన్నికల్లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే ఏమైంది? గోవిందా.. గోవింద.

హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది? ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవిందా.. గోవింద. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు. దాన్నీ గోవిందా.. గోవింద. గోవిందా.. గోవింద. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరితెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్దమనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవిందా. విభజన హామీలూ గోవింద. సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్దమనిషి చంద్రబాబు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తున్న వైజాగ్ ను వదిలేశాడు. సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం అన్ని హంగులతో కనిపిస్తున్నా వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అంటే అదికూడా గోవిందా.. గోవింద.

ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తోందా అని అడుగుతున్నాను. అది కూడా గోవిందా.. గోవింద. అందరూ ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రతి ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నా. మరి 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికీ ఈయన సంతకం పెట్టి, వీళ్ల ముగ్గురి ఫొటోలతో ప్రతి ఇంటికీ పంపించిన చంద్రబాబు ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? మరి ఈ పెద్దమనిషిని నమ్మవచ్చా అని అడుగుతున్నాను. నమ్మవచ్చా అన్నా, తమ్ముడూ, అమ్మా.. నమ్మవచ్చా?

సూపర్ సిక్స్ అంటున్నాడు నమ్మవచ్చా? సూపర్ సెవెన్ అంటున్నాడు నమ్మవచ్చా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నాడు, బెంజ్ కారు అంటున్నాడు నమ్మవచ్చా? నమ్మితే ఏమవుతుంది? కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి.

బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా. బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. బాబు మాటలు నమ్మితే అంతే గోవిందా.. గోవింద. అందరూ ఆలోచన చేయమని కోరుతున్నా. మీ అందరితో ఆలోచించండి అని మరొక్కమారు కోరుతున్నా.మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికీ తీసుకొస్తున్నాను. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు. ఆయన 3 సార్లు సీఎంగా చేశాను అని కూడా చెబుతాడు. మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను.

మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ పేదవాడికీ ఏ మంచీ చేయని ఈ వ్యక్తి. తన హయాంలో తాను చేసిందేమిటి అంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత, ఓ రామోజీ ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి, టీవీ5కి ఇంత అని వీళ్లంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం.. ఇదీ చంద్రబాబు గారు తన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఇదీ. ప్రతి ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్కా, అన్నా, తమ్ముడూ నేను చెప్పేది బాగా వినండి.

మీ బిడ్డ ఈరోజు బటన్లు నొక్కుతున్నాడు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్లిపోతోంది. కానీ ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడుగారి హయాంలో ఆయన చేసిందేమిటి అంటే అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకుని పంచుకున్నది. ఆ దోచుకుని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి.

కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చే సరికే ఏం చేస్తాడు? ఆ డబ్బులోంచి మీలో ప్రతి ఒక్కరికీ ఓటుకు రూ.2వేలు అంటాడు. ఓటుకు రూ.3 వేలు అంటాడు. కొన్ని కొన్ని చోట్ల ఓటుకు రూ.4 వేలు, రూ.5 వేలు అంటాడు. ఇక్కడే మీ అందరికీ చెబుతున్నా. చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి. డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనకండి. ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.

ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది? కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని, ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని ఆ తర్వతనే ఓటు వేయండి అని కోరుతున్నాను.

మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ పెంచిన అమ్మ ఒడి, మళ్లీ ఓ చేయూత, మళ్లీ ఓ సున్నా వడ్డీ, మళ్లీ ఇళ్ల స్థలాలు, మళ్లీ ఇల్లు కట్టించే కార్యక్రమం. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, మళ్లీ ఓ వాహనమిత్ర, మళ్లీ ఓ నేతన్న నేస్తం, మళ్లీ ఓ మత్స్యకార భరోసా, మళ్లీ ఓ తోడు, చేదోడు, లా నేస్తం.. ఈ పథకాలన్నీ రావాలి అంటే మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతి దీవెన, నా అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కల్యాణమస్తు, షాదీ తోఫా, రైతన్నలకు మంచి జరుగుతుంది.

రైతన్నలకు సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారం చెల్లించే ఇన్ పుట్ సబ్సిడీ, రైతన్నలకు పెంచిన పెట్టుబడి సాయంగా రైతు భరోసా. చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థలు. ఇవన్నీ జరగాలంటే, కొనసాగాలంటే మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికీ ఆరోగ్య సురక్ష.. ఇవన్నీ కూడా మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా.

మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్, మళ్లీ పెంచనున్న పెన్షన్, ఇంటి ముంగిటకే రేషన్, పౌర సేవలన్నీ, పథకాలన్నీ ఇంటికే వచ్చే కార్యక్రమం మళ్లీ మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నేను చెప్పిన ప్రతి స్కీమూ, పథకం కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతున్నాయి. ఏ నెలలో ఏ పథకం మీకు వస్తుందన్నది కూడా సంవత్సరం ముందే క్యాలెండర్ ఇచ్చి మరీ ఆ నెల తప్పకుండా ఆ పథకాలన్నీ మీ ఇంటికే, మీ చేతికే, మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నా అక్కచెల్లెమ్మల ఇంటికే ఈరోజు ఈ పథకాలన్నీ వస్తున్నాయంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి భిన్నంగా జరుగుతున్న ఈ పాలనను ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. మరి మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను.

వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, అవి ఇంటికే రావాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మనవ్యవసాయం, మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా..

ఈరోజు ఇదే చోడవరంలో కూడా మీకు మార్పు కనిపిస్తుంది. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది? ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులేమిటో మీరంతా చూస్తున్నారు కదా. మంచి చేస్తున్న మీ ప్రభుత్వానికి తోడుగా, అండగా ఉంటూ ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మీ అందరినీ కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ అన్న నిలబడి ఉన్నాడు. మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తున్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు అన్న పక్కనే ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నా. అని సీఎం జగన్‌ ముగించారు.

ఇవీ చదవండి: YS Jagan in Kandukuru: నాన్‌ లోకల్‌ కిట్టీ పార్టీలు వస్తున్నాయి జాగ్రత్త.. కందుకూరులో సీఎం జగన్!
YS Jagan in Tadipatri: దద్దరిల్లిన తాడిపత్రి.. మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలన్న సీఎం జగన్‌
YS Jagan in Venkatagiri: వెంకటగిరిలో జనసముద్రం.. చంద్రబాబుకు ప్రశ్నలవర్షం కురిపించిన సీఎం జగన్‌
YSRCP Manifesto 2024: మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదలలో జగన్‌
YSRCP Manifesto: వైయస్సార్‌ సీపీమేనిఫెస్టో రిలీజ్.. సీఎం జగన్‌ కామెంట్స్‌ ఇవీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు