HomeAndhra PradeshAPEMCL App: వ్యర్థాల నిర్వహణపై దేశంలోనే తొలిసారి కార్పొరేషన్ ఏపీలో..

APEMCL App: వ్యర్థాల నిర్వహణపై దేశంలోనే తొలిసారి కార్పొరేషన్ ఏపీలో..

APEMCL App: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రమాదకర వ్యర్థాల నిర్వహణపై దేశంలోనే తొలిసారి ఒక కార్పోరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర పర్యావరణ, ఇంధన, అటవీ, శాస్త్ర-సాంకేతిక, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పర్యావరణ యాజమాన్య కార్పోరేషన్ (APEMCL)ప్రధాన కార్యాలయంలో వ్యర్థాల నిర్వహణ కోసం రూపొందించిన నాలుగు ఆన్ లైన్ యాప్ లను ఆయన ప్రారంభించారు. (APEMCL App)

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ వ్యర్థాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి జగన్ 2020లో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ యాజమాన్య కార్పొరేషన్ (APEMCL)ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పరిశ్రమలు, ఆసుపత్రులు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, థర్మల్ పవర్ స్టేషన్లు ఇలా కాలుష్యకారక వ్యర్థాలను ఉత్పత్తి చేసే రంగాలను పర్యవేక్షించడం, వ్యర్థాలను శుద్ది చేయడం, సురక్షితంగా వాటిని నిర్మూలించడం వంటి కార్యక్రమాలను ఈ కార్పోరేషన్ సమర్థంగా నిర్వహిస్తోందన్నారు. దీనిలో భాగంగా నాలుగు ఆన్ లైన్ యాప్ లను రూపొందించడం అభినందనీయమన్నారు.

ఈ ఆన్ లైన్ యాప్ ల ద్వారా అటు పరిశ్రమల ప్రతినిధులను, ఇటు ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సమన్వయం చేస్తూ, వ్యర్థాలను సురక్షితంగా తరలించడం, శుద్దిచేయడం, నిర్మూలించే విధానాలను శాస్త్రీయంగా పర్యవేక్షించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను తరలించే వాహనాలను ట్రాకింగ్ చేసే విధానంను ఈ యాప్ లో పొందుపరచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

గతంలో వ్యర్థాలు తరలించే వాహనం ఎక్కడ, ఎంత సేపు నిలిచినా దానికి సమగ్ర పర్యవేక్షణ ఉండేది కాదని, తాజాగా ఈ యాప్ తో సదరు వాహనాలను అనుసంధానం చేయడం వల్ల వాహనం బయలుదేరిన తరువాత నుంచి ప్రతి నిమిషం అది ఎక్కడ ఉంది, ఎందుకు మద్యలో నిలిపివేశారు, వ్యర్థాలను ఎక్కడకు చేర్చారు అనే అన్ని అంశాలు పూర్తి వివరాలతో నమోదవుతాయని అన్నారు. గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో వ్యర్థాలను అటవీభూముల్లో పారబోస్తున్నారనే అనేక ఫిర్యాదులు వచ్చేవని, వాటిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చేదని అన్నారు. ఇప్పుడు ఈ విధానం వల్ల సమర్థంగా వ్యర్థాల నిర్వహణపై మంచి పర్యవేక్షణ సాధ్యపడుతోందని అన్నారు.

మెరైన్ డిశ్చార్జింగ్ సిస్థమ్ కు కూడా తాజాగా రూపొందించిన యాప్ వల్ల మరింత సమర్థంగా పర్యవేక్షణ చేసే వీలు కలిగిందని అన్నారు. గతంలో ఆయా పరిశ్రమలు తాము నిల్వ చేసిన పాండ్ ల నుంచి కాలుష్య కారకాలపై శాంపిల్ ను సేకరించి రిపోర్ట్ లను అందచేసేవాని, దీనివల్ల కొన్నిసార్లు సరైన రిపోర్ట్ లు అందేవి కావని అన్నారు. ఇప్పుడు ఇప్పుడు శాంపిలింగ్ తో అటు పరిశ్రమల నిర్వాహకులకు, కాలుష్య నియంత్రణ మండలికి ఒకేసారి రిపోర్ట్ అందుతుందని, దీనివల్ల దానిని తప్పుదారి పట్టించే అవకాశం ఉండదని అన్నారు.

అలాగే మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS) ద్వారా అటు పరిశ్రమల నిర్వాహకులకు, ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు సరైన నివేదికలు ఆన్ లైన్ ద్వారా అందుతాయి. దీనితో తమ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను మార్చుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రమాదకర వ్యర్థాల ఉత్పత్తి, వాటిని ఎవరికి అందచేస్తున్నారు, వాటి ప్రాసెసింగ్, నియంత్రణలకు సంబంధించి ఫారం-3 ద్వారా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నివేదికల ద్వారా అన్ని పరిశ్రమలు, సంస్థలకు సంబంధించిన వ్యర్థాల పూర్తి వివరాలు ఆన్ లైన్ లో కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తుందన్నారు. ఈ విధానాల వల్ల వ్యర్థాలను సమర్థంగా నిర్వహించేందుకు మరింత సులువుగా ఉంటుందని తెలిపారు.

వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే సంస్థలకు, వాటిని ఉత్పత్తి చేసే సంస్థలకు మధ్య APEMCL ఒక వారధిగా నిలుస్తోందని అన్నారు. దీనివల్ల వచ్చే ఆదాయంతోనే కార్పోరేషన్ పనిచేస్తోందని అన్నారు. వ్యర్థాలను కూడా వినియోగించుకునే విధానాలను ప్రోత్సహించడం, వాటిని ప్రాసెస్ చేయడం, సురక్షితంగా నిర్మూలించడం ద్వారా పర్యావరణానికి మేలు కలుగుతుందని అన్నారు. త్వరలోనే ఈ-వేస్ట్, బయోవేస్ట్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కు కారణమయ్యే వ్యర్థాల నియంత్రణపై కార్పోరేషన్ సమగ్ర విధానాలను రూపొందించిందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.

ఇదీ చదవండి: APMDC: మేజర్ మినరల్స్ ఆక్షన్ లో ఏపీకి ‘అవార్డు ఆఫ్ అప్రిసియేషన్’

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు