HomeAndhra PradeshAP Mandous Cyclone: తుపానుతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోలుపై సీఎం కీలక ఆదేశాలు

AP Mandous Cyclone: తుపానుతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోలుపై సీఎం కీలక ఆదేశాలు

AP Mandous Cyclone: ఇటీవల మాండౌస్‌ తుపాను ఏపీలో తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన కూడా చేశారు. వేగంగా సాయం అందించాలని సూచించారు. రేషన్‌ సరుకులు, నష్టపోయిన కుటుంబానికి రూ.2500 చొప్పున సాయం అందించాలని, వారం రోజుల్లోగా పని పూర్తి చేయాలని ఆదేశించారు. తాజాగా ఇదే అంశంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. (AP Mandous Cyclone)

తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలన సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని స్పష్టంచేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి, వారిలో భరోసాను నింపాలన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్‌గా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని, ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని కూడా సీఎం చెప్పారు. ఇదే సమయంలో సంబంధిత అధికారులకు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.

సకాలంలోనే వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే అన్నిరకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని కూడా సీఎం వివరించారు. అలాగే పంటనష్టపోయినవారికి వైయస్సార్‌ ఉచిత బీమాకింద వారికి పరిహారం అందించడానికి అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి నష్టపోయిన ప్రతిరైతునూ ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ప్రారంభించారా అని అధికారులను ఆరా తీసిన సీఎం, ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్‌ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత సవరణలు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం నెలాఖరుకు జిల్లా కలెక్టర్లు తుది జాబితాలు ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సంక్రాంతి సమయానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో మంత్రి జోగి రమేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM Jagan in Bapatla: ఈ ప్రభుత్వం మీది.. కచ్చితంగా తోడుగా నిలబడతాం.. బాపట్ల జిల్లాలో తుపాను బాధితులతో సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు