Reddy Politics: మనకు గిట్టని వ్యక్తులపై బురద జల్లడం ఎక్కడైనా జరిగేదే. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ప్రత్యర్థులైన రాజకీయ నేతలు, సామాజిక వర్గాలపై పెద్ద ఎత్తున బురదజల్లే కార్యక్రమాలు చాలా కాలం కిందటే మొదలయ్యాయి. 2004కు ముందు అంతగా లేని ఈ వ్యక్తిత్వ హననం.. ఆ తర్వాత పేట్రేగిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనంటే గిట్టని కొందరు మీడియా అధిపతులు కక్షగట్టారు. అయితే, పెద్దాయన మంచి మనసున్న వ్యక్తి కాబట్టి పనిగట్టుకొని బురదజల్లినా లైట్ తీసుకొనేవారు. అందుకే శత్రువులు సైతం వైయస్సార్‌కు సలాం చేసేలా చరిష్మా కొనసాగించారు. (Reddy Politics)
వైయస్ మరణానంతరం రాష్ట్రం రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. తదుపరి పరిణామాలతో ఆయన తనయుడు జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇది నచ్చని కొందరు మీడియా అధిపతులు జగన్‌పై ఓ రేంజ్‌లో కక్షగట్టారు. జగన్ క్రిస్టియన్ అని, రెడ్డే కాదని, లక్ష కోట్ల అవినీతి, క్రిడ్‌ప్రోకోకు పాల్పడ్డారని, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నాడంటూ వరుస కథనాలు, వార్తలు, ప్రచురించాయి, ప్రసారం చేశారు. ఆఖరికి జగన్ జైలుపాలయ్యాక కూడా ఇదే శైలి కొనసాగించారు.
ఇవన్నీ తట్టుకొంటూ వచ్చిన జగన్.. 2014లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అప్పటికీ పోరు ఆపలేదు. అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోయేసరికి జగన్ ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పాదయాత్ర చేసి 151 సీట్లతో చరిత్రలో కనీవినీ ఎరుగని విజయం సాధించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేస్తూ మాట నిలబెట్టుకున్నారు. గతం కంటే పాలన ఏ రకంగా చూసుకున్నా బాగుందని సామాన్యులు సైతం చెబుతున్న పరిస్థితి. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం.. జగన్ రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నాడని, 40 ఏళ్ల ఇండస్ట్రీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందంటూ నిత్యం జగన్‌పై దుష్ప్రచారం, అబద్ధాలను అచ్చేస్తూ టీవీల్లో ఊదరగొడుతున్నాయి.
జగన్‌పై కక్షగట్టే క్రమంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఏపీలో ఆ మీడియా సంస్థలు బూచిగా చూపసాగాయి. జగన్‌కు సపోర్ట్ చేసే రెడ్డి ప్రజా ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తే చాలు.. రౌడీల్లా చిత్రీకరిస్తూ అభాండాలు వేస్తున్నారు.
అదే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాం తొమ్మిదిన్నరేళ్లు ఈ మీడియా అధిపతులు కిక్కురుమనలేదు. పైగా తెలంగాణతో పోలుస్తూ ఏపీలో ఏమీ జరగడం లేదన్న వార్తలు వేశారు. ఒక్క వ్యతిరేక వార్త రాయడానికి, చూపించడానికి కూడా సాహసించలేకపోయారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇంకేముంది.. సీఎం రేవంత్‌రెడ్డి తమవాడేనంటూ ఈ మీడియా అధిపతులు నెత్తిన పెట్టుకొని వార్తలు రాస్తున్నారు. తెలంగాణలో ఏ రెడ్డి ప్రజా ప్రతినిధినీ పల్లెత్తుమాట అనడానికి సాహసించడం లేదు. కానీ ఏపీలో రెడ్డి అంటేనే అంతెత్తున లేస్తోంది సదరు మీడియా. దీనికి కారణం.. రేవంత్‌రెడ్డి గతంలో ఓ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడమే.
40 ఏళ్ల ఇండస్ట్రీని విమర్శించని రెడ్డి అయితే ఓకే. ఆ మీడియా తీరును, ఆయన్ను, ఆ పార్టీని విమర్శిస్తే ఇక అంతే సంగతులు. ఎక్కడా లేని అవినీతి, దౌర్జన్యం, దమనకాండ అంతా రెడ్లే చేస్తున్నారనే వార్తలు వరదలా వచ్చేస్తాయి.
రెడ్డి సామాజిక వర్గాన్ని ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా చూపించడం, ప్రొజెక్ట్ చేయడం ఆ మీడియా అధిపతుల ప్రత్యేకత. ఏపీలో.. ప్రత్యేకించి రాయలసీమ రెడ్లంటే విలన్లు..! తెలంగాణలో హీరోలు!! ఇదే ఆ మీడియా అధిపతుల అభిప్రాయం. దీన్ని ప్రజలపై రుద్దడం, 40 ఏళ్ల ఇండస్ట్రీకి కొమ్ముకాయడం, అధికారం చేపడితే ఫలాలు పొందడం.. హవ్వ.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా మారింది సదరు మీడియా అధిపతుల తీరు.
సోషల్ మీడియా యుగంలో, అవేర్‌నెస్ వచ్చిన ఈ కాలంలో కూడా 1980ల కాలం ఐడియాలజీ ప్రయోగిస్తున్నారు. ప్రజలు తమనే నమ్ముతారనుకోవడం, తాము ఏం చెప్పినా, ఏం అచ్చేసినా నమ్ముతారనుకోవడం ఆ మీడియా అధిపతుల ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది. వీళ్లు మారకపోవడమే ప్రత్యర్థి నాయకుడికి బలమైన అస్త్రంగా మారుతోందన్నది మాత్రం వాస్తవం.

[…] ఇదీ చదవండి: Reddy Politics: తెలంగాణలో హీరోలు..! ఏపీలో విలన్ల… […]