UnEmployment: దేశ వ్యాప్తంగా నిరుద్యోగిత (UnEmployment) రేటు పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనాను ఇటీవలే ఇండియా దాటేసిందని గణాంకాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (UnEmployment) కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌గా పరిణమిస్తోంది. అంతకంతకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, దేశంతో పాటు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న అప్పులు.. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయడానికి నిధులు సరిపోక అప్పులు ప్రతి నెలా చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వాలకు కష్టతరంగా మారుతోంది. తాజా గణాంకాల ప్రకారం 2023 ఏప్రిల్ నెలలో ఇండియాలో నిరుద్యోగిత రేటు 8 శాతానికి చేరుకుంది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (Centre for Monitoring India Economy-CMIE) ఈ మేరకు గణాంకాలను వెల్లడించింది. భారతదేశ నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 8.11 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి అని స్పష్టం చేసింది. మార్చి నెలలో నమోదైన 7.8 శాతం నుంచి ఇది పెరిగిందని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం మార్చిలోని 8.51 శాతం నుంచి ఏప్రిల్‌లో 9.8 శాతానికి పెరిగిందని పేర్కొంది. గ్రామీణ నిరుద్యోగం మార్చిలోని 7.47 శాతం నుంచి ఏప్రిల్‌లో 7.34 శాతానికి స్వల్పంగా తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ముఖ్యాంశాలివీ..
1. దేశంలో నిరుద్యోగం పెరిగుతోంది. అయితే, ఏప్రిల్‌లో ఇండియా శ్రామిక శక్తి భాగస్వామ్యం 2.55 కోట్లు పెరిగింది. 46.76 కోట్లకు చేరుకోవడం గమనార్హం. మొత్తం భాగస్వామ్య రేటు 41.98 శాతానికి పెరిగింది.
2. లేబర్ పార్టిసిపేషన్ రేట్ అంటే.. పని చేయడానికి అర్హులైన వ్యక్తుల సంఖ్యను సూచించే లెక్క. మార్చి నెలలో దీని రేటు 39.77 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో 41.98 శాతానికి పుంజుకుంది.
3. ఆ లెక్కన పని చేసే వారి సంఖ్య ఒక్క నెలలోనే 2.55 కోట్లు పుంజుకుంది. ఈ స్థాయి లేబర్ పార్టిసిపేషన్‌కు తగినట్లు జాబ్స్ క్రియేట్ చేయాలంటే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తలకు మించిన భారమే.
4. CMIE డేటా నుంచి కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. ఏప్రిల్‌లో శ్రామిక శక్తిలో చేరిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉండటం వల్ల ఉపాధి దొరుకుతుందన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది.
5. ఏప్రిల్ మాసంలో శ్రామిక శక్తికి జత కలిసిన వారిలో 87 శాతం మంది జాబ్స్ లేదా స్వయం ఉపాధి సాధించడంలో సక్సెస్ అయ్యారు. అంటే ఏప్రిల్ లో 2.21 కోట్ల మందికి ఉపాధి దక్కింది.
6. ఈ కారణంగా, ఏప్రిల్ మాసంలో మొత్తం ఉపాధి కూలీల సంఖ్య 42.97 కోట్లకు చేరుకుంది. ఇది నెల కిందట 40.76 కోట్లుగా ఉండేది. జాబ్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటోందని ఇండికేషన్స్ ఇస్తోంది.
7. వార్షిక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికల ప్రకారం.. గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లలో నిరుద్యోగం రేటు తగ్గుముఖం పడుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ మార్చిలోనే పేర్కొన్నారు.
8. 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో, 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు వరుసగా 17.2%, 15.5%, 14.9శాతంగా ఉంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ల నిరుద్యోగిత రేటులో గణనీయంగా తగ్గుదలకు ఇది సంకేతంగా ఉందని ఆయన తెలిపారు.
9. స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే PLFS, దేశంలో ఉపాధి, నిరుద్యోగం అంశాలపై సమాచారాన్ని సేకరణ చేస్తుంది.
10. వరుసగా మూడే ఏడు కూడా 2023-24 బడ్జెట్‌లో మూలధన పెట్టుబడి వ్యయాన్ని 33 శాతం పెంచి 10 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసింది.
11. ఈ క్రమంలో ఇది జీడీపీలో 3.3 శాతంగా ఉంది. దీంతో మౌలిక సదుపాయాలు, ఉత్పాదకత సామర్థ్యం పెంపులో ఇన్వెస్ట్‌మెంట్లు ఊపందుకున్నాయి. ఇవి ఉపాధి రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి.
Read Also : Phone Pay: ఫోన్ పే వాడుతున్నారా? ఈ గుడ్ న్యూస్ తెలుసా? యాక్టివేట్ చేసుకోండిలా!
