HomeBusinessAndhra Pradesh: ఏపీ అప్పులపై కేంద్రం ఏమందంటే..

Andhra Pradesh: ఏపీ అప్పులపై కేంద్రం ఏమందంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర (Andhra Pradesh) అప్పులు నానాటికీ డేంజర్‌బెల్స్‌ మోగిస్తున్నాయి. అప్పుల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. సంక్షేమంలో దూసుకెళ్తున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి (Andhra Pradesh) అప్పుల కుప్పలు పెను సవాల్‌గా మారుతున్నాయి. కాలం మారుతున్నా ఏపీ (Andhra Pradesh) అప్పులు మాత్రం తగ్గడం లేదు సరికదా.. పెరుగుతూ పోవడంతో భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారుతోంది.

అప్పులు తీర్చే మార్గం ఏది?
అప్పుల కుప్పలు తరిగిపోవాలంటే ఏపీ ముందు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఆర్థిక లోటును పూడ్చే మార్గాలను ప్రభుత్వాలు అన్వేషించలేకపోతున్నాయి. సంపద సృష్టించి అప్పులన్నీ తీర్చే మార్గాన్ని కనుగొనలేక, అటు సంక్షేమాన్ని ఆపలేక రెండు ప్రభుత్వాలు కూడా సతమతమవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం కేవలం సంక్షేమం మాత్రమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధిని పూర్తిగా విస్మరించారనే అపవాదు మూటగట్టుకుంటోంది ప్రభుత్వం.

పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పులపై కేంద్రం వివరాలు వెల్లడించింది. మరోసారి అప్పుల చిట్టాను బయటపెట్టింది కేంద్ర ఆర్థిక శాఖ. అప్పులు దాదాపు రెండింతలయ్యాయని తెలుస్తోంది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోంచి దిగిపోయే సరికి 2019 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉంది. 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022లో సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉందని కేంద్రం వెల్లడించింది. అంటే ఏటా సుమారు రూ.45,000 కోట్లు అప్పులు చేస్తోందని పంకజ్ చౌదరి వివరించారు.

ప్రతిపక్షం చెప్ప మాట ఇదే..
వాస్తవానికి విభజనతో పాటే ఆస్తులు, అప్పులు కూడా ఏపీకి వచ్చాయి. విభజిత నవ్యాంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు పూడ్చుతామని విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, చాలా వరకు కేంద్ర ప్రభుత్వం మొడి చేయి చూపింది. తెలుగు రాష్ట్రాలపై శీతకన్ను వేసిన కేంద్రం.. అప్పులు తీర్చడం, పెద్దన్న పాత్ర పోషిస్తూ విరివిగా ఆదుకోవడం విషయంలోనూ ఏ మాత్రం సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉండగా మొదలైన అప్పులు.. తాజాగా వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కే సమయానికే సుమారు రెండు లక్షల కోట్ల దాకా అప్పులు మిగిలాయి. ఖజానాలో కేవలం వంద కోట్లే మిగిలిందని అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడు సైతం ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించడాన్ని గమనించవచ్చు.

ఇక ప్రస్తుతం జగన్‌ నేతృత్వంలోనే ప్రభుత్వం.. మొదటి నుంచి అటు కేంద్రంతో సఖ్యతగానే ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం కూడా విరివిగా రుణాలు తీసుకొనే వెలుసులుబాటు కల్పిస్తూ వస్తోంది. సంక్షేమ సారధిగా పేరు తెచ్చుకున్న సీఎం జగన్‌.. ఇక అప్పటి నుంచి అప్పులు చేస్తూ రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం పెద్ద మైనస్‌ పాయింట్‌గా అవుతోంది.

అమరావతి పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతలు, చంద్రబాబు అనుయాయులు భూములు కొనేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే కారణంతో అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం కాస్త మెతకవైఖరి అవలంబిస్తోందనే అపవాదు ఉంది. ఈ తరుణంలోనే జగన్‌ మరో స్టాండ్‌ తీసుకోవాల్సి వచ్చింది. మూడు రాజధానుల పేరిట అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని జగన్‌ చెబుతున్నారు.

ఇది వేరు చేయడం తప్ప అభివృద్ధి కాదని, చిత్తశుద్ధి ఉంటే అమరావతిని అభివృద్ధి చేసి చూపించాలంటూ ప్రతిపక్ష టీడీపీ సవాల్‌ విసురుతోంది. ఇవేమీ పెద్దగా పట్టించుకోని జగన్‌.. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే, ఇలా ఎంతకాలం అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. రాష్ట్ర ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా అయిపోతున్నాయి. ఓ దశలో శ్రీలంక మాదిరి మన రాష్ట్ర పరిస్థితి కూడా మారుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపణలు కూడా చేశారు.

ఇలా చేస్తే అప్పులు తగ్గే చాన్స్‌?
అప్పులు తీరే మార్గం కనిపించాలంటే చారిత్రక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖజానాను నింపుకోవడంతో పాటు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఉచిత పథకాలు అవసరమైన మేరకే అమలు చేయాలి. ఇందులో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేతకాని వారికి పింఛన్లు ఇచ్చినా ఫర్వాలేదు. అయితే, వర్గాల వారీగా విడదీసి డబ్బులు పంచడం ఆపేసుకోవాలి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పరిశ్రమలను ప్రభుత్వం ఆకర్షించి పెట్టుబడులు పెట్టించింది. ఇలాంటివి మరిన్ని పెంచడం, ఉద్యోగాల సృష్టి, రెవెన్యూ జనరేట్‌ చేసే అవకాశాలు పెంచుకోవడం లాంటి పనులు చేయాలి.

ఓటు బ్యాంకు రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టేసి, కేవలం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని వర్గాలు నొచ్చుకున్నా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంపై రుణ భారం భారీగా తగ్గిపోయి భవిష్యత్‌ తరాలు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూడగలుగుతారు. ప్రభుత్వాలు మారినా రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తే ఇది సాధ్యమవుతుంది.

Read Also : Phone Pay: ఫోన్‌ పే వాడుతున్నారా? ఈ గుడ్‌ న్యూస్‌ తెలుసా? యాక్టివేట్‌ చేసుకోండిలా!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు