Rain Alert Hyd: హైదరాబాద్ నగరాన్ని మరోసారి వరుణుడు కమ్మేశాడు. నగరంలో భారీ వర్షం కురిసింది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 13 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. (Rain Alert Hyd)
GHMC లో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కుండపోత వానతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. GHMC లో వందలాది కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముసరంబాగ్ బాగ్ బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోయింది.
జీహెచ్‌ఎంసీ అలర్ట్
రాగల 6 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున మహానగర పాలక సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరిక చేసింది.
హైదరాబాద్ లో భారీవర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తలసాని
ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సూచించారు. రోడ్ల పై నీరు నిలిచిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే బయటకు రావాలన్నారు. ప్రజలు అత్యవసర సేవలకు GHMC కంట్రోల్ రూం ను సంప్రదించాలని చెప్పారు.
ఏపీకి భారీ వర్షసూచన
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Read Also : Weather Report Now: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన