HomeSportsCSK vs RCB: చెపాక్‌లో సీఎస్కే బోణీ.. మొదటి మ్యాచ్‌ దేవుడికి ఇచ్చేయడం మా ఆనవాయితీ...

CSK vs RCB: చెపాక్‌లో సీఎస్కే బోణీ.. మొదటి మ్యాచ్‌ దేవుడికి ఇచ్చేయడం మా ఆనవాయితీ తలా..!

CSK vs RCB: ఐపీఎల్‌ 17వ సీజన్‌ (IPL17) అట్టహాసంగా నిన్న రాత్రి ప్రారంభమైంది. తమిళనాడులోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరిగింది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టుతో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) తలపడింది. అంతకుముందు ప్రారంభ వేడుక వైభవంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం, పాటలతో హోరెత్తించారు. స్టేడియం అంతా ఎల్లో డ్రెస్‌లతో నిండిపోయింది.

మొదట టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లెసిస్‌.. బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే బ్యాటర్లు తడబడ్డారు. 41 పరుగుల టీమ్‌ స్కోరు వద్ద కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లెసిస్‌ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రచిన్‌ రవీంద్రకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఫాఫ్ 8 ఫోర్లు కొట్టాడు. అనంతరం మరో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ సైతం ఓ సిక్సర్‌తోనే సరిపెడుతూ 20 బంతుల్లో 21 పరుగులు చేసి ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రచిన్‌ రవీంద్రకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇక రజత్‌ పటీదార్‌ డకౌట్‌ అయ్యి ధోనికి క్యాచ్‌ ఇవ్వగా, మ్యాడ్‌ మ్యాక్సీ సైతం సేమ్‌ టు సేమ్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. ఇక కామరూర్‌ గ్రీన్‌ 18 పరుగులతో రాణించాడు. ఆఖర్లో అనూజ్‌ రావత్‌ 48 పరుగులు, దినేష్ కార్తీక్‌ 38 పరుగులతో జట్టును గౌరవప్రదమైన స్కోరుకు నడిపించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 173-8గా నిలిచింది. సీఎస్కే బౌలర్లలో ముస్తాఫిజుర్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీపక్‌ చాహర్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు.

మోస్తరు టార్గెట్‌ను చేధించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. ఆచితూచి ఆడింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ 15 పరుగులు, రచిన్‌ రవీంద్ర 37 పరుగులు చేశారు. రచిన్‌ రవీంద్ర మాత్రం సూపర్‌ స్ట్రైకర్‌గా మారి.. మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో అలరించాడు. ఇక అజింక్యా రహానె 27 పరుగులు, డారెన్‌ మిచెల్‌ 22 పరుగులు చేసి తలా రెండు సిక్సర్లు బాదారు. ఇక గత సీజన్‌ ఫైనల్‌లో చెలరేగి జట్టుకు కప్‌ అందించడంలో కీలకంగా వ్యవహరించిన శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా కలిసి మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. శివమ్‌ దూబె ఓ సిక్సర్‌, నాలుగు ఫోర్లతో 34 పరుగులు, జడ్డూ 17 బంతుల్లోనే 25 పరుగులతో ఓ సిక్సర్‌ బాదాడు. మొత్తంగా 176 పరుగులను 18.4 ఓవర్లలో రాబట్టింది సీఎస్కే. ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయ బావుటా ఎగురవేసింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు నాలుగు వికెట్లు తీసిన ముస్తాఫిజుర్‌కు దక్కింది. ఈ సీజన్‌లో యువ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు తొలి మ్యాచ్‌లోనే మంచి విజయం దక్కడంతో సీఎస్కేకు మంచి కెప్టెన్‌ దొరికేశాడంటూ నెటిజన్లు, క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ధోని పెద్దరికం, సీనియర్ల అండదండలతో భావి సీఎస్కే సారథిగా రాణిస్తాడన్న నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇక కోహ్లీ, ధోని ఫ్రెండ్షిప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటి మ్యాచ్‌ దేవుడికి ఇచ్చేయడం మాకు ఆనవాయితీ తలా.. అంటూ కోహ్లీ చెబుతున్నట్లుగా మీమ్స్‌ వచ్చాయి.

ఇవాళ్టి మ్యాచుల్లో పంజాబ్‌ కింగ్స్ (PBKSvsDC) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. తర్వాత ఈవెనింగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (KKRvsSRH) జట్లు తలపడనున్నాయి.

ఇవీ చదవండి:MS Dhoni Six: మహేంద్రసింగ్‌ ధోని భారీ సిక్సర్లు.. వీడియో వైరల్‌.. సింహం సిద్ధమవుతోంది!!
MS Dhoni Jersey: ధోనికి బీసీసీఐ గౌరవం.. నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు