KS Bharath with CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో టీమిండియా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంను కేఎస్ భరత్ కలిసి పుష్పగుచ్ఛం అందించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అవకాశం దక్కించుకొని ఆడిన కేఎస్ భరత్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. అనంతరం టీమిండియా సభ్యుల ఆటోగ్రాఫ్‌లతో కూడిన ఇండియన్ టెస్ట్ క్రికెట్ జెర్సీని సీఎం జగన్‌కు కేఎస్ భరత్ అందించారు.
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం కేఎస్ భరత్ (KS Bharath with CM Jagan) మీడియాతో మాట్లాడారు. “జగన్ సార్ సీఎం అయిన తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్ జట్టులో వికెట్ కీపర్‌గా వ్యవహరించడం నాకు గర్వంగా ఉంది. ఈ విషయాలు సీఎంగారితో పంచుకున్నాను. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. సార్ మీరు నాకు ఇన్స్‌పిరేషన్‌గా భావిస్తూ, ఒక క్రికెటర్‌గా మీ మద్దతు నాకు అవసరం అని చెప్పాను. సీఎంగారు కూడా దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సూచించారు.
ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయి. అలాగే స్పోర్ట్స్ ప్రమోషన్ కూడా బాగుంది. క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్‌గా చాలా బాగుంది. మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారు. థ్యాంక్యూ.” అని ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన అనంతరం కేఎస్ భరత్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేఎస్ భరత్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్ క్రిష్ణారావు, కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్ రెడ్డి కూడా ఉన్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. అయితే, ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన కేఎస్ భరత్‌ను టీమిండియా టెస్టు క్రికెట్‌లోకి తీసుకుంది. భరత్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తే రాణిస్తాడనే నమ్మకాన్ని టీమిండియా వెలిబుచ్చుతోంది. అందుకే విరివిగా అవకాశాలు ఇస్తోంది. రిషభ్ పంత్ జట్టులో లేకపోవడంతో కేఎస్ భరత్‌కు కలిసొచ్చింది. మరో సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం కూడా కేఎస్ భరత్‌కు ప్లస్ పాయింట్ అయ్యింది.
ముంబై ఇండియన్స్ జట్టులో వికెట్ కీపర్‌గా రాణిస్తున్న యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా డబ్ల్యూటీసీలో చోటు దక్కించుకున్నప్పటికీ తుది జట్టులో కేఎస్ భరత్‌వైపే కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపాడు. కానీ, హిట్ మ్యాన్ లెక్క తప్పింది. ఆసీస్ చేతిలో ఓటమి చవిచూడక తప్పలేదు. ఐపీఎల్‌లో అదరగొట్టిన మనోళ్లు.. టెస్టు క్రికెట్‌లో పట్టు సాధించలేకపోయారు. ఇదే మ్యాచ్‌తో పునరాగమనం చేసిన సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టుకు అమూల్యమైన భాగస్వామ్యం అందించినప్పటికీ అతడి ప్రదర్శన ఒక్కటే జట్టు విజయానికి సరిపోలేదు.
ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన గుంటూరుకు చెందిన క్రికెటర్, టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు కూడా సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన ప్రాంతానికి ఏదైనా చేయాలనే సంకల్పం ఉందని, సీఎం జగన్‌పై నమ్మకం ఉందని అంబటి రాయుడు చెప్పిన సంగతి తెలిసిందే.
Read Also : Ambati Rayudu: ఐపీఎల్‌కు గుడ్‌బై.. పొలిటికల్ సిక్సర్ల ధమాకా మొదలవుతుందా?