Tomato Pulusu: ప్రస్తుతం టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. ఏ కూర చేయాలనుకున్నా అందులో టమాటాలు ఉంటేనే టేస్టు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి రోజూ కూరలో టమాటా భాగం చేస్తుంటారు. టమోటా లేనిదే పూటగడవదంటే అతిశయోక్తి కాదేమో. పప్పు, టమాటా రసం, టమాటా పచ్చడి, టమాటా చెట్నీ, టమాటా రైస్.. ఇలా అనేక రకాలు కూరల్లో, వంటకాల్లో టమాటా భాగమైపోయింది. ప్రస్తుతం కేజీ రూ.100పైనే ఉండటంతో టమాటాలు కొనడం మానలేక, అటు కూరల్లో టమాటా లేకుండా ఉండలేక సామాన్యులు సతమతం అవుతున్నారు. (Tomato Pulusu)
రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా టమాటా పులు ఎలా చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఇందుకు కావాల్సినవి..
1. టమాటాలు 7 నుంచి 8
2. కొత్తి మీర కొద్దిగా..
3. ఉల్లిపాయలు మీడియం సైజు 2
4. పచ్చి మిర్చి 5
5. కరివేపాకు కొద్దిగా..
6. వెల్లుల్లి రెమ్మలు 5
7. చింతపండు (మీడియం సైజు నిమ్మకాయంత)
8. నూనె కొద్దిగా..
తయారు చేసే విధానం..
మొదట ఉల్లిపాయలను నిలువుగా కోసుకోవాలి. తర్వాత కొత్తి మీరను సన్నగా కట్ చేయాలి. అనంతరం పచ్చి మిర్చిని చీలికలుగా కోసుకోండి. నిమ్మకాయ సైజు చింత పండును తీసుకొని ఓ కప్పు నీళ్లలో నానబెట్టుకోవాలి. తర్వాత ప్రెజర్ కుక్కర్‌ను తీసుకొని టమాటాలను అందులో వేయాలి. అందులో ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. మినరల్ వాటర్ పోసుకొని మూత పెట్టేయాలి. గ్యాస్ స్టౌ మీద పెట్టి నాలుగు విజిల్స్ రాగానే ఆపేయాలి. కాస్త చల్లారే దాకా పక్కన పెట్టి తర్వాత ఓ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
తర్వాత రాచిప్ప తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. అందులో ఆవాలు, మినప పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి కాస్త దంచి వాటిని వేయాలి. చీలికలుగా కోసి పెట్టుకున్న పచ్చి మిర్చి వేసుకోవాలి. తర్వాత కాస్త చిటపటలాడే వరకు కలుపుకోవాలి. తర్వాత కోసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకును తుంచి అందులో వేయాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గేదాకా కాచాలి.
ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మంట సన్నగా చేసుకొని గ్రైండ్ చేసుకున్న టమాటా గుజ్జును అందులో కలుపుకోవాలి. అనంతరం రుచికి సరిపడా చింతపండు రసం కూడా అందులో వేసేయాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ఇంగువ కలపాలి. ఇక అటు తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. కొద్దిసేపు పులుసును మరగనివ్వాలి. దీని తర్వాత కొందరు టమాటా కర్రీలో పులుపును, కారాన్ని తగ్గించుకొనేందుకు బెల్లం వాడుతుంటారు. మీరు రుచిని బ్యాలెన్స్ చేసుకొనేటట్లయితే బెల్లం ఓ ముక్క వేసుకోవచ్చు. బెల్లం ఇష్టం లేని వాళ్లు స్కిప్ చేసేయొచ్చు.
పులుసు కాస్త చిక్కగా తయారు కాగానే పొయ్యిని ఆఫ్ చేసుకోవాలి. ఇక వేడి వేడి టమాటా పులుసు సిద్ధమైపోయినట్లే. కొంచం పుల్లగా, కొంచం కారంగా, మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు తగులుతుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేడి వేడిగా టమాటా పులుసు కలుపుకొని, అందులో కాస్త నెయ్యి వేసి సపరేట్‌గా ఉడికించిన కారం గుడ్డును నంజుకొని తింటే స్వర్గానికి బెత్తెడు… అన్నట్లుగా ఉంటుంది. ఈ వంటకాన్ని మీరు కూడా ట్రై చేయండి మరి. కాకపోతే ప్రస్తుత టమాటా ధరల నడుమ ఇలాంటి కర్రీ చేసుకొని తింటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది మరి!!
Read Also : Good Health Tips: రోగాలు రాకుండా ఉండాలంటే మంచి ఆరోగ్య చిట్కాలివే..