American Education: అమెరికా విద్య తెలుగు విద్యార్థులందరికీ అందుబాటులో ఉందని, విద్యార్థులకు అపార అవకాశాలున్నాయి. స్కాలర్‌షిప్‌లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. అవగాహనతో ముందుకెళ్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. తెలుగు విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. (American Education)
అమెరికా విద్య సందేహాలు – సమాధానాలు
1. అమెరికాకే వెళ్లి ఎందుకు చదువుకోవాలి?
ప్రతి విద్యార్థీ, వారి తల్లిదండ్రులు అన్నిటికంటే ముందు వాళ్లకు వాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్న. సమాధానం కూడా వారిదే.
అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నాం. చదువుకోవడం కోసమేనా, ఉద్యోగం చేయడానికా?
చదువుకోవడం కోసం వనేది మన సమాధానమైతే కేవలం ఆ చదువుపైనే దృష్టిపెట్టి దానికే కట్టుబడాలి.
అమెరికా వీసా పొందడం నుంచి అమెరికా వెళ్లి చదివి తిరిగొచ్చేంతవరకు ఈ దిశగానే మీరు నిజాయతీగా వ్యవహరించాలి.
అమెరికాకే వెళ్లి ఎందుకు చదువుకోవాలంటే అక్కడ విద్య అంత గొప్పగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అమెరికాలో విద్య అంత గొప్పగా ఉంటుంది కాబట్టి.
2. అమెరికాలో ఏది మంచి యూనివర్సిటీ?
అమెరికా ప్రభుత్వం ఏ యూనివర్సిటీని కూడా మంచి యూనివర్సిటీ అనే ప్రత్యేక గుర్తింపు ఇవ్వదు.
అన్నిటికంటే ముందు ప్రతి విద్యార్థి ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి.
కేవలం కొన్ని అధ్యయన సంస్థలు ఆయా యూనివర్సిటీల పనితీరు, పాటిస్తున్న విద్యా ప్రమాణాల ఆధారంగా టాప్ టెన్ యూనివర్సిటీలని, టాప్ హండ్రెడ్ యూనివర్సటీలని ఇలా జాబితా ప్రకటిస్తుంటాయి.
ఈ జాబితాలకు అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ దేశ ప్రభుత్వం ఏ యూనివర్సిటీకి కూడా అలాంటి గుర్తింపులు ఇవ్వదు. అది ఆ దేశ విధానం కూడా కాదు.
కాబట్టి విద్యార్థులు తాము ఏ కోర్సు చేయాలి అనేది ముందుగా వారికో లక్ష్యం ఉండాలి. దాని తరువాత ఈ అధ్యయనాల జాబితాలను పరిశీలించి జాగ్రత్తగా తాము చదవదలచిన యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి.
3. వీసా పొందడమెలా? ఏజెన్సీల సాయం పొందొచ్చా?
నిజాయతీ. అమెరికా వీసా పొందాంటే ముందుగా మీకుండాల్సి, మీరు చూపాల్సింది నిజాయతీ. వీసా ఇంటర్వ్యూలో ఇదే ప్రధానం. మీరు అమెరికాలో చదువుతున్న కోర్సు భారతదేశంలోనూ పలు యూనివర్సిటీలు అందిస్తుంటాయి. ఇక్కడ కూడా మంచి ప్రమాణాలతోనే ఆ కోర్సులు నిర్వహిస్తుంటారు. అలాంటప్పుడు మీరు అమెరికాకే వెళ్లి ఎందుకు చదవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు మీ సమాధానంలో నిజాయతీ, హేతుబద్దత స్పష్టంగా కనిపించాలి.
అమెరికా వీసా పొందడానికి ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. అలా మీరు మధ్యవర్తులను ఆశ్రయిస్తే మీరు మోసపోయినట్లే.
అమెరికా సూచించిన వీసా నిబంధనలను మీరు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇందులో మరో మార్గం లేదు.
4. అమెరికాలో చదవడానికే వెళుతున్నారా?
వీసా ఇంటర్వ్యూలో మీకు ఎదురయ్యే మరో ప్రశ్న. మీరు చదువుకోవడానికి మాత్రమే అయితే ఆ నిజాయతీ ఇంటర్వ్యూలో కనిపించాలి. ఆ చదువు అయిపోగానే మీరు మళ్లీ మీరు తిరిగి భారత్‌కు వచ్చేస్తామనే నమ్మకం అధికారులకు కల్పించాలి. అమెరికాలో కోర్సు చదవడానికి ఖర్చు అవుతుంది. అందుకు తగ్గ ఆర్థిక వనరులు మీకున్నట్లు నిజాయతీతో కూడిన సమాచారం పొందుపరచాలి. ఇలా మీలో ఒక స్పష్టమైన వైఖరి కనిపిస్తే మీరు వీసా పొందడంలో సక్సెస్ అయినట్లే. అలా కాకుండా మీ సమాధానల్లో స్పష్టత లోపించి అనుమానాస్పద వైఖరి కనిపిస్తే మీకు వీసా తిరస్కరిస్తారు.
5. అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చా?
ఈ ఆలోచన ఎంతమాత్రం సరైంది కాదు. చాలా మందిమన భారతీయ విద్యార్థులు అవస్థలపాలయ్యేది, నష్టపోయేది ఇలాంటి ఆలోచనా సరళితోనే. మీరు అమెరికాకు వెళ్లింది చదువుకోవడానికి. ఆ చదువుపట్ల శ్రద్ద ఉండి దానికే అంకితమవ్వాలి. ఆర్థిక ఇబ్బందులున్నాయని చాలా మంది అక్కడ ఏ రీటైల్ స్టోర్‌లోనో, గ్యాస్ స్టేషన్లలోనో పార్ట్‌టైమ్ పనిచేసి సంపాదించి చదువుకుంటూ ఉంటారు. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదు. అది అక్కడ వారి భవిష్యత్తుకు చాలా తీవ్రమైన ప్రతిబంధకం.
అమెరికాలో మీరు కోరిన చదువు చదవడానికి మాత్రమే వెళుతున్నారు. ఈ విషయాన్ని ఆధ్యంతం గుర్తుంచుకోవాలి. అందుకు తగిన ఆర్థిక వనరులు మీకుంటేనే అమెరికాకు వెళ్లండి. అంతే తప్ప మనకు తెలిసిన వాళ్లు ఎవరో చెప్పారని, మనవాళ్లు కొంతమంది అమెరికాలోపార్ట్‌టైమ్ జాబ్ చేసినట్లు చేసి అక్కడ చదివి ఉద్యోగం సంపాదిద్దామని అనుకున్నారో మీరు పొరబడినట్లే. భవిష్యత్తును కష్టాలమయం, ఇబ్బందులమయం చేసుకున్నట్లే. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ప్రయత్నాలు చేయకండి. మీరు చదువు పూర్తి చేసి నిజాయతీగా ఉంటే భారతీయ విద్యార్థులకు అక్కడ కంపెనీలు మంచి అవకాశాలు కల్పిస్తాయి. చదువుకోసమని వెళ్లి, మీరు చదువుకోకుండా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటుంటే మొదటికే మోసం వస్తుంది తస్మాత్ జాగ్రత్త.
6. అమెరికా చట్టాలు అంత కఠినమా?
ఏ చట్టమైనా మనం పాటించనప్పుడే కష్టంగా అనిపిస్తుంది. మనం మన బంధువుల ఇళ్లకు వెళ్లామంటే వారి మర్యాదలను మనం గౌరవిస్తాం. అలాగే దేశం కూడా. మనం మరో దేశానికి వెళ్లినప్పుడు వారి చట్టాలను, సంస్కృతి సంప్రదాయాలను తప్పనిసరిగా గౌరవించాల్సిందే, పాటించాల్సిందే. మన భారత్ లాగే అమెరికా కూడా గొప్ప దేశం. అక్కడ పౌరులు చట్టాలను తప్పనిసరిగా పాటిస్తారు. అందులో తనమన అనే బేధం ఉండదు. మనం కూడా ఆ చట్టాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే.
భారతీయులంటే అమెరికాకు అపారమైన గౌరవం. మిగిలిన దేశాల వారికంటే కూడా అమెరికావాళ్లు మన భారతీయుల ప్రతిభకు పట్టం కడతారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, పెప్సీ సీఈఓ ఇంద్రా నూయి లాంటి పెద్దపెద్దవాళ్లంతా భారతీయులే. మనం ఆ దేశంలో చెడుగా ప్రవర్తిస్తే మన ప్రవర్తన అక్కడి మన భారతీయులందరికీ చెడ్డపేరు తీసుకువస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం అమెరికాలో ఉన్నంతసేపు మన ప్రవర్తనతో ఆ దేశం మెప్పు పొందేలా ఉండాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది.
7. స్కాలర్ షిప్పులు పొందే వీలుందా?
అమెరికా విద్యా విధానం మన భారతీయ విద్యార్థులకు ఒక అదృష్టంగానే భావించాలి. మన విద్యార్థులు అక్కడ యూనివర్సిటీల నుంచి ఆర్థిక వెసులుబాటు పొందే విధంగా అనేక అవకాశాలను ఆ దేశం కల్పిస్తుంది. అమెరికాలోని యూనివర్సటీలు తమ విద్యార్థులకు అనేక రకాల ఉపకారవేతనాలు (స్కాలర్‌షిప్పులు) కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏబీఈటీ (అక్రిడిటేషన్ బోర్డు ఫర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) సమాచారం ప్రకారం అమెరికాలో 350కి పైగా యూనివర్సిటీలు స్కాలర్‌షిప్పులు కల్పిస్తున్నాయి. ఈ యూనివర్సీటీల్లో ఎంపిక చేసుకుని వాటిలో చేరిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్పులు పొందే అవకాశముంటుంది.
8.గుర్తింపున్న యూనివర్సీటీల ఎంపిక ఎలా?
అమెరికాలో దాదాపు నాలుగు వేలకుపైగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలున్నాయి.
గుర్తింపు అంటే కేవలం అమెరికా ప్రభుత్వం వద్ద అవి సంస్థగా నమోదు చేసుకుని మాత్రమే ఉంటాయి. అంతే తప్ప రికగ్నైజ్డ్ బై అమెరికా అని ఏమీ ఉండదు. ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
9. మనలాగా కామన్ ఎంట్రెన్స్ టెస్టు ఉంటుందా?
ఉండదు. అమెరికాలో ఒక్కో యూనివర్సిటీ ప్రవేశ విధాం ఒక్కో విధంగా ఉంటుంది. ఒక యూనివర్సిటీకి మరో యూనివర్సిటీ పోలిక ఉండదు. పీజులు, కోర్సులు, బోధనా పద్దతులు అన్నీ కూడా ఇంతే తేడాగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి కోర్సుకు ఏది సరిపోతుందో వివేకంతో వ్యవహరించి ఎంపిక చేసుకోవాలి.
10. ఎంపిక చేసుకునేందుకు ఎవరూ సహాయపడరా?
ఎందుకు సహయాపడరూ. కొన్ని వ్యవస్థలు మీకు సహాయం చేస్తాయి. అందులో ఒకటి
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు వెబ్‌సైటు. ఇందులో ఎస్ఈవీపీ అప్రూవ్డ్ స్కూల్స్ జాబితా లభిస్తుంది. ఇంకా గ్రాండ్‌మాస్టర్ డాట్‌కామ్, పీటర్స్ డాట్‌కామ్ లాంటి వెబ్‌సైట్లు మీకు సహాయపడతాయి.
11. యూనివర్సిటీ నుంచీ అడ్మిషన్ వచ్చినట్లు తెలిసేదెలా?
మీకు ఏ విద్యా సంస్థ ప్రవేశం కల్పిస్తుందో ఆ సంస్థ నుంచి మీకు ఐ-20 ఫామ్ అందుతుంది. అది మీకు అడ్మిషన్ కల్పించినట్లు ఆ సంస్థ ఏక కాలంలో మీకు, అమెరికా ప్రభుత్వానికి తెలియజేసే సమాచారం. అమెరికా ఎఫ్-1 వీసా పొందడానికి, అమెరికాలో చదువుతున్నప్పుడు ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యాసంస్థకు మారడానికి ఈ ఐ-20 ఫామ్ తప్పనిసరి. దీని తరువాత మీరు వీసా పొందడానికి సెవిస్ ఐ -901 ఫీజు చెల్లించాలి.
12. సెవిస్ ఐ-901 ఫీజు అంటే ఏమిటీ? ఎందుకు చెల్లించాలి?
అమెరికా వీసా పొందగోరే విద్యార్థి ఎవరైనా సరే వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సెవిస్ ఐ-901 ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సిందే. మీరు ఎంపిక చేసుకున్న యూనివర్సిటీకీ సెవిస్ ఆమోదం ఉందో లేదో చూసుకోండి. సెవిస్ ఆమోదం ఉన్న యూనివర్సిటీల్లో మాత్రమే చేరి చదువుకోవడం ఉత్తమోత్తమం.
13. ఆంధ్రప్రదేశ్ విదేవీ విద్యా విభాగం ఆవశ్యకత ఏమిటీ?
రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశీ విద్య పొందడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డిగారి మార్గదర్శనంలో విస్తృత ఏర్పాట్లు చేసింది. విదేశీ విద్యా విభాగాన్ని ప్రత్యేకించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విదేశీ విద్యా కోఆర్డినేటర్‌గా డాక్టర్ కుమార్ అన్నవరపును ప్రత్యేకించి నియమించింది. ఈ విభాగం ద్వారా విదేశీ విద్య చదవాలనుకునే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తుంది.
14. ఈ విభాగం విద్యార్థులకు ఎలా సహాయపడుతుంది?
ఈ విభాగం మన రాష్ట్రంలోని విద్యార్థులు విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేవీ విద్య చదవగలిగే అవకాశాలు కల్పిస్తుంది. వారు ఏం చదవాలనుకున్నారు, అందుకు అనువైన విశ్వవిద్యాలయాలు ఏ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి. అందులో విద్యార్థులకు లభించే స్కాలర్‌షిప్పుల వివరాలన్నీ కూడా విద్యార్థులకు అందించి ఆయా విదేశీ యూనివర్సీటీలు, మన రాష్ట్ర విద్యార్థుల మధ్య ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. వారి ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.
15. విశాఖలోని అమెరికా కార్నర్ ప్రయోజనమేమిటీ?
విశాఖపట్నంలో ఇటీవలే ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగంణంలో అమెరికా ప్రభుత్వం అమెరికన్ కార్నర్‌ను నెలకొల్పింది. మన రాష్ట్ర విదేశీ విద్యకు సంబంధించి ఇదో కీలక పరిణామం. దేశంలో ఇది రెండో అమెరికా కార్నర్. ఈ కార్నర్ ద్వారా విద్యార్థులకు అమెరికా విద్య గురించి అక్కడ అవకాశాల గురించి తరచూ నిపుణులతో సదస్సులు నిర్వహిస్తారు. విద్యార్థులు సందేహాలను నివృత్తి చేస్తారు. ఆంధ్రప్రదేశ్, అమెరికాల సంస్కృతీ, సంప్రదాయాలు, సంబంధ బాంధవ్యాలను పెంపొందించడానికి ఈ కార్నర్ విశేషంగా కృషి చేస్తుంది.
16. అమెరికా విద్యపై సలహాల కోసం ఎవరిని సంప్రదించాలి?
మన రాష్ట్రంలోని విద్యార్థులు అమెరికాలో చదువు కోసం విదేవీ విద్య కో ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపును coordinator-overseas@ap.gov.in
saikumarannavarapu@gmail.com మెయిల్ ద్వారా ఎప్పుడైనా సంప్రదించవచ్చు.
ఇదీ చదవండి: 25th ICID Congress Plenary: విశాఖలో ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ పై 25వ అంతర్జాతీయ సదస్సు