ICC World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC World Cup 2027 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీకి అక్టోబర్ 2, 2027న తెరలేవనుంది. నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఫైనల్‌తో ప్రపంచకప్ ముగుస్తుంది. మొత్తం 14 జట్లు, 12 వేదికలు, 57 మ్యాచ్‌లతో ఈసారి ప్రపంచకప్ జరగనుంది. కేప్‌టౌన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ICC పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు టికెట్ బ్యాలెట్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. 2027 ప్రపంచకప్‌తో ఆఫ్రికా ఖండంలో 2003 తర్వాత తొలిసారి పురుషుల వన్డే ప్రపంచకప్ జరుగుతోంది. నమీబియా తొలిసారిగా సీనియర్ పురుషుల ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
రెండు గ్రూపుల్లో 12 జట్లు
ప్రపంచకప్‌లో 14 జట్లు పాల్గొంటున్నప్పటికీ ప్రధాన గ్రూప్ దశలో 12 జట్లు ఉంటాయి. క్వాలిఫయర్‌లో విజేత నేరుగా గ్రూప్ దశకు చేరుతుంది. మిగిలిన మూడు జట్లు ముందుగా Super Series ఆడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు మాత్రమే ప్రధాన గ్రూప్ దశలోకి వస్తుంది.
గ్రూప్ A: భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్ A
గ్రూప్ B: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ B
ప్రతి గ్రూపులోని ఆరు జట్లు మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్‌లో టాప్-3లో నిలిచిన జట్లతో పాటు రెండు గ్రూపుల్లో నాలుగో స్థానాల్లో ఉన్న జట్లలో మెరుగైన రికార్డు సాధించిన మరో జట్టు Super 7 దశకు చేరుతుంది.
ముందుగా Super Series
2027 ప్రపంచకప్‌కు కొత్తగా Super Series దశను ప్రవేశపెట్టారు. క్వాలిఫయర్‌లో రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన మూడు జట్లు ఈ దశలో రౌండ్ రాబిన్ విధానంలో తలపడతాయి. అక్టోబర్ 2న క్వాలిఫయర్ 1 వర్సెస్ క్వాలిఫయర్ 3, అక్టోబర్ 4న క్వాలిఫయర్ 1 వర్సెస్ క్వాలిఫయర్ 2, అక్టోబర్ 6న క్వాలిఫయర్ 2 వర్సెస్ క్వాలిఫయర్ 3 మ్యాచ్‌లు విండ్‌హోక్‌లో జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ దశకు అర్హత సాధిస్తుంది.
భారత్ తొలి మ్యాచ్ ఎవరితో?
భారత్ తన ప్రపంచకప్ 2027 ప్రయాణాన్ని ఆస్ట్రేలియాతో ప్రారంభించనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన భారత్, ఆస్ట్రేలియా మరోసారి ప్రపంచకప్ వేదికపై ఎదురుపడటం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.
భారత్ గ్రూప్ దశలో ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది:
అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా — కేప్‌టౌన్
అక్టోబర్ 10: భారత్ vs పాకిస్థాన్ — జోహన్నెస్‌బర్గ్
అక్టోబర్ 14: భారత్ vs ఆఫ్ఘనిస్థాన్ — ష్వానే
అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫయర్ A — బ్లోమ్‌ఫొంటెయిన్
అక్టోబర్ 24: జింబాబ్వే vs భారత్ — విక్టోరియా ఫాల్స్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా జరగనుంది. గ్రూప్ దశలో భారత్ ఆడే చివరి మ్యాచ్ అక్టోబర్ 24న విక్టోరియా ఫాల్స్‌లో జింబాబ్వేతో ఉంటుంది.
Super 7లో అసలు పోటీ
గ్రూప్ దశ తర్వాత ఏడు జట్లు Super 7 దశలోకి వెళ్తాయి. ఇక్కడ ప్రతి జట్టు మిగిలిన ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే Super 7 దశలోనే 21 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు Super 7కు తీసుకెళ్లరు. ఈ దశ కోసం ICC ముందుగానే కొన్ని జట్లకు స్థానాలను కేటాయించింది. A1 స్థానంలో భారత్, A2లో ఆస్ట్రేలియా, A3లో పాకిస్థాన్, AB4లో ఇంగ్లండ్, B1లో న్యూజిలాండ్, B2లో దక్షిణాఫ్రికా, B3లో శ్రీలంకను సీడ్ చేసింది. ఒకవేళ వేరే జట్టు అర్హత సాధిస్తే, ఆ జట్టు సంబంధిత సీడ్ స్థానాన్ని స్వీకరిస్తుంది.
భారత్‌కు మరోసారి కీలక మ్యాచ్‌లు
Super 7లో భారత్ అర్హత సాధిస్తే ముందుగా నిర్ణయించిన సీడింగ్ ఆధారంగా మ్యాచ్‌ల మార్గం ఉంటుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం భారత్‌కు అక్టోబర్ 28న ఆస్ట్రేలియాతో విక్టోరియా ఫాల్స్‌లో, అక్టోబర్ 31న దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌లో, నవంబర్ 4న న్యూజిలాండ్‌తో పార్ల్‌లో, నవంబర్ 7న పాకిస్థాన్‌తో కేప్‌టౌన్‌లో, నవంబర్ 11న ఇంగ్లండ్‌తో గ్కెబెర్హాలో, నవంబర్ 14న శ్రీలంకతో డర్బన్‌లో మ్యాచ్‌లు కేటాయించారు. అయితే Super 7కు అర్హత సాధించే జట్లను బట్టి ఈ మ్యాచ్‌లలో ప్రత్యర్థుల స్థానాలు మారే అవకాశం ఉంటుంది.
సెమీఫైనల్స్ ఎక్కడంటే?
Super 7 పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరతాయి. తొలి స్థానంలో ఉన్న జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో, రెండో స్థానంలోని జట్టు మూడో స్థానంలోని జట్టుతో తలపడుతుంది. మొదటి సెమీఫైనల్ నవంబర్ 17న కేప్‌టౌన్‌లో, రెండో సెమీఫైనల్ నవంబర్ 18న ష్వానేలో జరగనుంది. రెండు సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే కూడా ఉంటుంది.
నవంబర్ 21న ఫైనల్
2027 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. అవసరమైతే నవంబర్ 22ను రిజర్వ్ డేగా కేటాయించారు.
12 వేదికల్లో 57 మ్యాచ్‌లు
ప్రపంచకప్‌లో మొత్తం 12 వేదికలను ఉపయోగించనున్నారు. దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్, పార్ల్, జోహన్నెస్‌బర్గ్, ష్వానే, బ్లోమ్‌ఫొంటెయిన్, డర్బన్, గ్కెబెర్హా, కుగోంపో సిటీ వేదికలు ఉండగా.. జింబాబ్వేలో హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్, నమీబియాలో విండ్‌హోక్ వేదికలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
టికెట్ల కోసం బ్యాలెట్ ప్రారంభం
ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటనతో పాటే ICC టికెట్ బ్యాలెట్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 1, 2026 నుంచి నవంబర్ 21, 2026 వరకు అభిమానులు టికెట్ బ్యాలెట్‌లో తమ ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు. ఇది ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇచ్చే విధానం కాదు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్న టికెట్ల కోసం ర్యాండమైజ్డ్ బ్యాలెట్ విధానం ఉపయోగిస్తారు.
2027 ప్రపంచకప్‌లో కొత్తగా తీసుకొచ్చిన Super Series, Group Stage, Super 7 విధానం కారణంగా టోర్నీ ప్రారంభం నుంచే ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యత పెరగనుంది. ముఖ్యంగా భారత్-ఆస్ట్రేలియా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లతో పాటు Super 7లో చోటు దక్కించుకునే జట్ల మధ్య పోటీపై అభిమానుల దృష్టి ఉండనుంది. అక్టోబర్ 2న నమీబియాలో మొదలయ్యే టోర్నీ నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్ ఫైనల్‌తో ముగియనుంది.
Read also: Nandu’s World UK Jobs Scam: నందూస్ వరల్డ్ దంపతులపై మరో ఫిర్యాదు..
ICC U19 World Cup 2026 : షెడ్యూల్ విడుదల.. జనవరి 15న ప్రారంభం.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?






