Karthika Pournami 2023: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎనలేని విశిష్టత, ప్రాధాన్యం ఉన్నాయి. శ్రావణ మాసంలో శుక్రవారానికి విశేష ఆదరణ ఉన్నట్లుగానే కార్తీక మాసాన సోమవారానికి కూడా అంతే ప్రాశస్త్యం ఉంది. మాసాలన్నింటిలోనూ పరమపావనమైనదిగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని అభివర్ణిస్తారు. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు. ఈ కార్తీక పౌర్ణమిని శరత్‌పూర్ణిమ, త్రిపుర పూర్ణిమగానూ పిలుస్తారు. ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత, ఆరోజు ఆచరించాల్సిన విధానాలు, పూజాదికాల గురించి తెలుసుకుందాం. (Karthika Pournami 2023)
కార్తికేయుడు పుట్టిన కృత్తికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను దొంగిలించి, నడిసంద్రంలోకి వెళ్లి దాక్కున్న సోమకాసురుణ్ని వధించేందుకు శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో దివి నుంచి భువికి చేరింది ఈ పౌర్ణమి రోజునే. మరోవైపు దత్తాత్రేయుడు జన్మించింది కూడా ఆరోజే. కార్తీక పౌర్ణమి నాడు రాసలీలా మహోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సిద్ధహస్తులైన గోపికలను శ్రీకృష్ణుడు అనుగ్రహించిన శుభదినమూ ఈరోజే కావడం విశేషం.
కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం ఆచరించడం, శివారాధన, అభిషేకాలు, ఉసిరిక, దీపారాధనలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. పరమేశ్వరుడు త్రిపురాసురుణ్ని సంహరించిన సందర్భంగా ఆ విజయోత్సవానికి గుర్తుగా మహిళలు 720 వత్తుల నేతి దీపాలు వెలిగించి భక్తేశ్వర వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తారు. ఇక మహిషాసుర వధ నేపథ్యంలోనూ పార్వతీదేవి అనుకోకుండా శివలింగాన్ని పగులగొట్టిన పాపానికి ప్రాయశ్చిత్తంగా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి దోష పరిహారం చేసుకుందని పురాణ కథలు చెబుతున్నాయి.
మరోవైపు క్షీరసాగర మథనాన వెలువడిన హాలాహలాన్ని శంకరుడు మింగేసి లోకాన్ని రక్షించినందుకు జనులు సంతసించి జ్వాలాతోరణోత్సవాన్ని కార్తీక పౌర్ణమి నాడే నిర్వహించారట. ఇదే రోజున వృక్షోత్సవర్జనం పేరుతో వేడుక నిర్వహించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోందని పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల శాంతి కోసం ఒక కోడె దూడను ఆబోతుగా గ్రామాల్లో వదులుతుంటారు. ఈ రకంగా చేయడం వల్ల గయలో కోటిసార్లు శ్రాద్ధం చేసిన పుణ్యఫలాలు దక్కుతాయన్నది ప్రజల విశ్వాసం. శివాలయాన కార్తీక పౌర్ణమి నాడు నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం అనే పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు.
మరో పురాణ కథ ప్రకారం.. ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరుడిగా ప్రతిష్ట పొందిన శ్రీమహావిష్ణువు బొమ్మను ప్రతిష్టాపన చేసి, ఉసిరి కాయలతో పూజిస్తారు. కొంత మంది కార్తీక పౌర్ణమి నాడు తులసిని, వ్యాసుణ్ని కొలుస్తారు. దీపదానం, బిళ్వదళార్చన, ఉపవాసం, జాగరణ, శతలింగార్చన, సహస్రలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకం, వనభోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి, స్వర్ణం, సాలగ్రామం, భూ, గోదానం, అన్నదానాలకు కార్తీక పౌర్ణమి రోజు ఎంతో విశిష్టమైనదిగా పండితులు చెబుతున్నారు.
వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను బట్టి వృషవ్రతం, మహీఫలవ్రతం, నానాఫలవ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పౌర్ణమి వ్రతం, కృత్తికావ్రతం లాంటివి, నోములు కూడా ఎన్నో రకాలు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆచరిస్తారు. శివ,కేశవుల ఆలయాల్లో భక్తిపారవశ్యంతో జరిగే జప, తప, దీపదాన, పూజా కార్యక్రమాలకు గొప్ప ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహారమే ఈ కార్తీక పౌర్ణమి పర్వదినం.