CSK IPL 2027: ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు జట్టుకు విజయాలు అందించిన దిగ్గజాలే ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే 18 ఏళ్ల అనుబంధం ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు వీడ్కోలు పలికిన సీఎస్కే యాజమాన్యం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లుగా బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీని కూడా తప్పించింది. కొత్త హెడ్ కోచ్ జహీర్ ఖాన్ నేతృత్వంలో పూర్తిగా కొత్త కోచింగ్ బృందాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మార్పుల వెనుక ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
మైక్ హస్సీకి చెన్నై గుడ్‌బై
చెన్నై సూపర్ కింగ్స్‌తో మైక్ హస్సీ అనుబంధం ఇప్పటిది కాదు. 2008లో ఆటగాడిగా జట్టులో చేరిన ఆయన ఆరు సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. 2013 ఐపీఎల్‌లో ఏకంగా 733 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు. 2018 నుంచి బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తూ యువ బ్యాటర్లకు మార్గనిర్దేశం చేశారు. అయితే ఐపీఎల్ 2027 ప్రణాళికల్లో హస్సీకి స్థానం కల్పించకూడదని యాజమాన్యం నిర్ణయించినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఆయన స్థానంలో కొత్త బ్యాటింగ్ కోచ్ ఎవరనేది ఇంకా తేలలేదు.
ఫ్లెమింగ్ శకానికి ఇప్పటికే ముగింపు
2009 నుంచి సీఎస్కే హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడంతో చెన్నై యాజమాన్యం కొత్త దిశగా అడుగులు వేసింది. ఫ్లెమింగ్ స్థానంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. ముంబై ఇండియన్స్‌తో వివిధ నిర్వహణ బాధ్యతల్లో పనిచేసిన అనుభవం జహీర్‌కు ఉంది.
బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ
కోచింగ్ బృందంలో మార్పులు బ్యాటింగ్ విభాగానికే పరిమితం కాలేదు. బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ స్థానంలో భారత మాజీ పేసర్ మోహిత్ శర్మను తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో నాలుగు సీజన్ల పాటు చెన్నై తరఫున ఆడిన మోహిత్‌కు జట్టు వాతావరణంపై మంచి అవగాహన ఉంది. జహీర్ ఖాన్ సూచనతోనే ఆయన ఎంపిక ప్రక్రియ ముందుకు సాగినట్లు సమాచారం.
ఫీల్డింగ్ కోచ్ పరిస్థితి ఏమిటి?
మరోవైపు ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది. గత ఏడాది సీఎస్కేలో చేరిన ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కాంట్రాక్టును పొడిగించే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంటే ఆయనను తొలగించినట్లు కాదు. కొత్త కోచింగ్ బృందంలో కొనసాగిస్తారా లేదా అన్నది యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంది.
కొత్త కోచ్‌ల ఎంపికలో ధోనీ పాత్ర
చెన్నై కోచింగ్ బృందం పునర్నిర్మాణంలో ఎంఎస్ ధోనీ సూచనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. జహీర్ ఖాన్, మోహిత్ శర్మ ఎంపికల్లోనూ ధోనీ ప్రభావం ఉన్నట్లు సమాచారం. జట్టు యజమాని రూపా గురునాథ్ దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన తర్వాత మిగిలిన కోచింగ్ నియామకాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. జహీర్, ధోనీతో సంప్రదింపుల అనంతరం తుది నిర్ణయాలు వెలువడనున్నాయి.
చెన్నై మళ్లీ గర్జించేనా?
ఒకప్పుడు స్థిరమైన కోచింగ్ బృందమే చెన్నై సూపర్ కింగ్స్‌కు అతిపెద్ద బలం. ఇప్పుడు అదే బృందాన్ని పూర్తిగా మార్చేస్తుండటం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హస్సీ ఇతర ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు జహీర్ ఖాన్ ముందున్న సవాల్ చిన్నది కాదు. కొత్త కోచ్‌లతో పాటు ఆటగాళ్లను సమన్వయం చేసుకుని చెన్నైని తిరిగి విజయాల బాట పట్టించాల్సి ఉంది. మరి ధోనీ అనుభవం, జహీర్ వ్యూహాలు సీఎస్కేకు పూర్వవైభవం తీసుకొస్తాయా? ఐపీఎల్ 2027లోనే సమాధానం దొరకనుంది.
Read also: Sridevi Chennai Property Dispute: సుప్రీంకోర్టుకు చేరిన శ్రీదేవి ఆస్తి వివాదం.. కపూర్ కుటుంబానికి నోటీసులు
CSK Coach: జహీర్ ఖాన్‌నే సీఎస్‌కే ఎందుకు ఎంచుకుంది? కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా!
CSK New Head Coach: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్.. ధోనీ సూచనతో!






