Viveka murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న సునీల్‌కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ఇదివరకే వేసిన సంగతి తెలిసిందే. టీఎస్ హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో సునీల్ యాదవ్ ఉన్నాడన్న గూగుల్ టే కౌట్ సమాచారం తప్పు అని సునీల్ కుమార్ యాదవ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. (Viveka murder case)
దీనిని సీబీఐ కూడా ఒప్పుకుందని సునీల్ యాదవ్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు నిందితుల విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత అభ్యంతరం చెప్పట్లేదని సునీల్ యాదవ్ లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
షేక్ దస్తగిరి తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. ఆయన ముందస్తు బెయిల్ విషయంలో సునీత ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని, కానీ, సునీల్ యాదవ్ బెయిల్ విషయంలో ఇంప్లీడ్ అయ్యారని లాయర్ తెలిపారు. సునీత స్వార్థ ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఈ కేసులో ఆమె బాధితురాలు కానే కాదు, తనకు తాను బాధితులుగా ప్రచారం చేసుకుంటుందని తెలిపారు.
తండ్రి వివేకా హత్యతో ఆమె కుటుంబం మాత్రమే లబ్ధిదారులు అన్న విషయం గమనించాలని, కోర్టు విచారణ ప్రక్రియను పిటిషన్లు, కౌంటర్లతో దుర్వినియోగం చేస్తుందని, సీబీఐ దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకుంటుందని, అన్ని విషయాల్లో సునీత ప్రమేయం దర్యాప్తును ప్రాసిక్యూషన్ తప్పుపట్టించేలా ఉందని తెలిపారు.
మరోవైపు ఈ కేసులో ఈ నెల 8 న సీబీఐ వాదనలు వినిపించనుంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ ను ఈ నెల 8 కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.
సీబీఐకి నోటీసులు
ఇక వివేకానంద రెడ్డి హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ ప్రస్తుత సీఎం ముఖ్య సలహాదారు, మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లo వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తన పేరుతో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ పేర్కొందని, పూర్తిగా కేసును పక్కదోవ పట్టించేలా సీబీఐ అధికారి వ్యవహరించారంటూ అజేయకల్లం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి సూచించింది. తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Sharmila issue: తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల కల్లోలం