పెళ్లి చేసుకోవాలనే జంటల కోసం ముహూర్తాలు (Marriage Dates) ప్రత్యేకంగా చూస్తుంటారు. జీవితాంతం తోడుగా ఉండే భాగస్వామిని మంచి ముహూర్తాన (Marriage Dates) జతకడితే.. ఆ జీవితం సంపూర్ణంగా సాగుతుందని అందరూ భావిస్తారు. కొన్ని రోజులుగా వివాహాది శుభకార్యాలకు శుభ ముహూర్తాలు (Marriage Dates) లేవు. అయితే, మే నెలలో బోలెడన్ని శుభ ముహూర్తాలు వచ్చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ ధర్మాన్ని అనుసరించే వారి ఇళ్లలో శుభకార్యాలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మండు వేసవిలో కూడా మెండుగా ముహూర్తాలు ఉండటంతో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పెద్దలు పెళ్లి బాజాలు సిద్ధం చేసుకొనే పనిలో పడ్డారు.
మే, జూన్ నెలల్లో సుమారు 24 శుభ ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. గడచిన శుభకృత్ నామ సంవత్సరంలో సుమారు నాలుగు నెలల బ్రేక్ తర్వాత వచ్చిన మంచి రోజుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. అనంతరం ఆగస్టు-నవంబర్ మధ్య శుభ ముహూర్తాలు లేవు. తర్వాత నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ దాకా శుభ ఘడియలు ఉండటంతో ఆ తేదీల మధ్య కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు చేసుకున్నారు. మరోవైపు గడచిన డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి 14వ తేదీ దాకా ధనుర్మాసం వచ్చింది. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు చేసుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
మే, జూన్‌లో విరివిగా శుభ ముహూర్తాలు..
ఇక జనవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు18 మంచి ముహూర్తాలు వచ్చాయి. అనంతరం ఏప్రిల్ నెలాఖరు దాకా శుభ ముహూర్తాలు లేవు. ఇక కొన్ని రోజుల విరామం తర్వాత మే నెలలో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు వచ్చేశాయి. ఈనెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీల్లో పెళ్లిళ్లు చేసుకొనేందుకు లక్షణమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. అంతేనా… వచ్చే నెల జూన్‌లో కూడా 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీల్లో శుభముహూర్తాలు భేషుగ్గా ఉన్నాయని తెలిపారు. దీంతో పెళ్లిళ్లు ఖరారు చేసుకొని మంచి ముహూర్తాల కోసం వెయిట్ చేస్తున్న వారికి భారీ ఊరట కలిగింది. తమకు నచ్చిన తేదీల్లో నచ్చిన ప్రాంతాల్లో స్లాట్ బుక్ చేసుకొని పెళ్లి పనులు ప్రారంభించుకొనేందుకు సిద్ధమవుతున్నారు.
మే, జూన్ మాసాల్లో మంచి ముహూర్తాలు అనువుగా ఉంటాయని చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక జూన్ 19వ తేదీ తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తోంది. దీంతో మళ్లీ శుభకార్యాలు చేసుకోవడం కుదిరేపని కాదు. జూలై 18వ తేదీ దాకా ఆషాఢ మాసం ఉంటుంది. అనతరం శ్రావణమాసం, అధిక శ్రావణ మాసం ఆగస్టు 17వ తేదీ దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో జూలై, ఆగస్టు మాసాల్లో వివాహాలు చేసుకొనేందుకు మంచి ముహూర్తాలు ఉండవు. కాబట్టి మే, జూన్ మాసాల్లో వస్తున్న మంచి ముహూర్తాల్లోనే శుభకార్యాలు కానిచ్చేయాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు వివాహాలకే కాకుండా ఇతర ముహూర్తాల కోసం కూడా చాలా మంది వేచి చూస్తుంటారు.
పెళ్లిళ్లకు మాత్రమే ఈ శుభ ముహూర్తాలు..
ముఖ్యంగా గృహ ప్రవేశాలు, ఇతర చిన్న చిన్న వేడుకలకు కూడా మంచి ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వైశాఖం, జ్యేష్ట మాసాల్లో సుమారు 25 మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. అయితే, ఇందులో చాలా వరకు ముహూర్తాలు వివాహాలు, ఉపనయనాలకు మాత్రమే అనుకూలిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 24వ తేదీ దాకా అగ్ని కార్తె ఉంది. ఈ సమయంలో వచ్చే ముహూర్తాలు గృహ ప్రవేశాలకు ఏ మాత్రం మంచివి కాదని పండితులు చెబుతున్నారు. ఇక జూన్ నెలాఖరు దాకా శుభ ముహూర్తాలు ఉన్నప్పటికీ ఆషాఢం వచ్చేస్తోందని, తర్వాత సుమారు రెండు మాసాలు మంచి ముహూర్తాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈనెల, జూన్ మొదటి వారంలోపే వివాహాలు జరిపించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
Read Also : AP DSC 2023 : ఏపీలో ఎన్నికల ముంగిట డీఎస్సీకి సన్నాహాలు.. ఎన్ని పోస్టులు భర్తీ?