Perni Nani fire on Pawan: పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని ఏపీకి వచ్చారు. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య భేటీలో పాల్గొన్న జనసేనాని పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులను కలిశారు. ఈ సందర్భంగా అఖండ ప్రజలు కోరుకుంటే ఏపీలో ఎన్డీఏ వస్తుందని, జగన్‌ను అర్జెంటుగా సీఎం కుర్చీలోంచి దించేయాలని వ్యాఖ్యానించారు. ప్రజలు బాగుండాలని కోరుకోవడం అంటే సీఎం కంటే పెద్ద పోస్టేనంటూ చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌పై విమర్శలు, సెటైర్ల వర్షం కురిపించారు. (Perni Nani fire on Pawan)
అఖండ ప్రజలు కోరుకుంటే ఎన్డీఏ వస్తుందని పవన్ అంటున్నారని, ఆ అఖండ ప్రజలు ఎవరు ? ఇదేమైనా అఖండ సినిమానా? అని పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ పెద్దలతో పవన్‌కు బలమైన బంధం ఉంటే ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు. ప్రజలు బాగుండాలంటే జగన్ ప్రభుత్వం రావాలన్నారు. ఏ పొత్తుల్లో ఎవరి వాటా ఎంత ? డమ్మీ పొత్తా ? జనాలను నమ్మించడానికి పెట్టుకున్న పొత్తా ? అంటూ తనదైన శైలిలో పవన్‌పై పేర్నినాని ప్రశ్నలు గుప్పించారు.
పవన్ కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని పేర్ని నాని కామెంట్ చేశారు. వలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేస్తున్నారని, వలంటీర్లు నిస్వార్ధంగా సేవ చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. వలంటీర్ల మానసిక స్థైర్యం దెబ్బతినేలా పవన్ మాట్లాడారని అభ్యంతరం తెలిపారు. పవన్ సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. తప్పుడు మాటలు రుజువైతే కోర్టే పవన్‌ను అరెస్ట్ చేయిస్తుందని స్పష్టం చేశారు.
పవన్ గురించి పెట్టుబడి పెట్టేవారికి రిస్క్ అని హెచ్చరించారు పేర్ని నాని. రాజకీయాల్లోకి వస్తే బరితెగించి మాట్లాడొచ్చన్నది పవన్ ఆలోచన అన్నారు. డేటా చౌర్యం అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, చంద్రబాబు డేటా చోరీ చేసినప్పుడు ఏం చేశావ్ పవన్ ? అంటూ ప్రశ్నించారు. అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని, ఇవాళ రంకెలేస్తూ మాట్లాడుతున్నాడన్నారు. మేము తప్పుడు పనులు చేయలేదన్నారు. చంద్రబాబుతో కలిసి పవన్ చేతనయింది చేసుకోవచ్చంటూ సవాల్ విసిరారు.
సై అంటే సై..
ఆ FOA ఎవరిదో.. ? ఆ మూడు కంపెనీలు ఎవరివో మీరే తేల్చండని పవన్‌కు పేర్ని నాని సూచించారు. సై అంటే సై.. నీకు చేతనైంది చేసుకో.. అంటూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ సభ్యత్వం పేరుతో నువ్వు సేకరిస్తున్న డేటా ఎవరికిస్తున్నావ్ ? అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజా సాధికారిత సర్వే పేరుతో చంద్రబాబు డేటా సేకరించారని, ఆ డేటాను హైదరాబాద్ కు పంపిస్తే తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వెల్లడించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి మాటలేదన్నారు. పవన్‌ను కొడితే చంద్రబాబు కొట్టాలి లేదా అమిత్ షా కొట్టాలంటూ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యణ్ కు రిస్కు ఏముందని పేర్ని నాని ప్రశ్నించారు. నీపై పెట్టుబడి పెట్టిన చంద్రబాబు కు రిస్కు అని కామెంట్ చేశారు. మేం సేకరించే డేటా సచివాలయంలోనే ఉందని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసురుతున్నా.. అమిత్ షా, మోదీతో నీకు నిజంగా బంధం ఉంటే డేటా చోరీ జరిగిందని నిరూపించు.. అమిత్ షా తో మాట్లాడానంటున్నాడు.. అమిత్ షాతో మాట్లాడితే గొప్పేంటి? అని ప్రశ్నించారు. నెహ్రూ యువకేంద్రంలో పనిచేస్తున్న వలంటీర్ల పై మోదీతో మాట్లాడేందుకు భయమా? అని ప్రశ్నించారు.
అమిత్ షాతో మాట్లాడితే ఏం జరుగుతుంది? అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ ను జైలుకు పంపిస్తానని సొల్లు కబుర్లు చెబుతున్నాడని, చేతనైతే మీ ముగ్గురు కలిసి జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని సవాల్ విసిరారు. 2024 లో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేసిన పేర్ని నాని.. మీ డేటా అంతా కేసీఆర్ దగ్గర ఉందంటూ సెటైర్లు వేశారు. హాలి డే ట్రిప్పుకు వచ్చి ఈ మాటలేంటని పవన్‌ను తూర్పారబట్టారు.
Read Also : Perni Nani: వలంటీర్లు చేస్తున్న సేవ కనిపించలేదా? ఇంత ఓర్వలేని తనమా? పవన్‌పై పేర్ని నాని మండిపాటు