Drone and remote sensing: డ్రోన్, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో నేలలో పోషక లభ్యత అంచనా వేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు నిన్న వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, (వ్యవసాయ, సహకార శాఖ), చీఫ్ కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) కలిసి డ్రోన్, రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా నూతన డిజిటల్ పరిజ్ఞానంతో భూసార పరీక్షలు, భూసార పటాలను ఆధునీకరించడం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. (Drone and remote sensing)
కేంద్రప్రభుత్వ మరియు జాతీయ సంస్థల నుంచి డా. ఆయాన్ దాస్, శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, (ఇస్రో), స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్, డా. సుజాత మరియు డా. తారిక్, శాస్త్రవేత్తలు, జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, (NRSC), హైదరాబాద్, డా. యన్. జి. పాటిల్, డైరెక్టర్ మరరియు శాస్త్రవేత్తలు డా. ఓబిరెడ్డి & డా. వాసు, జాతీయ భూసర్వే కేంద్రం, నాగపూర్, డా. శర్మ మరియు డా. సురేష్ కుమార్ శాస్త్రవేత్తలు, సర్వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ, డా. ఎస్. పి. దత్త, డైరెక్టర్ మరియు డా. ఎస్. కె. బెహరా & ఎన్. కె, శర్మ, శాస్త్రవేత్తలు, జాతీయ భూసార పరిశోధన సంస్థ, భోపాల్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రోన్, రిమోట్ సెన్సింగ్ సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో భూసార పరీక్షల స్థాయిని పెంచవలసిన ఆవశ్యకతను గోపాలకృష్ణ ద్వివేది, హరికిరణ్ తెలియచేశారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా నేలలోని పోషక లభ్యతను రైతులకు వెంటనే తెలియచేసి తద్వారా వారు ఎరువుల పై పెట్టే ఖర్చును తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకోవలసిన అవసరాన్ని వివరించారు.
ఈ దిశగా సంబందిత జాతీయ సంస్థలలో జరుగుతున్న ఆధునిక పరిశోధన, ప్రయోగాల ఫలితాలను, నూతన సాంకేతిక సలహాలను అందచేయవలసినదిగా కోరారు. వీటిపై సంబందిత శాస్త్రవేత్తలతో నూతన ఆవిష్కరణల పై చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40 లక్షల పైబడి భూసార పరీక్షలు నిర్వహించి విశ్లేషణ పత్రాలను రైతులకి అందచేశామని తెలిపారు. పంటల ఎదుగుదలకు దోహదపడే ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రీయ కర్బనం, 9 రకాల పోషకాలను భూసార పరీక్ష కేంద్రాల ద్వారా విశ్లేషించి నేలలో వాటి లభ్యతను గుర్తించి తగు విధంగా పోషక విలువ ఆధారిత ఎరువుల సిఫార్సులను రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ రైతులకు తెలియచేస్తున్నామని తెలిపారు.
Read Also : CM Review on Agriculture: అన్ని విధాలా ఆదుకుంటున్నాం.. వ్యవసాయంపై సమీక్షలో సీఎం జగన్