Ganesh: హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు శ్రీ గణేశుడిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పెళ్లి, గృహప్రవేశం, వ్యాపారం ప్రారంభించడం, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం, పూజలు, యజ్ఞాలు.. ఇలా ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా గణపతిని స్మరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గణేశుడిని విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించే దేవుడు, బుద్ధికి అధిపతిగా భక్తులు కొలుస్తారు. అందుకే ‘శ్రీ గణేశాయ నమః’ అంటూ ఏ పనినైనా ప్రారంభిస్తారు. అయితే అసలు గణేశుడికి ఈ ప్రత్యేక గౌరవం ఎలా వచ్చింది? దేవతలందరిలో ఆయనకే ఎందుకు అగ్రపూజ లభించింది? దీని వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది.
2026లో సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి
ఈ ఏడాది అంటే 2026లో గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14, సోమవారం జరుపుకోనున్నారు. పంచాంగ వివరాల ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ 14న ఉదయం ప్రారంభమై సెప్టెంబర్ 15 ఉదయం వరకు ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి పూజా ముహూర్తాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఈ సందర్భంగా భక్తులు ఇళ్లలో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే గణేశుడికి అగ్రపూజ ఎలా దక్కిందనే కథను తెలుసుకోవడం కూడా ఈ పండుగ ప్రత్యేకతల్లో ఒకటి.
దేవతల మధ్య మొదలైన ఆసక్తికరమైన పోటీ
పురాణ కథనం ప్రకారం ఒకసారి దేవతల మధ్య ఒక సందేహం తలెత్తింది. “అందరికంటే ముందుగా ఎవరిని పూజించాలి?” అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ వివాదానికి పరిష్కారం కోసం దేవతలు శివపార్వతులను ఆశ్రయించారు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెడతాడు. “మీలో ఎవరు ముందుగా మూడు లోకాలను చుట్టి తిరిగి నా దగ్గరకు చేరుకుంటారో.. వారికే అగ్రపూజ లభిస్తుంది” అని శివుడు చెప్పినట్లు పురాణ కథనం. శివుడి మాటలు వినగానే దేవతలు తమ తమ వాహనాలపై బయలుదేరారు. ముఖ్యంగా కార్తికేయుడు తన నెమలి వాహనంపై వేగంగా ప్రయాణం ప్రారంభించాడు.
గణేశుడికి ఎదురైన సమస్య ఇదే
మరోవైపు గణేశుడి వాహనం ఎలుక. ఇతర దేవతల వాహనాలతో పోలిస్తే అది వేగంగా ప్రయాణించలేదని గణేశుడు గ్రహించాడు. తాను కూడా విశ్వాన్ని చుట్టి రావాలంటే చాలా సమయం పడుతుందని అర్థం చేసుకున్న గణపతి.. బలాన్ని కాకుండా తన బుద్ధిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే ఈ కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.
తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసిన గణపతి
గణేశుడు ఎక్కడికీ వెళ్లకుండా నేరుగా తన తల్లిదండ్రులైన శివుడు, పార్వతి వద్దకు వెళ్లాడు. వారికి నమస్కరించి.. వారి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కొన్ని పురాణ కథనాల్లో గణేశుడు తల్లిదండ్రుల చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసినట్లు చెబుతారు. అది గమనించిన శివుడు ఆశ్చర్యపోయి, “నువ్వు విశ్వాన్ని చుట్టి రావాల్సి ఉంది కదా.. మరి మా చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేశావు?” అని ప్రశ్నించాడు.
గణేశుడి సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది
అప్పుడు గణపతి తన తండ్రికి ఇచ్చిన సమాధానం ఎంతో గొప్పదని పురాణ కథనం చెబుతుంది. “తల్లిదండ్రులలోనే సమస్త విశ్వం ఇమిడి ఉంది. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే విశ్వం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే” అని గణేశుడు చెప్పినట్లు కథనం. గణేశుడి మాటలు విన్న శివపార్వతులు ఎంతో సంతోషించారు. ఆయనలోని జ్ఞానం, భక్తి, వినయం, సమయస్ఫూర్తిని ప్రశంసించారు. ఇతర దేవతలు విశ్వాన్ని చుట్టి తిరిగి వచ్చేలోపే గణేశుడు తన తెలివితో పరీక్షలో విజయం సాధించాడు.
అందుకే గణేశుడికి అగ్రపూజ వరం
గణేశుడి తెలివి, భక్తికి సంతోషించిన శివుడు ఆయనకు ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చినట్లు పురాణాల్లో చెబుతారు. మూడు లోకాలలో ఏ శుభకార్యం ప్రారంభమైనా ముందుగా గణేశుడినే పూజించాలని శివుడు వరమిచ్చాడని విశ్వాసం. అప్పటి నుంచి ఏ పూజ, యజ్ఞం లేదా శుభకార్యమైనా గణపతి పూజతో ప్రారంభించడం సంప్రదాయంగా మారిందని పురాణ కథనం చెబుతోంది. అందుకే గణేశుడిని అగ్రపూజ్యుడు, విఘ్నేశ్వరుడు అని భక్తులు పిలుస్తారు. ముందుగా గణపతిని పూజిస్తే పనుల్లో ఎదురయ్యే విఘ్నాలు తొలగి, కార్యం విజయవంతంగా పూర్తవుతుందని భక్తుల విశ్వాసం.
ఈ గణేశుడి కథ చెప్పే సందేశం ఏమిటి?
ఈ పురాణ కథ కేవలం గణేశుడికి అగ్రపూజ ఎలా లభించిందో చెప్పడమే కాదు.. ఒక గొప్ప జీవిత సందేశాన్ని కూడా అందిస్తుంది. ఇతరులు వేగంతో ముందుకు వెళ్తున్నప్పుడు గణేశుడు తన పరిస్థితిని అర్థం చేసుకుని తెలివితో పరిష్కారం వెతికాడు. శారీరక బలం కంటే బుద్ధి, భక్తి, సమయస్ఫూర్తి ఎంత గొప్పవో ఈ కథ తెలియజేస్తుంది. అలాగే తల్లిదండ్రులను గౌరవించడం, వారి పట్ల భక్తి చూపడం ఎంత గొప్పదో కూడా ఈ కథ ద్వారా తెలియజేస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
అందుకే ఏ పని ప్రారంభించినా ముందుగా “ఓం శ్రీ గణేశాయ నమః” అంటూ గణపతిని స్మరించడం నేటికీ కొనసాగుతోంది. విఘ్నాలను తొలగించి విజయాన్ని అందించే దేవుడిగా గణేశుడిని కొలుస్తూ భక్తులు ఆయన ఆశీస్సులు కోరుకుంటారు.
Read also: Ganesha Idol Buying Tips: ఇంట్లో గణేశుడి విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారా? కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Lord Ganesha: వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటి? మోదకం విశిష్టత ఇదే
Ganesha: ఇంట్లో తెల్ల ఏనుగు విగ్రహం పెడితే ఏమవుతుంది? వాస్తు నిపుణులు చెప్పే ఆసక్తికర విషయాలు






