Health tips : “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని మన పెద్దలు ఎందుకు అన్నారు అంటే… మనం తీసుకునే ఆహారం కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆలోచనలను, మనసును, ఇంటి వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుందనే నమ్మకమే కారణం. అందుకే పూర్వకాలంలో భోజనానికి ముందు, భోజనం సమయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటించేవారు. కానీ ఆధునిక జీవనశైలిలో అవన్నీ మరిచిపోతూ… తెలియక చేస్తున్న కొన్ని చిన్న తప్పులే ఇంట్లో ఆర్థిక ఒడిదుడుకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ అశాంతికి కారణమవుతున్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఒకే ప్లేట్‌లో భోజనం.. ప్రేమ కాదు సమస్య?
ఈ రోజుల్లో చాలా మంది భార్యాభర్తలు ప్రేమకు గుర్తుగా ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం అలవాటు చేసుకున్నారు. బయటకు చూస్తే ఇది చాలా మధురంగా అనిపించినా… వాస్తు శాస్త్రం మాత్రం దీనిని అనుకూలంగా చూడడం లేదు. వాస్తు ప్రకారం కుటుంబ పెద్దకు భార్యతో పాటు ఇంట్లోని మిగిలిన సభ్యుల పట్ల కూడా సమాన బాధ్యత ఉంటుంది. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల తెలియకుండానే కుటుంబ పెద్ద భార్య పట్ల అధిక ప్రాధాన్యం చూపడం, మిగిలినవారిని నిర్లక్ష్యం చేయడం మొదలవుతుందని చెబుతారు.
దీని ఫలితంగా ఇంట్లో అసూయ, అపార్థాలు, మాటల తగాదాలు మొదలవుతాయి. నెమ్మదిగా కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగి… ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువవుతుందని వాస్తు హెచ్చరిస్తోంది.
మంచం మీద కూర్చుని తింటున్నారా?
ఇది ఈ కాలంలో చాలా సాధారణంగా మారిపోయిన అలవాటు. టీవీ చూస్తూ, ఫోన్ స్క్రోల్ చేస్తూ లేదా సోమరితనంతో మంచం మీదే కూర్చుని భోజనం చేయడం చాలామందికి అలవాటైపోయింది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అత్యంత అశుభమైన చర్యగా చెబుతారు. భోజనం అనేది అన్నపూర్ణ దేవి ప్రసాదంగా భావించాలి. నిద్రించే మంచం అపవిత్ర స్థలంగా పరిగణిస్తారు. అలాంటి చోట కూర్చుని ఆహారం తీసుకోవడం అన్నపూర్ణ దేవిని అవమానించినట్లేనని నమ్మకం.
ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదని, ఆర్థిక అస్థిరత, ఖర్చులు పెరగడం, ఆదాయం నిలకడ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వాస్తు గ్రంథాలు పేర్కొంటున్నాయి.
ఇంట్లో శాంతి, శ్రేయస్సు కావాలంటే ఇలా చేయండి
ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే భోజనం విషయంలో కొన్ని సాధారణ నియమాలు పాటిస్తే చాలంటున్నారు నిపుణులు.
ఎప్పుడూ కింద కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ వద్ద శుభ్రంగా భోజనం చేయాలి
భోజనం చేసే ముందు ఒక క్షణం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి
కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసినా, ఎవరి ప్లేట్‌లో వారు తినాలి
భోజనం సమయంలో కోపం, చర్చలు, ఫోన్లు దూరంగా ఉంచాలి
ఈ చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో పరస్పర గౌరవం పెరుగుతుంది. మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రభావం కుటుంబ వాతావరణంపై స్పష్టంగా కనిపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
భోజనం కేవలం ఆకలి తీర్చే ప్రక్రియ కాదు… అది మన జీవనశైలికి అద్దంలాంటిది. ఆహారాన్ని గౌరవిస్తే జీవితం కూడా మనల్ని గౌరవిస్తుందన్న భావన మన సంస్కృతిలో గాఢంగా నాటుకుపోయింది. చిన్న అలవాట్లే పెద్ద మార్పులకు కారణమవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకుంటే… ఇంట్లో శాంతి, ఐశ్వర్యం రెండూ స్థిరంగా నిలుస్తాయనేది పెద్దల నమ్మకం.
ఇవీ చదవండి: Morning health tips : పరగడుపున పొరపాటున కూడా అస్సలు తినకూడని పదార్థాలు ఇవే! ఏవి తింటే బెటరంటే!
Health Tips : చర్మ సౌందర్యం కోసం చమురు ఎలా ఉపయోగపడుతుంది? సహజ ఆయిల్స్‌తో నేచురల్ గ్లో సీక్రెట్స్
