Cricket Viral: క్రికెట్ స్టేడియానికి వెళ్లే అభిమానులు సాధారణంగా తమ ఫేవరెట్ ప్లేయర్ల ఆటను ఆస్వాదించేందుకు వెళ్తారు. కానీ దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 Leagueలో ఓ యువ అభిమానికి మాత్రం ఒక్క క్యాచ్ జీవితం మార్చేసింది. మైదానం వెలుపల స్టాండ్స్‌లో కూర్చుని అతను పట్టిన ఒక అద్భుతమైన వన్-హ్యాండెడ్ క్యాచ్… నేరుగా అతని ఖాతాలో కోట్ల రూపాయలు పడేలా చేసింది.
ఈ అరుదైన ఘటన Durban Super Giants – MI Cape Town మధ్య జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 232/5 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది SA20 చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నిలిచింది.
న్యూజిలాండ్ స్టార్‌లు Devon Conway (64), Kane Williamson (40) జట్టుకు చక్కటి ఆరంభం అందించగా, చివర్లో ఐడెన్ మార్క్రామ్, ఇవాన్ జోన్స్ దూకుడు పెంచారు. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI కేప్ టౌన్ కూడా గట్టిగానే పోరాడింది. Ryan Rickelton 113 పరుగులతో అద్భుత సెంచరీ చేసినా, ఆ జట్టు చివరకు 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండు జట్లు కలిపి మ్యాచ్‌లో మొత్తం 449 పరుగులు నమోదు కావడం విశేషం.
ఈ పరుగుల వర్షంలోనే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ర్యాన్ రికెల్టన్ కొట్టిన ఓ భారీ సిక్సర్ నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లింది. అక్కడ కూర్చున్న ఓ యువ అభిమాని అసాధారణ ఏకాగ్రతతో ఒక్క చేత్తో క్లీన్ క్యాచ్ పట్టేశాడు. అంతే… ఆ క్షణమే అతని అదృష్టం మారిపోయింది.
SA20 లీగ్‌లో అమల్లో ఉన్న ‘క్లీన్ క్యాచ్ ఇనిషియేటివ్’ ప్రకారం, ఒక చేత్తో క్లీన్‌గా క్యాచ్ పట్టిన అభిమానులకు భారీ నగదు బహుమతి అందిస్తారు. ఈ నియమం ప్రకారం ఆ యువకుడికి 2 మిలియన్ సౌతాఫ్రికన్ రాండ్స్ (సుమారు రూ.1.08 కోట్లు) లభించాయి. స్టేడియం మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.
అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు SA20 నిర్వాహకులు ఈ వినూత్న ఆలోచనను తీసుకొచ్చారు. మ్యాచ్ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుడు బ్యాటర్ కొట్టిన సిక్సర్‌ను ఒక్క చేత్తో పట్టుకుంటే, సీజన్ ముగిసే సరికి కేటాయించిన భారీ మొత్తాన్ని విజేతలకు అందజేస్తారు. ఈ మ్యాచ్‌లో పట్టిన ఆ ఒక్క క్యాచ్… ఆ యువకుడిని రాత్రికి రాత్రే వైరల్ స్టార్, కోటీశ్వరుడిగా మార్చేసింది.
క్రికెట్ అంటే కేవలం వినోదమే కాదు… అదృష్టం కలిస్తే జీవితాన్నే మార్చేసే అవకాశం కూడా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ఇవీ చదవండి: WPL 2026 Auction: నవంబర్ 27న మహిళా క్రికెట్‌లో రికార్డుల వర్షం? ఫ్రాంచైజీలను కుదిపేస్తున్న స్టార్ ప్లేయర్ల పోరు!
Test Twenty : టెస్ట్ క్రికెట్ & టీ20 కలయికతో కొత్త ఫార్మాట్.. తొలి సీజన్ 2026 జనవరిలో!
