Indian Women’s Cricket: క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు అంటేనే ఒక తిరుగులేని శక్తి. కానీ ఈసారి ఆ శక్తిని ఛేదించింది భారత మహిళల క్రికెట్ జట్టు. ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 339 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇది మహిళల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక చేజింగ్‌గా నిలిచింది.
ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా 15 ప్రపంచకప్ మ్యాచ్‌ల విజయాల పరంపరను ఈ ఒక్క విజయం ముగించింది. భారత అభిమానుల కోసం ఇది ఒక గర్వకారణమైన క్షణం. 2023 నవంబర్ 19న రోహిత్ శర్మ జట్టు ఆస్ట్రేలియాతో ఓడిపోయిన తర్వాత వచ్చిన ఈ విజయం దేశవ్యాప్తంగా మళ్లీ నమ్మకాన్ని నింపింది.
ఈ విజయంతో మహిళా క్రికెట్ విశ్లేషకులు 1983 కపిల్ దేవ్ జట్టు కప్ గెలిచిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈసారి జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి ఒత్తిడిని సునాయాసంగా ఎదుర్కొన్నారు. రిచా ఘోష్, అమన్జోత్ కౌర్ వంటి యువ ఆటగాళ్లు కీలక సమయాల్లో ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఆస్ట్రేలియా బలమైన బ్యాటింగ్ ఉన్నప్పటికీ భారత బౌలర్లు రేణుక సింగ్, దీప్తి శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్ వంటివారు 350 లోపు స్కోరును కట్టడి చేయగలిగారు. ఇది జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.
భారత మహిళల జట్టు ఇంతవరకు ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించలేదు. కానీ ఈసారి 339 పరుగుల ఛేదనతో చరిత్ర సృష్టించింది. దీంతో “చోకర్స్” అనే ముద్రను చెరిపేసుకుంది.
ఈ విజయంతో భారత మహిళా క్రికెట్ ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై తలపడబోతున్న భారత జట్టు ఈ ఊపును కొనసాగిస్తే, 1983 తరహా మరో చారిత్రక అధ్యాయం భారత క్రికెట్‌లో నమోదవుతుంది.
ఇవీ చదవండి: Bumrah : పవర్‌ప్లేలో బుమ్రా పంజా.. గంభీర్-సూర్య వ్యూహంతో ఆస్ట్రేలియాకు కష్టాలు!
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా టీ20 పోరులో టాప్ 5 బ్యాట్స్‌మన్లు.. నంబర్ 1 ఎవరో తెలుసా?
